-రూ.185.75 కోట్లతో వార్షిక ప్రణాళికకు కేంద్రం ఆమోదం
-ఏపీ ఆయుష్ చరిత్రలోనే తొలిసారి
-2024-25 నుంచి 26-27 వరకు కలిపి రూ. 434 కోట్ల కేటాయింపులకు ఆమోదo
-2014-15 నుoచి 2023-24 వరకు రూ.120 కోట్లు కేటాయింపు
-తాజా కేటాయింపుల్లో ఐటీడీఏ ప్రాంతాల్లో 19 మొబైల్ మెడికల్ యూనిట్లు..
-డిస్పెన్సరీల ఆధునికీకరణ, ఆల్కహాల్ డీ-అడిక్షన్ కేంద్రాలు, యోగా వెల్నెస్ కేంద్రాలు, ఇతర వాటికి నిధుల ఆమోదం
-కేంద్రానికి కూటమి ప్రభుత్వం తరఫున మంత్రి సత్య కుమార్ కృతజ్ఞతలు
-సీఎం చంద్రబాబు విజన్ తో వైద్య రంగంలో అభివృద్ధి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మధ్య సమన్వయం రాష్ట్ర ప్రయోజనాలకు ఏ స్థాయిలో దోహదపడుతుందో మరోసారి స్పష్టమైంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ జాతీయ నాయకుడు సత్యకుమార్ కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ఆయుష్ రంగానికి నిధులు సాధించేందుకు చేసిన ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తున్నాయి. ఇటీవలే… గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో రూ. 100 కోట్ల తో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగ అండ్ నేచురోపతి 100 పడకల రీసెర్చ్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ క్రమoలో కూటమి ప్రభుత్వం సమర్పించిన 2026–27 రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళిక (SAAP)కు కేంద్ర ఆయుష్ మిషన్ డైరెక్టరేట్ రూ.185.75 కోట్లకు ఆమోదం తెలిపింది. 2014లో జాతీయ ఆయుష్ మిషన్ ప్రారంభమైన తర్వాత రాష్ట్రానికి లభించిన అత్యధిక వార్షిక కేటాయింపులు ఇవే కావడం విశేషం. గిరిజన, మారుమూల ప్రాంతాల ప్రజలకు ఆయుష్ వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు 9 ఐటీడీఏల పరిధిలో 19 మొబైల్ మెడికల్ యూనిట్లను సేవల్లోకి తీసుకురావడం ఈ ప్రణాళికలో హైలెట్.
గత వైకాపా పాలనలో మూడేళ్లు నిల్..
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2021–22, 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా మూడు సంవత్సరాలు జాతీయ ఆయుష్ మిషన్ కింద రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదల జరగలేదు. దీంతో ఆయుష్ రంగం అభివృద్ధికి ఆటంకం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది.
4 రెట్లుకు పైగానే అధికo
నేషనల్ ఆయుష్ మిషన్ (NAM) కింద నిధుల కేటాయింపులో గణనీయమైన పెరుగుదల నమోదైంది. 2014 నుండి 2024 వరకు పదేళ్ల కాలంలో మొత్తం రూ. 120.17 కోట్లు మంజూరు చేయగా, 2024 నుండి 2027 వరకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం మూడేళ్ల కాలానికే రూ. 434.64 కోట్ల నిధుల కేటాయింపులకు కేంద్ర ఆమోదం తెలిపింది. ఇది పాత కేటాయింపులతో పోలిస్తే నాలుగు రెట్లకు పైగా పెరగడం ఆయుష్ వైద్య విధానాల పట్ల పెరుగుతున్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. 2024–25లో రూ.83.23 కోట్లు, 2025–26లో రూ.165.66 కోట్లు ఆమోదం పొందగా ప్రస్తుత 2026–27లో ఏకంగా రూ.185.75 కోట్ల ఆమోదం లభించింది.
వార్షిక ప్రణాళిక-ముఖ్యాంశాలు
డిజిటల్ ఆయుష్
ఆయుష్ సేవలను డిజిటల్ విధానంలోకి తీసుకెళ్లేందుకు నిధులు కేటాయించారు. 601 ఆయుష్ డిస్పెన్సరీల్లో డిజిటలైజేషన్, ఇంటర్నెట్ కనెక్షన్ల కోసం రూ.50 లక్షలు, 157 మంది ఆయుష్ వైద్యాధికారులకు ల్యాప్‌టాప్‌ల కోసం రూ.62.80 లక్షలు ఆమోదించారు. 126 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు BSNL ల్యాండ్లైన్, ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం కూడా నిధులు కేటాయించారు.
