బ్యాంకు ఖాతాలను అనవసరంగా మార్చొద్దు

-ఆధార్‌ సీడింగ్‌ పూర్తికాక ఖాతాలు మారిస్తే ఉద్యోగుల వేతనాల చెల్లింపుల్లో జాప్యం
-NHM ఉద్యోగుల విషయమై జిల్లా అధికారులకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ చక్రధర్‌బాబు ఆదేశాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ ఆరోగ్య మిషన్‌ (NHM) పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు సహేతుకమైన కారణాలు లేకుండా బ్యాంకు ఖాతాలను మార్చుకోవద్దని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ చక్రధర్‌బాబు సూచించారు. ఆధార్‌ సీడింగ్‌ పూర్తికాకముందే బ్యాంకు ఖాతాలను మార్చుకోవడం వల్ల ఆధార్‌ ఆధారిత చెల్లింపు విధానం (ABPS)–డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (DBT)లో సాంకేతిక సమస్యలు తలెత్తి వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు. ఈ అంశంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

NHM సిబ్బంది వేతనాలు ABPS–DBT విధానంలో ఉద్యోగుల ఆధార్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతున్నాయి. వేతన బిల్లుల ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హత కలిగిన ఉద్యోగికి చెల్లించాల్సిన మొత్తం ఎలక్ట్రానిక్‌ విధానంలో సంబంధిత ఖాతాకు బదిలీ అవుతుంది. ఈ నేపథ్యంలో కొందరు ఉద్యోగులు ఆధార్‌ సీడింగ్‌ పూర్తికాకముందే బ్యాంకు ఖాతాలను మార్చుకుంటుండటంతో చెల్లింపుల ప్రక్రియలో సమస్యలు ఏర్పడుతున్నాయి.

వేలాది మందిపై ప్రభావం

బ్యాంకు ఖాతాల మార్పు, ఆధార్‌ సీడింగ్‌లో జాప్యం కారణంగా ఒకే బిల్లులో వేలాది మంది ఉద్యోగుల వేతనాల చెల్లింపులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో సుమారు రూ.60–70 కోట్ల మేర బిల్లుల చెల్లింపులపై ప్రభావం కనిపిస్తోంది. ఆధార్‌–బ్యాంకు ఖాతా అనుసంధానంలో ఏర్పడిన సమస్యలను గుర్తించి సరిచేసే వరకు సమయం పడుతుండటంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆధార్‌ సీడింగ్‌ తర్వాతే ఖాతా మార్చాలి

సహేతుకమైన కారణాలు లేకుండా బ్యాంకు ఖాతాలను మార్చుకోవద్దని అధికారులు ఉద్యోగులకు సూచించారు. అనివార్య పరిస్థితుల్లో ఖాతా మార్చాల్సి వస్తే కొత్త బ్యాంకు ఖాతాకు ఆధార్‌ సీడింగ్‌ పూర్తయిన తర్వాతే ఉద్యోగ రికార్డుల్లో ఖాతా వివరాలను మార్చుకోవాలని స్పష్టం చేశారు.

అలాగే బ్యాంకు రికార్డుల్లో నమోదైన ఉద్యోగి పేరు, ఖాతా నంబరు, ఇతర వివరాలు ఉద్యోగ రికార్డులతో సరిపోతున్నాయో ముందుగానే పరిశీలించుకోవాలని సూచించారు. వేతనాల చెల్లింపుల్లో అనవసర జాప్యాన్ని నివారించేందుకు ఉద్యోగులు, జిల్లా అధికారులు ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కమిషనర్‌ ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *