-బరితెగించి గ్రూప్ 1 నియామకాల్లో అవకతవకలు
-ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లతో జవాబు పత్రాల మూల్యాంకనం
-ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అభ్యర్థుల జవాబు పత్రాలు
-84 రోజుల పాటు హాయ్‌లాండ్‌లో పేపర్లు..నిబంధనలకు తిలోదకాలు
-సీఎం సీట్లో కూర్చుని నేరాలు చేసిన వ్యక్తి నేడు సమాధానం చెప్పేందుకు సభకు రాలేదు
-భవిష్యత్తులో ఇలాంటి అవకతవకలకు తావులేకుండా ఏపీపీఎస్సీ ప్రక్షాళన
-గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 అక్రమాలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్–1 పరీక్షల్లో ఊహకు కూడా అందని స్థాయిలో అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గత పాలకులు బరితెగించి అక్రమాలకు పాల్పడ్డారని.. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించాల్సిన గ్రూప్ 1 సర్వీసు అభ్యర్ధుల నియామకాల్లో అవకతవకలకు పాల్పడ్డారని అన్నారు. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, సెక్యూరిటీ గార్డులతో జవాబు పత్రాల మూల్యాంకనం చేయించారని శాసనసభకు తెలియచేశారు. 344 నిబంధన కింద శాసనసభలో చేపట్టిన ప్రత్యేక చర్చలో ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం ఏర్పడిన ఏపీపీఎస్సీ రాష్ట్రానికి కీలకమైన అధికారులను ఎంపిక చేసే సంస్థ అని..దాని విశ్వసనీయతను దెబ్బతీసేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో సీఎం సీట్లో కూర్చుని నేరాలు చేసిన వ్యక్తి నేడు వాటిపై ప్రజలకు సమాధానం చెప్పేందుకు శాసనసభకు రాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్షేపించారు. ఎదురు దాడి చేసేందుకు 24 గంటలూ కుట్రలు చేయటం కాదని బాధ్యతాయుతంగా జవాబు చెప్పాలని సవాలు చేశారు.
కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోలేదు
2018లో జారీ చేసిన గ్రూప్–1 నోటిఫికేషన్‌కు 1.14 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 325 మందిని షార్ట్‌లిస్ట్ చేశారని. ఎంతో శ్రమించి అభ్యర్థులు ఉద్యోగాలు సాధించుకునే ఈ పరీక్షల నిర్వహణలో నిబంధనలను పూర్తిగా విస్మరించారని సీఎం అన్నారు. పదో తరగతి పరీక్షల జవాబు పత్రాలను సైతం అత్యంత భద్రత మధ్య పోలీసు ఎస్కార్టుతో తరలిస్తామని, అలాంటిది రాష్ట్రాన్ని పాలించే అధికారులను ఎంపిక చేసే గ్రూప్–1 పరీక్షల జవాబు పత్రాల విషయంలో భద్రతను గాలికి వదిలేసి ఇష్టానుసారం వ్యవహరించారన్నారు. డిజిటల్ మూల్యాంకనాన్ని పక్కనపెట్టి మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ కోర్టును తప్పు దోవ పట్టించేలా అఫిడవిట్లు దాఖలు చేశారని చంద్రబాబు అన్నారు. కోర్టు ఆదేశాల తర్వాత సరిదిద్దుకోవాల్సింది పోయి హాయ్‌లాండ్‌లో మూల్యాంకనం కోసం రూ.1.19 కోట్ల విలువైన పనులకు ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. ఒకవైపు కోర్టు ఆదేశాలు ఉండగానే ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టారని తెలిపారు. హైకోర్టు ఈ వ్యవహారంపై విచారణ జరిపి విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు.
ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లతో పేపర్లు దిద్దించారు
గ్రూప్–1 వంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలకు అభ్యర్థులు రాసిన పరీక్షా పత్రాలను అర్హత లేని ప్రైవేటు వ్యక్తులతో దిద్దించారని సీఎం మండిపడ్డారు. ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులు, గృహిణులు, నిరుద్యోగులు, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు, ల్యాబ్ టెక్నీషియన్లతో జవాబు పత్రాల మూల్యాంకనం చేయించారని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, హెచ్‌ఓడీలు వంటి నిపుణులు చేయాల్సిన మూల్యాంకనాన్ని టీచర్లు, లెక్చరర్లు, ఇతర అనర్హులతో చేయించడం తీవ్ర ఉల్లంఘన అని అన్నారు. మొత్తం 158 మంది ప్యానల్‌ను ఎంపిక చేసి అందులో 72 మందికి మూల్యాంకన బాధ్యతలు అప్పగించారని, వారిలో 25 మంది అనధికారికంగా నియమించిన వారేనని చంద్రబాబు తెలిపారు. మరో 66 మంది ఎవాల్యుయేటర్లు అనధికారికంగా పరీక్ష పత్రాలు దిద్దారని ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తుల ల్యాప్‌టాప్‌లకు పరీక్షా మూల్యాంకన వివరాలను పంపించారని, పీడీఎఫ్ జవాబు పత్రాలను ప్రైవేటు ఈ-మెయిళ్లు, గూగుల్ డ్రైవ్, వాట్సప్ ద్వారా పంపించారని చెప్పారు. ఏపీపీఎస్సీ స్ట్రాంగ్ రూమ్ నుంచి జవాబు పత్రాలను అనధికారికంగా తరలించి 84 రోజుల పాటు హాయ్‌లాండ్‌లో ఉంచారని సీఎం తెలిపారు. మొదట హైదరాబాద్‌లో, ఆ తర్వాత హాయ్‌లాండ్‌లో మూల్యాంకనం నిర్వహించారని చెప్పారు. హాయ్‌లాండ్‌లో మూల్యాంకనం జరగలేదని హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చిన సమయంలోనే లాజిస్టిక్స్ కోసం రూ.1.14 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు.
డూప్లికేట్ ఓఎంఆర్ స్లిప్పులు
కొత్త చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాన్యువల్ ఎవాల్యుయేషన్‌కు ఆదేశాలు ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. 49 వేల డూప్లికేట్ ఓఎంఆర్ స్లిప్‌లు ముద్రించినట్లు చెప్పారు. జవాబు పత్రాల్లో వేర్వేరు రాతలు, మార్పులు, చేర్పులు, ఓవర్‌రైటింగ్‌లు గుర్తించారని తెలిపారు. 734 ఓఎంఆర్ స్లిప్‌లలో 718 స్లిప్‌లలో మార్పులు జరిగినట్లు వెల్లడించారు. 21 స్లిప్‌లపై ఎలాంటి సంతకాలు లేకపోవడం అక్రమాల తీవ్రతకు నిదర్శనమన్నారు. గ్రూప్–1 పరీక్ష రాసిన ఒక అభ్యర్థినే అదే పరీక్షకు ఎవాల్యుయేషన్ ఎగ్జామినర్‌గా నియమించడం మరింత దారుణమని సీఎం అన్నారు. ఎగ్జామినర్ల జాబితాలను వాట్సప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో పెట్టారని తెలిపారు. మూల్యాంకనం జరిగే హాల్లో 17 రోజుల పాటు సీసీ కెమెరాలు లేకపోవడం, మొబైల్ ఫోన్లను అనుమతించడం వంటి దారుణాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం వైటనర్ వినియోగించకూడదని స్పష్టం చేస్తుండగా, ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్‌లలో వైటనర్ వినియోగించినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికలు వెల్లడించాయని చంద్రబాబు తెలిపారు.
వ్యవస్థలు యువత భవిష్యత్తు కోసమే
2019–24 మధ్య రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని చాలా సార్లు చెప్పానని సీఎం గుర్తుచేశారు. ప్రజా వేదిక నుంచి రాష్ట్ర బ్రాండ్ వరకు దెబ్బతీశారని, ప్రభుత్వంలోని వివిధ వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం పోయేలా గత పాలకులు వ్యవహరించారని విమర్శించారు. వ్యక్తుల కోసం వ్యవస్థ కాదు.. యువత భవిష్యత్తు కోసమే వ్యవస్థ. తప్పు చేస్తే కఠినంగా శిక్ష పడుతున్న భయం ఉండాలని అన్నారు. అసెంబ్లీ జవాబుదారీతనానికి వేదిక అని, ఇక్కడి నుంచే ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత ఉందని చంద్రబాబు అన్నారు. తప్పు చేసి పారిపోవడం కాదని, ఎందుకు జరిగిందో చెప్పాల్సిన బాధ్యత సంబంధిత వ్యక్తులపై ఉందన్నారు. గ్రూప్–1 పరీక్షల్లో జరిగిన అక్రమాలను పూర్తిగా విశ్లేషించి తదుపరి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఏపీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని పారదర్శకమైన మూల్యాంకన విధానం, బలమైన భద్రతా ప్రమాణాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలు, మేధావుల నుంచి అభిప్రాయాలు తీసుకుని సంస్కరణలు చేపడతామని వెల్లడించారు. ఇలాంటి అక్రమాలు మళ్లీ జరగకుండా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. తప్పు చేసిన వ్యక్తులు ఎప్పటికైనా దొరికిపోతారు అనడానికి ఏపీపీఎస్సీ గ్రూప్–1 పరీక్షలే ఉదాహరణ అని సీఎం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇంత దారుణమైన కుంభ కోణం జరిగితే రాష్ట్ర భవిష్యత్తు ఏమిటో ప్రజలు ఆలోచించాలని ముఖ్యమంత్రి అన్నారు.
Prajavartha Online Telugu News