-సభలో బిల్లును ప్రవేశపెట్టిన న్యాయ, మైనారిటీ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ఓమ్నిబస్ (స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) బిల్లు-2026కు శాసనసభ ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన శాసనసభ సమావేశాలు మూడవ రోజున స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిల్లును న్యాయ, మైనారిటీ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రవేశపెట్టారు. మంత్రి ఫరూక్ ప్రవేశపెట్టిన బిల్లులోని ముఖ్యాంశాలను ప్రశంసిస్తూ వాటికి పూర్తి మద్దతు తెలుపుతూ బిల్లును ఆమోదించాలని ఎమ్మెల్యే రామాంజనేయులు కోరారు. ప్రతిపాదనలకు సభ్యుల ఆమోదంతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.
బిల్లును ప్రవేశపెట్టినప్పుడు మంత్రి ఫరూక్ శాసనసభలో బిల్లు ముఖ్య ఉద్దేశంతో పాటు అందుబాటులోకి వచ్చే సులభతరమైన విధానాలను వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిల్లుతో రాష్ట్రంలో విశ్వాస-ఆధారిత నియంత్రణ చట్రాన్ని పెంపొందించుటకు, పౌరుల యొక్క జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుచుటకు, మరియు కార్యకలాపాల నిర్వహణను వేగవంతం చేయుటను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం సూచించిన నియంత్రణల సడలింపు, అనుసరణ భారాన్ని తగ్గించే సంస్కరణలను అమలు చేయడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని మంత్రి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీస్ చట్టం-1999 క్రింద ఫైర్ సేఫ్టీ నిబంధనలకు అంతర్జాతీయ ప్రమాణాలు మరియు మార్గదర్శకాలు ఆధారంగా ఉండేలా చేసినట్లు, నేషనల్ బిల్డింగ్ కోడ్‌కు సంబంధించిన ప్రస్తావనలను తొలగించినట్లు, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ల పునరుద్ధరణ కోసం థర్డ్-పార్టీ ఫైర్ ఆడిట్ ఏజెన్సీలు అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి, వాటి ఎంపానెల్మెంట్కు సంబంధించిన అర్హతలు, ప్రమాణాలు, విధులు, పర్యవేక్షణ మరియు క్రమశిక్షణా నిబంధనలను చేర్చినట్లు మంత్రి పేర్కొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ సింగిల్ విండో క్లియరెన్స్ చట్టం- 2002 కింద పరిశ్రమలకు సంబంధించిన అనుమతులపై క్రమబద్ధమైన పర్యవేక్షణ, స్పష్టమైన అధికారాలతో పాటు తప్పనిసరి ఎస్కలేషన్ అథారిటీతో కూడిన రాష్ట్ర మరియు జిల్లా కమిటీలతో కూడిన రెండు అంచెల సంస్థాగత వ్యవస్థను ఏర్పాటు చేయడాన్ని ప్రతిపాదించామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ గ్యారంటీ చట్టం- 2017 లో సేవలు తిరస్కరించబడినప్పుడు లేదా నిర్ణీత గడువులో అందించనప్పుడు, దరఖాస్తుదారులు తామే స్వయంగా అప్పీల్ దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా ఆటో-అప్పీల్ విధానం ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి ఫరూక్ వెల్లడించారు. ఏదైనా సేవ తిరస్కరించబడినా లేదా నిర్ణీత గడువులో అందించబడకపోయినా, అప్పీల్ స్వయంచాలకంగా దాఖలైనట్లుగా పరిగణించబడుతుందన్నారు. అప్పీలేట్ అథారిటీ 21 రోజుల్లోపు ఆ అప్పీల్‌ను పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. అవసరమైతే సేవను అందించమని ఆదేశించడంతో పాటు, పరిహారం చెల్లించాల్సిందిగా కూడా ఆదేశించవచ్చునని పేర్కొంటూ మంత్రి ఫరూక్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిల్లును ప్రవేశపెట్టగా శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
Prajavartha Online Telugu News