Breaking News

వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో యువతే కీలకం

-బీజేవైఎం ఆధ్వర్యంలో ‘యంగ్‌ పొలిటికల్‌ లీడర్స్‌ డైలాగ్‌’.. 22, 23 తేదీల్లో విజయవాడలో సదస్సు…బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి
-28 జిల్లాల నుంచి 500 మంది యువ ప్రతినిధులు.. వివిధ రంగాల నిపుణులతో చర్చలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2047 నాటికి భారత్‌ను వికసిత్‌ భారత్‌గా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌రెడ్డి పిలుపునిచ్చారు. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ‘వికసిత్‌ భారత్‌ యంగ్‌ పొలిటికల్‌ లీడర్స్‌ డైలాగ్‌’ కార్యక్రమాన్ని ఈ నెల 22, 23 తేదీల్లో విజయవాడలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

దేశ నిర్మాణంలో రాజకీయాలతో పాటు వివిధ వృత్తుల్లో ఉన్న యువత భాగస్వామ్యం కావాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు సునీల్‌రెడ్డి తెలిపారు. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యువతను ఎంపిక చేసి, 28 జిల్లాల నుంచి సుమారు 500 మంది ప్రతినిధులను సదస్సుకు ఆహ్వానించినట్లు చెప్పారు. న్యాయవాదులు, వైద్యులు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు, రైతులు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, విద్యార్థులు తదితర వివిధ రంగాలకు చెందిన యువత ఇందులో పాల్గొంటారని వివరించారు.

వికసిత్‌ భారత్‌తో పాటు వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌
2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే ప్రతి రాష్ట్రం, జిల్లా, గ్రామం కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. వికసిత్‌ భారత్‌తో పాటు వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌, వికసిత్‌ జిల్లాల నిర్మాణంలో యువత పాత్రపై సదస్సులో చర్చిస్తామని తెలిపారు. యువ ప్రతినిధులు తమ జిల్లాలు, గ్రామాలకు వెళ్లి అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన మార్గాలపై కూడా చర్చిస్తామని చెప్పారు.

ఎనిమిది ప్రత్యేక సెషన్లు
రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో ఎనిమిది సెషన్లు నిర్వహించనున్నట్లు సునీల్‌రెడ్డి తెలిపారు. 2014కు ముందు భారత్‌ పరిస్థితి, 2014 తర్వాత జరిగిన మార్పులు, స్వాతంత్ర్య ఉద్యమంలో భారత పాత్ర, ఇండియా సివిలైజేషన్‌ జర్నీ అండ్‌ పార్టిషన్‌, మహిళా నాయకత్వం, గ్లోబల్‌ లీడర్‌షిప్‌, ‘ఇన్‌సైట్స్‌ ఫ్రమ్‌ మోదీ లీడర్‌షిప్‌’, యూత్‌ ఓపెన్‌ మైక్‌ అండ్‌ లీడర్‌షిప్‌ డైలాగ్‌ తదితర అంశాలపై చర్చలు జరుగుతాయన్నారు. ప్రతినిధులతో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పారు.

ముఖ్య అతిథులుగా పలువురు ప్రముఖులు

సదస్సు ప్రారంభ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌తో పాటు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, శ్రీనివాస్‌ వర్మ, అనురాగ్‌ ఠాకూర్‌, సత్యకుమార్‌, సుజనా చౌదరి తదితరులు పాల్గొంటారని చెప్పారు. గురుప్రకాశ్‌, రఘునందన్‌రావు, లావు శ్రీకృష్ణదేవరాయలు, రష్మి సామంత్‌, మాజీ ఐఎఎస్ జయప్రకాశ్‌ నారాయణ్‌ తదితర ప్రముఖులు కూడా వివిధ సెషన్లలో పాల్గొంటారని వెల్లడించారు.

ప్రతి జిల్లాలో యువతతో కార్యక్రమాలు
‘యంగ్‌ పొలిటికల్‌ లీడర్స్‌ డైలాగ్‌’ను ప్రతి సంవత్సరం నిర్వహించడంతో పాటు రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ యువత కోసం ఇలాంటి కార్యక్రమాలను చేపడతామని సునీల్‌రెడ్డి తెలిపారు. వివిధ వృత్తుల్లో రాణిస్తున్న యువతను ఒకే వేదికపైకి తీసుకువచ్చి దేశాభివృద్ధిలో వారి పాత్రను గుర్తించడమే లక్ష్యమన్నారు.

యువతను అభివృద్ధి వైపు నడిపిస్తాం
కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు యువతను ఇతర మార్గాల వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించిన సునీల్‌రెడ్డి.. బీజేవైఎం మాత్రం నరేంద్ర మోదీ నాయకత్వంలో యువతను వికసిత్‌ భారత్‌ నిర్మాణం వైపు నడిపిస్తోందన్నారు. 1947లో స్వాతంత్ర్యం సాధించామని, 2047 నాటికి స్వాతంత్ర్యానికి వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రపంచంలో భారత్‌ను అగ్రదేశంగా నిలబెట్టే సంకల్పంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఈ సమావేశంలో రాష్ట్ర మీడియా ఇంచార్జ్ కిలారు దిలీప్, బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడికొండల సింధు, ప్రధాన కార్యదర్శులు నాగోతు హరికృష్ణ, అజేష్ యాదవ్, సెక్రటరీలు శ్రీ నవ్య, నరేంద్ర వర్మ, పాలసీ & సోషల్ మీడియా,లీగల్ సెల్ కో- కన్వీనర్లు తేజస్విని, వంశీ, రవినాయుడు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు శివకృష్ణారెడ్డి, కృష్ణా జిల్లా ఇంచార్జి హరీష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *