Breaking News

అన్న క్యాంటీన్లలో ఆహార నాణ్యత, సేవలపై ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు తెలుసుకున్న కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం గులాబీతోటలోని అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లో అందిస్తున్న అల్పాహారం, భోజనం నాణ్యత, పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్యాంటీన్‌కు భోజనం చేసేందుకు వచ్చిన ప్రజలతో కమిషనర్ నేరుగా మాట్లాడి, అన్న క్యాంటీన్‌లో అందిస్తున్న ఆహారం రుచి, నాణ్యత, పరిమాణం, ధరలు, సమయపాలన, సౌకర్యాలు తదితర అంశాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అందిస్తున్న ఫీడ్‌బ్యాక్‌ను స్వీకరించి, వారి సూచనలు మరియు సమస్యలను నమోదు చేసుకుని, అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అన్న క్యాంటీన్లు పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన ఆహారం అందించే ముఖ్యమైన సేవా కేంద్రాలని కమిషనర్ పేర్కొన్నారు. క్యాంటీన్లలో ఆహార నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదని, పరిశుభ్రత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు.

క్యాంటీన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, వంటశాల, భోజన ప్రదేశం, తాగునీటి సదుపాయాలు తదితర ప్రాంతాలను పరిశుభ్రంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు సౌకర్యవంతమైన, నాణ్యమైన సేవలు అందేలా నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ప్రజల నుంచి నేరుగా అందే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అన్న క్యాంటీన్ల సేవలను మరింత మెరుగుపరచేందుకు చర్యలు చేపడతామని కమిషనర్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *