-మెగా డీఎస్సీ పై శాసనమండలిలో చర్చ జరగనీయకుండా అసలు శాసనసభకు రాకుండా పారిపోయారు
-జగన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్
-ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి పరీక్ష విధానాల పట్ల ఉన్న అవగాహన రాహిత్యానికి ఇది నిదర్శనం
-నాడు పట్టిసీమ దండగ అన్న జగన్ నేడు తాడేపల్లి ప్యాలెస్ లో తాగేది పట్టిసీమ నీళ్లే
-పునాదులు లేని భవనం కూలిపోయినట్లే మెగా డీఎస్సీ పై వాస్తవాలు లేని జగన్ ఆరోపణలు కూలిపోయాయి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మెగా డీఎస్సీపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి పరీక్షల విధానాలు, నియామక ప్రక్రియపై కనీస అవగాహన లేకపోవడం ఆయన వ్యాఖ్యలతో స్పష్టమవుతోందన్నారు. మెగా డీఎస్సీపై జగన్ చేస్తున్న ఆరోపణలు పునాదులు లేని భవనం కూలిపోయినట్టుగా ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయని పేర్కొన్నారు.
మెగా డీఎస్సీపై జగన్‌ది రోజుకో మాట.. పూటకో ఆరోపణగా ఉందని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. ఒకసారి పేపర్ లీకేజీ అంటారని, మరోసారి స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడతారని, ఇంకోసారి ఉద్యోగాలు రాలేదని చెబుతున్నారని విమర్శించారు. అసలు జగన్ ఏం చెప్పదలుచుకున్నారో ఆయనకే స్పష్టత లేదన్నారు. మెగా డీఎస్సీపై జగన్ చేస్తున్న ఆరోపణలకు నియామకాలు పొందిన ఉపాధ్యాయులే సమాధానం చెబుతున్నారని తెలిపారు. 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరిగిన నియామకాలను తప్పుబట్టేలా మాట్లాడటం ద్వారా ఎంపికైన అభ్యర్థులను, వారి కుటుంబాలను జగన్ అవమానిస్తున్నారని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులను క్షోభకు గురిచేసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
కోర్టుల్లో వందలాది కేసులు, న్యాయపరమైన చిక్కులు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించి మెగా డీఎస్సీ నిర్వహించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఉమ పేర్కొన్నారు. ఉపాధ్యాయ నియామకాలపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, 16 వేలకుపైగా టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారని తెలిపారు. నియామకాలు పొందిన ఉపాధ్యాయుల ఆనందాన్ని చూసైనా జగన్‌లో మార్పు రావడం లేదని విమర్శించారు.
నాడు పట్టిసీమను దండగ అన్న జగన్‌రెడ్డి.. నేడు అదే ప్రాజెక్టు ద్వారా అందుతున్న గోదావరి జలాల ప్రయోజనాలను చూస్తున్నారని దేవినేని ఉమ అన్నారు. చంద్రబాబు దూరదృష్టితో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ఫలితాలు నేడు రాష్ట్రానికి అందుతున్నాయని చెప్పారు. పట్టిసీమ నీటిని చూస్తూనైనా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలకు జగన్ స్వస్తి పలకాలని సూచించారు.
పోలవరం ఎడమ కాలువలో గత ప్రభుత్వం కనీసం తట్ట మట్టి కూడా తీయలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతమయ్యాయని ఉమ పేర్కొన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై జగన్‌కు ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. చంద్రబాబు గతంలో ప్రారంభించిన, ముందుకు తీసుకెళ్లిన సాగునీటి ప్రాజెక్టులు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా సాగుతున్నాయని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 నియామకాల్లో చోటుచేసుకున్న ఆరోపణలపై సిట్ విచారణలో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయని దేవినేని ఉమ అన్నారు. పరీక్షలు, నియామకాల్లో పారదర్శకత గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. తన ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై సమాధానం చెప్పకుండా మెగా డీఎస్సీపై ఆరోపణలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని విమర్శించారు.
ప్రజలు 11 సీట్లు ఇస్తే తనను గౌరవించలేదంటూ జగన్ గగ్గోలు పెడుతున్నారని దేవినేని ఉమ అన్నారు. ప్రజలు ఎందుకు అంతటి తిరస్కరణ ఇచ్చారో ముందుగా జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి పదవిపై ఉన్న వ్యామోహం కంటే ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, యువత భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
Prajavartha Online Telugu News