-నగరంలోని హోటల్లు ఆరో ప్లాంట్లపై ప్రజా ఆరోగ్య సిబ్బంది ఆకస్మిక తనిఖీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగర పరిధిలోని హోటళ్లు, వాటర్ ప్లాంట్లలో పారిశుద్ధ్య విభాగం అధికారులు ఆదివారం ఉదయం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా సర్కిల్ 1 పరిధిలోని కాలేశ్వర రావు మార్కెట్, కెనాల్ రోడ్, తారాపేట, సర్కిల్ 2 పరిధిలోగల రెడ్ సర్కిల్, సీతారాంపురం, గవర్నర్‌పేట మరియు సర్కిల్ 3 పరిధిలోగల బెంజ్ సర్కిల్, ఎంజీ రోడ్, ఈనాడు ప్రాంతాలలో గల హోటళ్ళు,రెస్టారెంట్లు, ఆర్వో ప్లాంట్లు తనిఖీ చేసి, అక్కడి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు.
ఈ విస్తృత తనకి లో భాగంగా వ్యాపారస్తుల కిచెన్ రూమ్ లో పారిశుధ్య పరిస్థితులు, వ్యర్ధాల నిర్వహణ, త్రాగునీరు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తనిఖీల సందర్భంగా కొన్ని సంస్థల్లో పారిశుద్ధ్య లోపాలను అధికారులు గుర్తించారు. సంబంధిత యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి, గుర్తించిన లోపాలను నోటీసులు అందుకున్న తేదీ నుంచి మూడు రోజుల్లోగా పూర్తిస్థాయిలో సరిదిద్దుకోవాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించిన రెండు హోటళ్లపై జరిమానాలు విధించి, మొత్తం రూ.10,000/- జరిమానాను వసూలు చేశారు. నిర్ణీత గడువులోగా లోపాలను సరిదిద్దుకోని సంస్థలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్రేడ్ లైసెన్సులు రద్దు చేసే చర్యలు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా హోటళ్లు, ఆహార సంస్థలు మరియు వాటర్ ప్లాంట్లు తప్పనిసరిగా పారిశుద్ధ్య ప్రమాణాలను పాటించాలని అధికారులు సూచించారు. నిబంధనల అమలులో నిర్లక్ష్యం వహించే సంస్థలపై ఎటువంటి మినహాయింపు లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ తనిఖీలలో జోనల్ కమిషనర్ కే ప్రభుదాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, శానిటరీ సూపర్వైజర్లు సోమరాజు, సలీం, రమేష్ మరియు శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News