Breaking News

గ్రామీణ ఆరోగ్య కేంద్రాలకు శ‌ర‌వేగంగా శాశ్వత భవన నిర్మాణాలు

-చురుగ్గా 4,500కు పైగా విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల భవన నిర్మాణాలు
-పట్టణ పీహెచ్‌సీల్లో 502 సొంత భవనాల్లో.. 55 అద్దె భవనాల్లో
-సొంత భవనాల్లోనే పీహెచ్ సీలు
-శాస‌నస‌భ‌లో రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు పీహెచ్‌సీలు, అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు సొంత భవనాల నిర్మాణాల పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలకు తొలి కేంద్రాలుగా ఉన్న విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌, ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలను పటిష్టం చేయడంతోపాటు పట్టణ ప్రాంతాల్లో అర్బన్‌ పీహెచ్‌సీలకు శాశ్వత భవనాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. శాసన సభలో గురువారం జ‌రిగిన‌ ప్రశ్నోత్తరాల సమయంలో ప‌లువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రి సత్యకుమార్ జవాబులిచ్చారు.

పీహెచ్‌సీల్లో వైద్యుల పోస్టుల ఖాళీలు 57 మాత్రమే

రాష్ట్రంలో పీహెచ్‌సీలకు సంబంధించి భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించామ‌ని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 1,231 పీహెచ్‌సీలు ఉండగా.. 1,143 పీహెచ్‌సీలు సొంత భవనాల్లో కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ‘కొత్తగా మంజూరైన 88 పీహెచ్‌సీ భవనాల్లో 13 పూర్తయ్యాయి. శిథిలావస్థకు చేరిన 140 పీహెచ్‌సీ భవనాల స్థానంలో కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టగా.. వాటిలో 118 పూర్తయ్యాయి. మరో 22 నిర్మాణంలో ఉన్నాయి. పీహెచ్‌సీ భవనాల బలోపేతానికి చేపట్టిన 948 పనులు పూర్తయ్యాయి. 15వ ఆర్థిక సంఘం నిధులతో మరో 100 పీహెచ్‌సీ భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా చేపట్టిన 43 పనుల్లో 14 పూర్తికాగా, 29 నిర్మాణంలో ఉన్నాయి. మరో 57 భవనాల పనులు టెండర్‌ దశలో ఉన్నాయి. గత రెండేళ్లలో పీహెచ్‌సీల్లో 600కు పైగా నియామకాలు చేపట్టాం. మొత్తం 1,200 పీహెచ్‌సీలు ఉండగా ప్రస్తుతం 57 వైద్యుల పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని, వాటిని కూడా త్వరలో భర్తీ చేస్తాం” అని మంత్రి వెల్లడించారు.

502 పట్టణ ఆరోగ్య కేంద్రాలకు సొంత భవనాలు

“పట్టణ ప్రాంతాల్లో 560 అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు ఉండగా 175 ఇప్పటికే ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయి. కొత్త భవనాల నిర్మాణానికి మరో 385 కి అనుమతులు మంజూరయ్యాయి. వీటిలో 327 భవనాలు నిర్మించి అప్పగించారు. మరో 55 భవనాల నిర్మాణం కొనసాగుతోంది. మూడు భవనాల అంశం కోర్టులో ఉంది. మొత్తంగా 502 యూపీహెచ్‌సీలకు సొంత భవనాలు అందుబాటులో ఉన్నాయి. మరో 55 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి” అని మంత్రి తెలిపారు.

విలేజ్ హెల్త్ క్లినిక్స్ భ‌వ‌న నిర్మాణాల్లోనూ పురోగ‌తి

గ్రామీణ ప్రాంతాల్లోని విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌, ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలు, హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లపై మంత్రి మాట్లాడుతూ ఇవి జాతీయ ఆరోగ్య మిషన్‌ పరిధిలో కొనసాగుతున్నాయని చెప్పారు. గత ప్ర‌భుత్వం కేంద్రం నుంచి నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ 15వ ఆర్థిక సంఘం, ఎన్‌హెచ్‌ఎం, పీఎం అభీమ్‌ తదితర పథకాల కింద 3,105 సంఖ్యలోనే సొంత భవనాలు నిర్మించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేవ‌లం రెండేళ్ల‌లోనే 4,500కు పైగా భవనాల నిర్మాణాలు పురోగ‌తిలో ఉన్నాయ‌న్నారు. పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఇవే ప్రజలకు తొలి ఆరోగ్య సేవా కేంద్రాలు కావడంతో వాటిని పటిష్టం చేస్తున్నామని వివరించారు. అవసరమైన చోట కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్ల(ఎంఎల్‌హెచ్‌ పీలు) నియామకాలు కూడా చేపడుతున్నామని తెలిపారు.

ఉచితంగా 41 రకాల పరీక్షలు

ముఖ్యమంత్రి దార్శనికత మేరకు వ్యక్తి కేంద్రంగా వైద్య సేవలు అందించేందుకు ‘సంజీవని డిజిటల్‌ హెల్త్‌’ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చామని మంత్రి చెప్పారు. ఇందులో ఇంటివద్దే 41 రకాల పరీక్షలు నిర్వహించి ఆరోగ్య ప్రొఫైల్‌ రూపొందించడంతోపాటు అవసరమైన వారికి తదుపరి వైద్యం, అపాయింట్‌మెంట్లు, మందులు, డిజిటల్‌ హెల్త్‌ రికార్డు నిర్వహణ వంటి సేవలను అందించేలా వ్యవస్థను రూపొందించినట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *