-5–7, 15–17 ఏళ్ల వయస్సు పిల్లలకు సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా బయోమెట్రిక్ అప్డేషన్
-ఆధార్ అప్డేషన్ లేకపోతే భవిష్యత్తులో సేవలు పొందడంలో ఇబ్బందులు
-జిల్లాలో ఆధార్ సేవలను మరింత చేరువగా, సులభంగా అందించేందుకు చర్యలు
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పిల్లల ఆధార్లో తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేషన్ను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సూచించారు. ఆధార్ బయోమెట్రిక్ వివరాలను నిర్దేశిత వయస్సులో అప్డేట్ చేయకపోతే భవిష్యత్తులో ఆధార్ ఆధారిత సేవలు పొందే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు.
విజయవాడ కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో ఆధార్ నమోదు, అప్డేషన్ ప్రక్రియ, పెండింగ్లో ఉన్న తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేషన్లు, ఆధార్ కేంద్రాల పనితీరు తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ, పిల్లల వయస్సు పెరుగుతున్న కొద్దీ వారి బయోమెట్రిక్ వివరాలను ఆధార్లో అప్డేట్ చేయడం ఎంతో ముఖ్యమని తెలిపారు. 5–7 సంవత్సరాలు మరియు 15–17 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేషన్ను సెప్టెంబర్ 30, 2026 వరకు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని తమ పిల్లల ఆధార్ బయోమెట్రిక్ వివరాలను నిర్దేశిత గడువులోగా అప్డేట్ చేయించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేషన్ (MBU – Mandatory Biometric Update) పెండెన్సీపై అధికారులు కలెక్టర్కు వివరాలు అందించారు. 5–7 సంవత్సరాల వయస్సు పిల్లల్లో 31,184 మంది, 15–17 సంవత్సరాల వయస్సు పిల్లల్లో 37,470 మంది బయోమెట్రిక్ అప్డేషన్ పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. మొత్తం 68,654 మంది పిల్లల బయోమెట్రిక్ అప్డేషన్ను ప్రత్యేక దృష్టితో పూర్తి చేయాల్సి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం 206 ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. గత నెల రోజుల్లో జిల్లాలో ఆధార్ ఎన్రోల్మెంట్, అప్డేషన్కు సంబంధించి 28,821 కార్డుల ప్రక్రియ పూర్తయినట్లు వెల్లడించారు.
ప్రజలకు ఆధార్ సేవలు సులభంగా, వేగంగా అందేలా కేంద్రాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ జిల్లా కలెక్టరేట్లో పర్మనెంట్ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలోని ఆర్డీవో కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా పర్మనెంట్ ఆధార్ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఆధార్ నోడల్ అధికారిని ఆదేశించారు. ప్రజలు తమకు సమీపంలోని ఆధార్ కేంద్రాలను సద్వినియోగం చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు విద్యాశాఖ, ఐసీడీఎస్, ఇంటర్మీడియట్ విద్యాశాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, జూనియర్ కళాశాలల స్థాయిలో పిల్లలకు, తల్లిదండ్రులకు ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న పిల్లలను గుర్తించి, వారి ఆధార్ అప్డేషన్ను గడువులోగా పూర్తి చేసేలా సమన్వయంతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ ఎన్రోల్మెంట్, అప్డేషన్ సేవలు ప్రజలకు మరింత చేరువగా, సులభంగా అందించేందుకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆధార్ అవసరమయ్యే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే వివరాలను సరిచూసుకుని, అవసరమైన అప్డేషన్లను పూర్తి చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
ఈ సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అధికారి & జిల్లా ఆధార్ నోడల్ అధికారి కె.వై.ఎస్.ఆర్. రవికుమార్, హైదరాబాద్ యూఐడీఏఐ రీజనల్ ఆఫీస్ అసిస్టెంట్ మేనేజర్ ఏ.సత్యకళ, వీఎంసీ డిప్యూటీ కమిషనర్ శకుంతల, డీఎస్పీ సత్యనారాయణ, డీఈఓ సత్యకళ, డీఐఓ ప్రభాకర్, డీఆర్డీఏ పీడీ నాంచారారావు, డీఎంహెచ్ఓ, డ్వామా, పోస్టల్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News