క్రీడాకారులకు సంప్రదాయ చికిత్సలతో రికవరీకి ప్రత్యేక కేంద్రం
కడపలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఆయుష్ స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రీడాకారులకు సంప్రదాయ చికిత్సల ద్వారా గాయాల నుండి వేగంగా కోలుకోవడానికి, రసాయనాలు లేని పద్ధతుల్లో వారి శారీరక సామర్థ్యాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది.
ఆల్కహాల్ డీ-అడిక్షన్ కేంద్రాలు
రాష్ట్రంలోని 04 ఆయుష్ బోధనాస్పత్రుల్లో మద్యం వ్యసనపరులకు మానసిక ప్రశాంతతను అందిస్తూ వారిని వ్యసనాల నుండి విముక్తులను చేసి, కుటుంబాల్లో వెలుగులు నింపుతాయి.
రాష్ట్రంలోని 04 ఆయుష్ బోధనాస్పత్రుల్లో పంచకర్మ, యోగా సదుపాయాల కల్పన ద్వారా పక్షవాతం, కీళ్ల నొప్పులు వంటి దీర్ఘకాలిక సమస్యలకు శరీరాన్ని శుద్ధి చేసే ఉచిత సంప్రదాయ చికిత్సలు అందుబాటులోకి వస్తాయి.
హెర్బల్ థెరపీ సేవలు
విజయవాడలోని డాక్టర్ ఏఎల్ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో కంటి ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకంగా అక్షి తర్పణ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ నేత్ర చికిత్స ద్వారా స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల మితిమీరిన వినియోగం వల్ల కలిగే కంటి అలసట, మంటలు, పొడిబారడం (Dry Eyes) మరియు ప్రారంభ దృష్టి లోపాలకు సహజ సిద్ధమైన పరిష్కారం లభిస్తుంది. దీనితో పాటు, ఆసుపత్రిలోని బయట రోగులకు (OPD) మరియు ఇన్‌పేషెంట్లకు (IPD) నేరుగా తాజా మూలికా కషాయాలను అందించేందుకు హెర్బల్ క్వాథ థెరపీ యూనిట్‌ను ప్రారంభిస్తున్నారు. ఇది రోగులలో వ్యాధి నిరోధక శక్తిని త్వరితగతిన పెంచడమే కాకుండా దీర్ఘకాలిక శ్వాసకోశ, జీర్ణకోశ సమస్యల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
యోగా వెల్నెస్ కేంద్రాలు
నిరంతరం తీవ్రపని ఒత్తిడిని ఎదుర్కొనే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక యోగా వెల్నెస్ కేంద్రాన్ని నెలకొల్పుతున్నారు. ఈ కేంద్రం ద్వారా ఉద్యోగుల్లో ఒత్తిడిని తగ్గించి, బీపీ, షుగర్, వెన్నునొప్పి వంటి జీవనశైలి ఆధారిత సమస్యలను నివారించి వారి పనితీరును మెరుగుపరచవచ్చు.
అదే విధంగా నాలుగు ప్రధాన జైళ్లలో కూడా ఇదే విధంగా ఏర్పాటు చేసి ఖైదీలలో మానసిక ఆరోగ్యం, జీవనశైలి మెరుగుపడేలా ఉపయోగపడుతుంది.
హైకోర్టులో ఆయుష్ క్లినిక్
హైకోర్టు ప్రాంగణంలో నూతనంగా ఆయుష్ క్లినిక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది అక్కడ అందుబాటులో ఉండే న్యాయమూర్తులు, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బందికి తక్షణ వైద్య సలహాలు, ప్రాథమిక ఆయుర్వేద చికిత్సలు అందించడానికి ఎంతో దోహదపడుతుంది.
డిస్పెన్సరీల ఆధునికీకరణ
64 ప్రభుత్వ, పంచాయతీ, ప్రభుత్వ సహాయ ఆయుష్ డిస్పెన్సరీల అభివృద్ధికి రూ.12.80 కోట్లు ఆమోదించారు. ఒక్కో డిస్పెన్సరీకి రూ.20 లక్షల చొప్పున భవనాల మరమ్మతులు, ఫర్నిచర్, పరికరాలు, ఐటీ సదుపాయాలు, ఆయుష్ HMIS అమలు చేయనున్నారు. గత SAAPలో ఆమోదించిన 150 డిస్పెన్సరీలకు సంబంధించిన కమిటెడ్ లయబిలిటీల కోసం కూడా ఈ ఏడాది నిధులు కేటాయించారు.
ఉచిత మందులు
రాష్ట్రంలోని 712 ఆయుష్ డిస్పెన్సరీలకు ఉచిత మందుల సరఫరా కోసం రూ.22.16 కోట్లు ఆమోదించారు. ఇందులో 334 ఆయుర్వేద, 192 హోమియోపతి, 75 యునానీ, 111 NRHM డిస్పెన్సరీలు ఉన్నాయి. అదనంగా నాలుగు స్టాండలోన్ ఆయుష్ ఆస్పత్రులు, నాలుగు ఆయుష్ బోధనాస్పత్రులకు కూడా మందులు సరఫరా చేయనున్నారు.
గిరిజన ప్రాంతాలకు సేవలు
గిరిజన, మారుమూల ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను వారి వద్దకే తీసుకెళ్లేందుకు 9 ఐటీడీఏల పరిధిలో 19 మొబైల్ మెడికల్ యూనిట్ల నిర్వహణకు రూ.1.26 కోట్లు కేటాయించారు. రంపచోడవరం, చింతూరు, పార్వతీపురం, పాడేరు తదితర ప్రాంతాల్లో ఆయుష్ వైద్యాధికారులు, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లతో కూడిన బృందాలు సేవలు అందించనున్నాయి. ఉచిత వైద్య పరీక్షలు, ఆయుష్ మందుల పంపిణీతో పాటు వ్యాధుల నివారణ, పౌష్టికాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పించనున్నారు.
ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు
126 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు రూ.5.75 కోట్లు కేటాయించారు. యోగా ఇన్‌స్ట్రక్టర్ల సేవలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల ప్రోత్సాహకాలు, ల్యాబ్ సేవలు, శిక్షణ తదితరాలకు ఈ నిధులను వినియోగించనున్నారు.
ప్రజారోగ్య ప్రాధాన్యాలు
పాఠశాల విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే ఆయుర్విద్య కార్యక్రమానికి రూ.6.50 కోట్లు, కండరాల-ఎముకల సంబంధిత వ్యాధుల నివారణ, నిర్వహణ కార్యక్రమానికి రూ.2.05 కోట్లు, వయోమిత్ర కార్యక్రమానికి రూ.0.62 కోట్లు, సుప్రజ మాతా-శిశు ఆరోగ్య కార్యక్రమానికి రూ.0.085 కోట్లు కేటాయించారు.
విద్యా సంస్థల బలోపేతం
ఆయుష్ విద్యాసంస్థల బలోపేతానికి రూ.38.84 కోట్లు ఆమోదించారు. విశాఖపట్నంలోని VIMSలో 100 పడకల ఆస్పత్రితో ప్రభుత్వ నేచురోపతి, యోగా కళాశాల ఏర్పాటుకు నిధులు కేటాయించారు. కాకినాడ, ధర్మవరం, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆయుష్ కళాశాలల అభివృద్ధికి కూడా నిధులు మంజూరయ్యాయి.
వెల్నెస్ కేంద్రాలు
58 స్పెషాలిటీ వెల్నెస్ కేంద్రాలకు రూ.5.28 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో 55 ఆయుర్వేద పంచకర్మ, మూడు యునానీ కేంద్రాలు ఉన్నాయి. అలాగే ఆరు 50 పడకల సమీకృత ఆయుష్ ఆస్పత్రుల ఏర్పాటుకు గత ఏడాదే మంజూరు లభించింది. శ్రీకాకుళం (టెక్కలి), అల్లూరి సీతారామరాజు (రంపచోడవరం), ఎన్టీఆర్ (నందిగామ), గుంటూరు (తెనాలి), ప్రకాశం (గిద్దలూరు), తిరుపతి జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ఆస్పత్రులకు ప్రస్తుత SAAPలో కొనసాగింపు బడ్జెట్‌ను కేటాయించారు. గ్రామీణ ప్రజలకు మందులు లేని ప్రకృతి వైద్యాన్ని దగ్గర చేసేందుకు NRHM డిస్పెన్సరీల్లో నేచురోపతి యూనిట్లను అభివృద్ధి చేస్తున్నారు. డిజిటల్ విధానంలో, టెలీమెడిసిన్ సేవలతో ఆయుష్ వైద్యాన్ని ప్రతి ఒక్కరికీ సులభంగా చేరవేసేందుకు చర్యలు చేపట్టారు.
2014–15 నుంచి 2026–27 వరకు ఆమోద వార్షిక బడ్జెట్ వివరాలు:
ఆర్థిక సంవత్సరం ఆమోదిత మొత్తం (రూ. కోట్లలో)
2014–15 11.46
2015–16 11.60
2016–17 18.09
2017–18 19.60
2018–19 21.33
2019–20 30.38
2020–21 7.72
2021–22 0.00
2022–23 0.00
2023–24 0.00
2024–25 83.23
2025–26 165.66
2026–27 185.75
ఆయుష్ వైద్య సేవల విస్తరణకు అధిక ప్రాధాన్యం
మంత్రి సత్యకుమార్
సీఎం చంద్రబాబు సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన రూ.185.75 కోట్ల వార్షిక ప్రణాళికకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయుష్ శాఖ ఉన్నతాధికారులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఆయుష్ వైద్య సేవల విస్తరణకు అధిక ప్రాధాన్య ఇస్తున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News