-ఉదయం 11:32 గంటలకు శుభ ముహూర్తాన ప్రారంభించనున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు
-ఒకే విడతలో 800 మందికి భోజన సదుపాయం.. త్వరలో అందుబాటులోకి ‘యాంత్రీకృత వంటశాలలు’
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం రూ. 52.50 కోట్ల భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన “శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సదనం” మరియు “శ్రీ దుర్గా భవాని మహాప్రసాద భవనం” (లడ్డూ పోటు) ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది.
ఈ భవనాలను ఆగస్టు 21, 2026 (శుక్రవారం) నాడు శ్రీ పరాభవ నామ సంవత్సర శ్రావణ శుద్ధ నవమి, అనూరాధా నక్షత్రయుక్త తులా లగ్న పుష్కరాంశమున ఉదయం 11:32 గంటలకు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా శాస్త్రోక్తంగా ప్రారంభించి భక్తులకు అంకితం చేయనున్నారని ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ), ఈవో శీనా నాయక్ తెలిపారు.
1. శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సదనం (వ్యయం: రూ. 26.00 కోట్లు):
విస్తీర్ణం: 5,400 చదరపు మీటర్లు (సుమారు 58,125 చదరపు అడుగులు).
గ్రౌండ్ ఫ్లోర్: సెంట్రల్ స్టోర్, నిత్యాన్నదాన నిల్వ గదులు, కిచెన్ ప్రిపరేషన్ ఏరియా, క్యూ లైన్లు మరియు వాష్‌రూమ్‌లు. సరుకుల రవాణా సులభతరం చేసేందుకు మూడు వైపుల నుండి వాహనాల రాకపోకలకు మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయి.
మొదటి అంతస్తు: పూర్తిగా డైనింగ్ హాల్‌గా కేటాయించబడింది. ఇందులో ఒకేసారి 800 మంది భక్తులు కూర్చుని అన్నప్రసాదం స్వీకరించేలా ఆధునిక వసతులు, 80 చ.మీ విస్తీర్ణంలో ప్రత్యేక వాష్ ఏరియాను సిద్ధం చేసామని పేర్కొన్నారు.
2. శ్రీ దుర్గా భవాని మహాప్రసాద భవనం (వ్యయం: రూ. 26.50 కోట్లు):
విస్తీర్ణం: 3,600 చదరపు మీటర్లు (సుమారు 38,748 చదరపు అడుగులు).
గ్రౌండ్ & మొదటి అంతస్తులు: ప్రసాదం విక్రయ కౌంటర్లు, పంపిణీ కేంద్రాలు మరియు భక్తుల క్యూ లైన్లు.
రెండు & మూడవ అంతస్తులు: పులిహోర, చక్కెరపొంగలి, లడ్డూ వంటి మహాప్రసాదాల తయారీ, ప్యాకింగ్, స్టాకింగ్ (నిల్వ) మరియు నిర్వహణ కోసం అధునాతన రీతిలో తీర్చిదిద్దుతున్నామని వివరించారు.
త్వరలో ‘యాంత్రీకృత వంటశాలలు’ (Mechanised Kitchens):
రాబోయే రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అత్యున్నత పరిశుభ్రత (హైజీన్), నాణ్యతలో ఏకరూపత మరియు వేగవంతమైన ఆహార తయారీ లక్ష్యంగా ఈ భవనాల్లో అత్యాధునిక యాంత్రీకృత వంటశాలలను ఏర్పాటు చేయనున్నట్లు దేవస్థానం వెల్లడించింది.
ఆగస్టు 21న జరగనున్న ఈ మహత్తర ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను దేవస్థాన ఇంజనీరింగ్ పూర్తి చేస్తుందని ఈవో తెలిపారు.
Prajavartha Online Telugu News