-రూ.25 కోట్ల భారీ అవినీతి, అక్రమాలు
-మార్కెట్ ధరలకన్నా 30 నుంచి 40 శాతం అధిక ధరలకు కొనుగోలు
-జర్నలిస్టులపై భూ కబ్జాదారుల దాడులను ఖండిస్తున్నాం
-జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలి
-స్థానిక సంస్థల ర్పుిర్వేషన్లపై అఖిలపక్షం వేయాలి
-ఆర్టీఈ`2009 ప్రకారం 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలి
-విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ) వస్తువుల కొనుగోళ్ల టెంటర్లలో భారీ అవినీతి, అక్రమాలు వెలుగుచూశాయని, తక్షణమే ఆయా టెండర్లను రద్దుచేd,¾ అవినీతికి పాల్పడిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. అవినీతి మయమైన టెండర్లు రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ ఆందోళనలు చేపడుతుందని వెల్లడించారు.
విజయవాడ దాసరిభవన్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అవినీతి, అక్రమాలు వెలికితీస్తున్న జర్నలిస్టులపై దాడులు, భూ కబ్జాదారుల ఆగడాలు, మాఫియా కార్యకలాపాలు, విద్యా వ్యవస్థలో నెలకొన్న అవకతవకల గురించి ప్రస్తావించారు.
కేజీబీవీ టెండర్లలో అక్రమాలపై ఇప్పటికే సీఎం చంద్రబాబుకు సీపీఐ పక్షాన రెండుసార్లు లేఖలు రాశామని గుర్తుచేశారు. కేజీబీవీలో సరుకుల కొనుగోలు టెండర్లలో మార్కెట్ ధర, ఎంఆర్‌పీ ధరల కంటే 30 నుంచి 40 శాతం ధరలను అధికంగా పెంచి ఆమోదించారన్నారు. అందుకోసం దాదాపు రూ.25 కోట్ల చేతులు మారాయన్న ఆరోపణలున్నాయని, దానికి అధికారులు వింతండవాదనలు తీసుకురావడం సరికాదన్నారు. కేజీబీవీ టెండర్లను అర్ధరాత్రి హడావుడీగా ఖరారు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఇందులో అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ టెండర్లకు టెక్నిక్ ఎవాల్యుయేషన్ టైమ్ జులై 31వ తేదీ రాత్రి 11.25 వరకు ఉండగా, ఫైన్ బిడ్ ఓపెన్డ్ టైమ్ జులై 31 రాత్రి 11.45గా ఉందన్నారు. ఇలా రాత్రుళ్లు పని చేయాల్సిన పరిస్థితులు సర్వశిక్షా అభియాన్ అధికారులకు ఎందుకొచ్చిందో, పాత టెండర్‌దారుల కాలం ఆగస్టు చివరి వరకు ఉన్నప్పటికీ అర్థాంతరంగా వారిని తొలగించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని సూటిగా ప్రశ్నించారు. మార్కెట్ ధరలకన్నా దాదాపు 30 నుండి 40 శాతం వరకు అధిక ధరలు వెచ్చించి సరుకులు కొనుగోలుకు కేజీబీవీ టెండర్లు ఖరారు చేయడం దుర్మార్గమని తెలిపారు. గోధుమ పిండి ఓపెన్ మార్కెట్ ధర రూ.42 ఉంటే, కేజీబీవీ టెండర్ ధర రూ.68.88; సన్ ఫ్లవర్ ఆయిల్ ఓపెన్ మార్కెట్ ధర రూ.171కాగా, కేజీబీవీ ధర రూ.200.49; అలాగే వరుసగా మార్కెట్ ధర హార్లిక్స్ రూ.380కాగా, కేజీబీవీ ధర రూ.533.82; కారంపొడి రూ.300 ఉంటే, కేజీబీవీ ధర రూ.492, ఉప్పు రూ.25 ఉంటే కేజీబీవీ ధర రూ.32.57, పాలు 57 ఉంటే కేజీబీవీ ధర రూ.76.26, కోడిగుడ్డు రూ.6.20కాగా, కేజీబీవీ ధర రూ. 7.50కు అత్యధికంగా టెండర్లు ఖరారు చేయడం దుర్మార్గమన్నారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి ఈ కామర్స్ ఫ్లాట్‌ఫారంలలోని ధరలను ప్రామాణికంగా తీసుకోలేదన్నారు. 10 నెలల కాలానికి బల్క్‌గా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు సాధారణ రిటైల్ ధర కంటే ధర తగ్గాలేగాని పెరగకూడదని అన్నారు. డి మార్ట్, మెట్రో వంటి సంస్థల్లోను సాధారణ రిటైల్ ధరల కంటే సుమారు 6 శాతం ధరలు తక్కువగా ఉంటాయని చెప్పారు. బ్లింక్‌ట్, బిగ్ బాస్కెట్ వంటి ఈ కామర్స్ ఫ్లాట్‌ఫారమ్‌ల ధరలు ప్రామాణికంగా తీసుకున్నప్పుడు మళ్లీ టెండర్లు పిలవాల్సిన అవసరం ఎందుకు?, నేరుగానే కొనుగోలు చేయవచ్చు కదా? అని ప్రశ్నించారు. కేజీబీవీ సరుకుల అక్రమ టెండర్లను రద్దుచేసి, చిన్న వెండర్లకు అవకాశం కల్పించాలని, కొత్తగా టెండర్లు పిలిచి, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. లేని పక్షంలో సీపీఐ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని తెలిపారు.
రాష్ట్రంలో జర్నలిస్టులపైన, ఆర్టీఐ కార్యకర్తలపైన భూ కబ్జాదారుల, రియల్, ఇసుక, మట్టి మైనింగ్ మాఫియాల అక్రమాలు, దాడులు మితిమీరిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల విశాలాంధ్ర విలేకరి గోవింద్‌పై భూ అక్రమార్కుల దాడిని తీవ్రంగా ఖండించారు. జర్నలిస్ట్ గోవింద్‌పై దాడికి పాల్పడిన వారిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల రక్షణకు, భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. ప్రశ్నించిన గొంతుకలను అణచివేసేలా వ్యవహరించడం తగదన్నారు. విజయనగరం జిల్లాల్లో స్థానిక ఎమ్మెల్యే ప్రభావంతో కొనసాగుతున్నట్లు ఆరోపించిన భూకబ్జాలు, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడిచేసి హత్య చేసిన ఘటనను గుర్తుచేశారు. ఇసుక మాఫియాపై వార్తలు రాసిన జర్నలిస్టులను బెదిరింపులు, భౌతిక దాడులతో భయపెట్టే ప్రయత్నాల్ని తప్పుపట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనుల భూములు, ఇసుక, ఖనిజ సంపదకు సంబంధించిన అక్రమాలపై వార్తలు రాస్తే జర్నలిస్టులను చంపుతామని బెదిరించిన ఘటనలు చోటు చేసుకున్నాయని వివరించారు. బాపట్ల జిల్లాకు చెందిన నాగార్జునరెడ్డి గతంలో జర్నలిస్టుగా పనిచేసిన ఆర్టీఐ కార్యకర్త అని, ఇసుక మాఫియా ఆయనను కిడ్నాప్ చేసి తీవ్రంగా హింసించిందని, అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారన్నారు. బాధితుల పక్షాన పోలీసు వ్యవస్థ నిలబడకుండా దాడులకు పాల్పడినవారికి అనుకూలంగా తేలికపాటి కేసులు నమోదు చేసి, దుండగులు తప్పించుకునే అవకాశం కల్పిస్తోందని విమర్శించారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి, డీజీపీ, హోంమంత్రి, విజయనగరం జిల్లా ఎస్పీకి తక్షణం కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు చర్యలు లేవన్నారు.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 34 శాతం కేటాయిస్తామంటూ సీఎం చంద్రబాబు ప్రకటించడంపై అనేక అనుమానాలున్నాయని ఈశ్వరయ్య చెప్పారు. హైకోర్టు తీర్పులకు అనుగుణంగా 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికే ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 7 శాతం, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని, వాటిన్నింటీనీ కలిపితే రిజర్వేషన్లు 50 శాతానికి మించిపోతున్నాయనీ, దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధానంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఎవరికి అన్యాయం చేస్తారంటూ సూటిగా ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం(ఆర్టీఈ)-2009 సక్రమంగా అమలు జరగటం లేదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21`ఏ ద్వారా బాల బాలికలందరికీ విద్య ప్రాథమిక హక్కుగా ఉండాలని, రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించి, ఫీజు రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథ్‌రెడ్డి, జంగాల అజయ్‌కుమార్, కె.రామాంజనేయులు, దోనేపూడి శంకర్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News