ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు 155వ జయంతి సందర్భంగా ఘన నివాళులు

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా, స్వాతంత్ర్య సమరంలో ధైర్యానికి మారుపేరుగా నిలిచిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 155వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్ కె. బుచ్చి రాంప్రసాద్, ప్రకాశం పంతులు మనవరాలు ప్రభావతి, మనవడు టంగుటూరి శ్రీరామ్ తో కలిసి పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చైర్మన్ కె. బుచ్చి రాంప్రసాద్ మాట్లాడుతూ, “ప్రకాశం పంతులు ఒక వ్యక్తి కాదు.. ఒక చరిత్ర. ఆయన పేరు వినగానే తెలుగు ప్రజల ఆత్మగౌరవం గుర్తుకొస్తుంది. బ్రిటిష్ తుపాకులు ఎదురుగా ఉన్నా వెనుకడుగు వేయకుండా తన గుండెను చూపించిన ఆ ధైర్యం భారత స్వాతంత్ర్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అందుకే ఆయనను ప్రజలు ప్రేమతో ‘ఆంధ్రకేసరి’గా గౌరవించారు” అని అన్నారు.
“దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడి జయంతిని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడం నాకు ఎంతో భావోద్వేగమైన, గర్వకారణమైన సందర్భం. ప్రభావతి, టంగుటూరి శ్రీరామ్ తో కలిసి ఆ మహానుభావుడి జ్ఞాపకాలను స్మరించుకోవడం ద్వారా ప్రకాశం పంతులు త్యాగాలను మరింత దగ్గరగా అనుభూతి చెందాను” అని చైర్మన్ పేర్కొన్నారు.
ప్రకాశం పంతులు పదవుల కోసం కాదు.. ప్రజల కోసం, దేశం కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం జీవించారని అన్నారు. ఆయన చూపిన నిస్వార్థం, ధైర్యం, ప్రజాసేవా స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు.
“ఆంధ్రకేసరి చూపిన ధైర్యం మనలో ఉండాలి.. ఆయన చూపిన ప్రజాసేవ మన ఆచరణలో ఉండాలి.. ఆయన కాపాడిన ఆత్మగౌరవం మన తరాలకు నిలిచిపోవాలి. ప్రకాశం పంతులు పేరు ఉన్నంతకాలం తెలుగు ప్రజల గుండెల్లో ఆయన స్ఫూర్తి సజీవంగానే ఉంటుంది” అని చైర్మన్ కె. బుచ్చి రాంప్రసాద్  అన్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు కి ఘనంగా నివాళులర్పించి, ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని చైర్మన్ పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *