-విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ ఎ. రవీంద్రరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ ఎ. రవీంద్రరావు శనివారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్హులైన ప్రతి పింఛన్ లబ్ధిదారునికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో పింఛన్ అందేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు.
సర్కిల్-3 పరిధిలోని సత్యం హోటల్ ప్రాంతంలో జరుగుతున్న పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. అక్కడ లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి ప్రతినెలా పింఛన్ సకాలంలో అందుతున్నదా, ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నారా, ఏవైనా సమస్యలు ఎదురవుతున్నాయా అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఆధార్ ధృవీకరణ, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్) ద్వారా పింఛన్ పంపిణీ ప్రక్రియను పరిశీలించి, పారదర్శకంగా సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
తదుపరి వన్‌టౌన్ పరిధిలోని పంజా సెంటర్లో జరుగుతున్న పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేసి, ప్రతి అర్హుడికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు సక్రమంగా చేరేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితర లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇంటి వద్దకే సేవలు అందించాలని తెలిపారు.
తదుపరి వన్‌టౌన్ రాధం సెంటర్ లో పారిశుద్ధ్య కార్యకలాపాలను పరిశీలించారు. ప్రధాన రహదారులు, అంతర్గత వీధుల్లో చెత్త ఎక్కడా పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని, డ్రైన్లు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణకు పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నగరంలో ప్రతి ప్రాంతంలో నిరంతర పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
అనంతరం గాంధీ మహిళా కళాశాల సమీపంలోని అన్నా క్యాంటీన్‌ను సందర్శించి అక్కడ అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిశుభ్రత, మెనూ, తాగునీటి సౌకర్యాలు, లబ్ధిదారులకు అందుతున్న సేవలను పరిశీలించారు. క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నాణ్యమైన, వేడి భోజనం నిరంతరం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ పర్యటనలో జోనల్ కమీషనర్ ఎన్. శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News