విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు ఆదివారం ఉదయం సిబ్బందితో టంగుటూరి ప్రకాశం పంతులు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఏ. రవీంద్రరావు మాట్లాడుతూ, టంగుటూరి ప్రకాశం పంతులు స్వాతంత్ర్య సమరయోధుడిగా, న్యాయవాదిగా, ప్రజా నాయకుడిగా, ఆంధ్ర ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడని అన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన ధైర్యసాహసాలతో ముందుండి పోరాడారని తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రజలను చైతన్యపరిచే క్రమంలో ఆయన చూపిన ధైర్యం, నిబద్ధత, త్యాగం భారత స్వాతంత్ర్య చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయని పేర్కొన్నారు. ప్రజల కోసం తన వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి నిరంతరం సేవ చేసిన ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగం, ధైర్యం, నిజాయితీ, ప్రజాసేవా స్ఫూర్తిని స్మరించుకోవడం ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News