Breaking News

ప్రతి బోటు… ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

-ఘటన తర్వాత స్పందించడం కంటే.. ముందే అప్రమత్తంగా ఉండాలి
-సముద్రంలో వేటకు వెళ్లి గల్లైంతన మత్య్సకారుల ఆచూకీపై సీఎం చంద్రబాబు సమీక్ష
-216 నాటికల్ మైళ్ల పరిధిలో గాలిస్తున్నట్లు అధికారుల వివరణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సముద్రంలో మత్స్యకారులు గల్లంతైన ఘటనలో తర్వాత స్పందించడం కాకుండా… ముందస్తు జాగ్రత్తలతో ప్రమాదాలను నివారించేలా ఎస్‌ఓపీ అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, వేటకు వెళ్లే వారి పూర్తి సమాచారం అందుబాటులో ఉంటేనే అత్యవసర సమయాల్లో సత్వర సాయం అందించగలమని స్పష్టం చేశారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామాలకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఘటనపై గురువారం కూడా క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు మత్స్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం చేపడుతున్న గాలింపు చర్యలు, వివిధ విభాగాల మధ్య సమన్వయం, చేపట్టాల్సిన చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

216 నాటికల్ మైళ్ల పరిధిలో గాలింపు

ఈ నెల 3వ తేదీన ఏడుగురు మత్స్యకారులు బోటులో వేటకు వెళ్లారని, పది రోజుల తర్వాత తిరిగి వస్తామని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఈ నెల 16న మత్స్యకారుల ఆచూకీ లభించడం లేదని కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం ఇచ్చినట్లు వివరించారు. సమాచారం అందిన వెంటనే కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. బోటులో ట్రాన్స్‌పాండర్ ఏర్పాటు, బోటు ఒంటరిగా ఎందుకు సముద్రంలోకి వెళ్లింది? బోటు గల్లంతైన విషయం అధికారులకు ఎప్పుడు తెలిసింది? తెలిసిన వెంటనే గాలింపు చర్యలు ఎప్పుడు ప్రారంభించారు? అనే అంశాలపై సీఎం అధికారులను ప్రశ్నించారు. గాలింపు చర్యలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. ఇప్పటికే చెన్నైలోని కోస్ట్‌గార్డ్ హెడ్‌క్వార్టర్స్‌తో రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు మాట్లాడినట్లు అధికారులు తెలిపారు. ఏపీకి చెందిన బోటు గల్లంతైన విషయాన్ని అండమాన్ సహా బంగ్లాదేశ్ కు కూడా చెన్నైలోని కోస్ట్‌గార్డ్ ఉన్నతాధికారుల ద్వారా తెలియజేసినట్లు చెప్పారు. నేవీ డార్నియర్ విమానాల ద్వారా 216 నాటికల్ మైళ్ల పరిధిలో గాలింపు నిర్వహించినట్లు సీఎంకు వివరించారు. వేటకు వెళ్లే మత్స్యకారులకు అందుతున్న సాంకేతిక సహాయం, రోజువారీ సమన్వయ వ్యవస్థలపైనా చంద్రబాబు సమీక్షించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి మత్స్యకారులు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని ఆదేశించారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *