– నేవీ, కోస్ట్‌గార్డ్‌కు చెందిన 7 నౌకలతో సముద్రంలో విస్తృత గాలింపు
– డోర్నియర్ విమానాలు, నేవీ హెలికాప్టర్‌తో గగనతలం నుంచి సెర్చ్
– హల్దియా, పారాదీప్ కోస్ట్‌గార్డ్ కేంద్రాలు కూడా రంగంలోకి
– అందుబాటులో ఉన్న అన్ని వనరులతో గాలింపు చర్యలు ముమ్మరం
– మత్స్యకారులను సురక్షితంగా తీసుకొచ్చే వరకు గాలింపు కొనసాగిస్తాం
– కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి – మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వాడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు చెందిన బోటులో చేపల వేటకు వెళ్లి అదృశ్యమైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం భారత నౌకాదళం, భారత తీర రక్షక దళం సమన్వయంతో సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR) ఆపరేషన్‌ను మరింత ముమ్మరం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మత్స్యకారులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడమే లక్ష్యంగా సముద్రం, గగనతలం నుంచి విస్తృతంగా గాలిస్తున్నామని చెప్పారు. ఆగస్టు 3న ఏడుగురు మత్స్యకారులతో బోటు చేపల వేటకు వెళ్లిందని, నిర్ణీత సమయానికి తిరిగి రాకపోవడంతో సమాచారం అందిన వెంటనే సంబంధిత శాఖలను అప్రమత్తం చేసి గాలింపు చర్యలు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఆగస్టు 17 నుంచి భారత తీర రక్షక దళానికి చెందిన ఐదు నౌకలు గాలింపు చర్యల్లో పాల్గొంటుండగా, భారత నౌకాదళం మరో రెండు నౌకలను రంగంలోకి దించడంతో ప్రస్తుతం మొత్తం ఏడు నౌకలు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయని వెల్లడించారు. నేవీకి చెందిన ఒక నౌక విశాఖపట్నం నుంచి పారాదీప్ వైపు, మరో నౌక ఓడలరేవు వైపు గాలింపు కొనసాగిస్తున్నట్లు వివరించారు.
సముద్రంలో గాలింపుతో పాటు వైమానిక సెర్చ్ ఆపరేషన్‌ను కూడా మరింత విస్తృతం చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. విశాఖపట్నం, కోల్‌కతా, చెన్నై కేంద్రాల నుంచి డోర్నియర్ విమానాలతో సెర్చ్ సార్టీలు నిర్వహిస్తున్నామని, కోల్‌కతా నుంచి నేవీ హెలికాప్టర్‌ను కూడా గాలింపు చర్యలకు వినియోగిస్తున్నామని చెప్పారు. సముద్రంలోని సంభావ్య ప్రాంతాలను గగనతలం నుంచి జల్లెడ పడుతూ గాలింపు పరిధిని నిరంతరం విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. హల్దియా, పారాదీప్ కోస్ట్‌గార్డ్ కేంద్రాలను కూడా గాలింపు చర్యల్లో భాగస్వామ్యం చేశామని మంత్రి తెలిపారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగిస్తూ సముద్ర ప్రాంతంలో విస్తృతంగా గాలిస్తున్నామని, గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.
భారత నౌకాదళం, భారత తీర రక్షక దళం పరస్పర సమన్వయంతో గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయని, రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు కూడా సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని మంత్రి తెలిపారు. అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా బోటు ప్రయాణించి ఉండే అవకాశమున్న సముద్ర మార్గాలు, తీర ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని గాలింపు పరిధిని మరింత విస్తరిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు మత్స్యకారుల ఆచూకీకి సంబంధించి సానుకూల సమాచారం అందకపోయినా ఏ దశలోనూ ప్రయత్నాలను ఆపడం లేదు. ఏడు నౌకలతో పాటు డోర్నియర్ విమానాలు, నేవీ హెలికాప్టర్‌తో విస్తృతంగా గాలిస్తున్నాం. నేవీ, కోస్ట్‌గార్డ్, మత్స్యశాఖ మధ్య నిరంతర సమన్వయం కొనసాగుతోంది. ఒక్క అవకాశం కూడా వదలకుండా మన మత్స్యకారులను గుర్తించి సురక్షితంగా తీసుకురావడానికి సాధ్యమైన ప్రతి చర్య చేపడుతున్నాం అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఏడుగురు మత్స్యకారుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని మంత్రి కోరారు. వారి కుటుంబాల ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకుంటోంది. మన మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారిని గుర్తించి సురక్షితంగా తీసుకొచ్చే వరకు గాలింపు చర్యలు నిరంతరాయంగా కొనసాగిస్తాం అని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.
Prajavartha Online Telugu News