-అడవిలో ప్రతి కదలికపై నిఘాకు అత్యాధునిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్
-కర్ణాటక నమూనా అటవీ పరిరక్షణపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టి
-ప్రతి అంగుళం అడవిని పరిరక్షించేందుకు ఆధునిక సాంకేతిక వ్యవస్థ
-వన్యప్రాణులు, అటవీ సంపద రక్షణకు సమగ్ర సాంకేతిక వ్యవస్థ
-ఈ-గస్తు తరహా మొబైల్ యాప్‌తో వ్యవస్థలో జవాబుదారీతనం
-కర్ణాటకలో రాష్ట్ర అటవీ ఐటీ విభాగం అధ్యయన నివేదికలను పరిశీలించిన పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కర్ణాటక అటవీ శాఖ అనుసరిస్తున్న తరహా అత్యాధునిక సాంకేతిక పరిపాలనా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రతి అంగుళం అటవీ భూమిని సంరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న అరణ్యారామంలో కర్ణాటక తరహా అధునాతన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఈ వ్యవస్థ ద్వారా అడవుల మ్యాపింగ్‌తోపాటు పూర్తి స్థాయిలో వన్యప్రాణుల కదలికలు, అటవీ కార్యకలాపాలపై డిజిటల్ నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఇటీవల రాష్ట్ర అటవీ శాఖ ఐటీ సలహాదారు పెన్నమరెడ్డి నాగబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర అటవీశాఖ బృందం కర్ణాటకలో మూడు రోజులపాటు పర్యటించింది. కర్ణాటక అటవీ శాఖ అనుసరిస్తున్న ఐటీ విధానాలు, జీఐఎస్, మొబైల్ అప్లికేషన్లు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తదితర వ్యవస్థలపై అధ్యయనం జరిపి, పూర్తి వివరాలతో కూడిన నివేదికను పవన్ కళ్యాణ్ కి అందజేశారు. తమ పరిశీలనలు, కర్ణాటకలో విజయవంతమైన విధానాలపై పలు సూచనలు చేశారు. ఈ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన పవన్ కళ్యాణ్ కర్ణాటకలో సత్ఫలితాలు ఇచ్చిన పలు విధానాలను రాష్ట్రంలో కూడా అమలు చేయాలని అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా అడవిలో ప్రతి అణువును కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షించే విధంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు పట్ల పవన్ కళ్యాణ్ ఆసక్తి కనబర్చారు. జియో-స్పేషియల్ డ్యాష్‌బోర్డ్, డ్రోన్ ఆధారిత పర్యవేక్షణ, కెమెరా ట్రాప్‌ల ద్వారా వన్యప్రాణుల సంఖ్యపై ఎప్పటికప్పుడు విశ్లేషణ, అటవీ మార్గాల్లో ప్రయాణించే వాహనాల ట్రాకింగ్, గస్తీ పర్యవేక్షణ, అటవీ అగ్నిప్రమాదాలు, మానవ-వన్యప్రాణి ఘర్షణల పర్యవేక్షణ తదితర కార్యక్రమాలన్నింటినీ ఒకే చోటు నుంచి పర్యవేక్షించే వెసులుబాటు కలుగుతుందని అభిప్రాయపడ్డారు.
సిబ్బందిలో జవాబుదారీతనం పెంచేలా…
కర్ణాటక అమలు చేస్తున్న ఈ-గస్తు మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా అద్భుత ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయి సిబ్బంది విధుల పర్యవేక్షణ, వారి భద్రతా చర్యల్లో ఇది కీలకంగా వ్యవహరిస్తుందని, గస్తీ, హాజరు, నిరంతర మార్గ నిర్దేశం, నివేదికల సమర్పణకు ఇది సమర్థవంతమైన సాధనంగా పని చేస్తోందని, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో ఇప్పటికే అమలులో ఉన్న ఫారెస్ట్ పోర్టల్, సింగిల్ సైన్-ఆన్ వ్యవస్థలను అనుసంధానించి ఈ-గస్తు మొబైల్ యాప్ రూపొందించాలని సూచించారు. ఇది వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంపొందిస్తుందన్నారు.
సత్వర పరిహారం అందించేలా
వన్యప్రాణుల వల్ల అటవీ సరిహద్దు గ్రామాల్లో జరిగే పంటల నష్టానికి పరిహారం చెల్లించే ప్రక్రియను కూడా డిజిటలీకరణ ద్వారా మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని, తద్వారా పంటల నష్టంపై నివేదికలు, రైతులకు పరిహారం చెల్లింపుల వ్యవస్థలో మరింత పారదర్శకత వస్తుందని పేర్కొన్నారు. వేగంగా పరిహారం చెల్లించే వెసులుబాటు కలుగుతుందన్నారు. జీఐఎస్ ఆధారిత ధృవీకరణ వ్యవస్థను తక్షణం అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.
అటవీ సరిహద్దులకు చట్టబద్ధమైన భద్రత
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గనిర్దేశకత్వంలో, అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నాయకత్వంలో ఇప్పటికే అటవీ సరిహద్దుల డిజిటలైజేషన్ ప్రక్రియను రాష్ట్రంలో కూడా చేపట్టిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. తద్వారా అటవీ సరిహద్దుల చట్టబద్ధతను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు హనుమాన్ ద్వారా ఇప్పటికే మానవ-వన్యప్రాణుల ఘర్షణల నివారణ, విశ్లేషణ వ్యవస్థలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ఇందుకోసం ఏఐ ఆధారిత ప్రమాద అంచనా వ్యవస్థలు, వన్యప్రాణుల సంచారానికి సంబంధించిన డ్యాష్‌బోర్డులు సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు.
కర్ణాటకతో పరస్పర సాంకేతిక సహకారం
ఇప్పటికే కర్ణాటక అటవీ శాఖతో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధం వంటి పలు ఒప్పందాలు చేసుకున్నామని, పరస్పర సాంకేతిక సహకారం దిశగా అడుగులు వేయనున్నట్లు వివరించారు. అందుకోసం ఇరు రాష్ట్రాల అటవీశాఖల ఆధ్వర్యంలో సంయుక్త సాంకేతిక వర్క్‌షాప్‌లు, పత్రాల మార్పిడి, అవసరం ఉన్న చోట సోర్స్ కోడ్ భాగస్వామ్యం, జీఐఎస్‌లో ఉత్తమ విధానాల మార్పిడి, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్‌కు సంబంధించి వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News