ఒత్తిడిపై విజయం.. సేవల్లో నాణ్యతకు నాంది.!

– విజ‌య‌వంతంగా స్ట్రెస్ మేనేజ్‌మెంట్ 11వ సెష‌న్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి – ప్రత్యేక సామర్థ్య నిర్మాణ (కెపాసిటీ బిల్డింగ్) సెషన్ల‌లో భాగంగా గురువారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో స్వ‌ర్ణ గ్రామం, స్వ‌ర్ణ వార్డు కార్య‌ద‌ర్శుల‌కు శిక్ష‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. సైకాల‌జిస్టులు డా. జి.శంక‌ర్ రావు, డా. టీఎస్ రావు, డా. బి.ప‌వ‌న్ కుమార్‌, డా. బి.న‌విత‌శ్రీ, డా. హ‌రిత బృందం రోజువారీ విధుల నిర్వ‌హ‌ణ‌లో ఒత్తిడిని అధిగ‌మించేందుకు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై సూచ‌న‌లు చేశారు. ఉద్యోగ జీవితంలో ఒత్తిడి సహజమైనదే అయినప్పటికీ, దానిని సమర్థవంతంగా నిర్వహించుకోవడం ద్వారా వ్యక్తిగత పనితీరుతో పాటు ప్రజలకు అందించే సేవల నాణ్యతను కూడా గణనీయంగా మెరుగుపరచవచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఆకస్మిక పరిస్థితుల్లో ఆందోళనకు గురికాకుండా పనులకు ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించడం, సమయానుకూలంగా విరామాలు తీసుకోవడం, సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవడం, అవసరమైనప్పుడు మానసిక ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా ఒత్తిడిని సమర్థంగా అధిగమించవచ్చని వివరించారు. ఒత్తిడి లక్షణాలను ముందుగానే గుర్తించి వాటికి తగిన పరిష్కారాలను అనుసరించడం, సీనియర్ల సూచనలను విమర్శగా కాకుండా పనితీరును మెరుగుపరచుకునే అవకాశంగా స్వీకరించడం ఉద్యోగుల్లో మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. సమతుల్య ఆలోచన, సమర్థ సమయ నిర్వహణ, సానుకూల దృక్పథమే ఒత్తిడి రహిత ప‌ని సంస్కృతికి, నాణ్యమైన ప్రజాసేవలకు బలమైన పునాదులని పేర్కొన్నారు. సిబ్బందిలో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత పనితీరు, సమస్య పరిష్కార నైపుణ్యాలు, వ్య‌క్తిత్వ వికాసం, డిజిట‌ల్ స్కిల్స్ త‌దిత‌రాల‌ను పెంపొందించడం ల‌క్ష్యంగా జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ వారి దిశానిర్దేశంతో ప్ర‌త్యేక సెష‌న్లు నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో మొత్తం 50 స్వ‌ర్ణ‌గ్రామం, స్వ‌ర్ణ వార్డు ఉద్యోగులు, స‌మ‌న్వ‌యక‌ర్త జి.జ్యోతి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *