– ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో నిర్వహణ
– క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
– ఓటర్లకు సేవలందించేందుకు సమన్వయంతో కృషి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా జులై 31న ముసాయిదా జాబితా ప్రచురణ జరిగిందని.. అప్పటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ జరగనున్న నేపథ్యంలో ఈ నెల 22, 23, 29, 30 తేదీలను ప్రత్యేక ప్రచార దినాలుగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమం విజయవంతమయ్యేలా క్షేత్రస్థాయిలో అధికారులు, బీఎల్‌వోలు చర్యలు తీసుకోవాలని, సమన్వయంతో పనిచేసి ఓటర్లకు సేవలందించాలని సూచించారు.
గురువారం సచివాలయం నుంచి రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) వివేక్ యాదవ్.. అన్ని జిల్లాల కలెక్టర్లతో సర్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, జిల్లా అధికారులు హాజరయ్యారు. అక్టోబర్ 3వ తేదీన తుది జాబితా ప్రచురణ చేయాల్సి ఉన్నందున షెడ్యూల్ ప్రకారం అన్ని పనులను పూర్తిచేయాలని వివేక్ యాదవ్ సూచించారు. ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. వీసీ అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ నోటీసుల జారీ, ధ్రువపత్రాల పరిశీలన, విచారణ, తుది ఉత్తర్వుల జారీ తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి ప్రక్రియ సజావుగా జరిగేలా కృషిచేయాలన్నారు. ఫారం – 6, ఫారం – 7, ఫారం – 8ల పరిష్కారానికీ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక ప్రచార దినాల్లో బీఎల్‌వోలు పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు. ముసాయిదా జాబితాతో పాటు ఏఎస్‌డీడీ జాబితా, నోటీసులు జారీ అయిన వారి వివరాలు వంటివి అందుబాటులో ఉంచుకొని దరఖాస్తులు స్వీకరించడంతో పాటు సందేహాలు నివృత్తి చేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News