విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర సోమవారం సాయంత్రం మారుతి నగర్‌లోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) 2026లో భాగంగా జరుగుతున్న హియరింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ఒక హియరింగ్‌ను నిర్వహించడంతో పాటు, బీఎల్‌వోలు నిర్వహిస్తున్న హియరింగ్‌లను సమీక్షించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ 2026లో భాగంగా అన్మ్యాప్డ్ కేసులకు సంబంధించి అర్హులైన ఓటర్లకు నోటీసులు జారీ చేసి, నోటీసుల్లో పేర్కొన్న తేదీల్లో హియరింగ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హియరింగ్‌కు హాజరయ్యే ప్రజలు భారత ఎన్నికల సంఘం సూచించిన పత్రాలను సమర్పించినట్లయితే వారి ఓటు హక్కును పరిరక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అవసరమైన పత్రాలను సమర్పించలేకపోయిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారు నూతన ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కమిషనర్ తెలిపారు. తద్వారా ప్రతి అర్హుడి ఓటు హక్కును పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఎవరైనా ఓటర్లకు నోటీసులు అందినప్పటికీ, అందులో పేర్కొన్న హియరింగ్ తేదీ దాటిపోయినట్లయితే వారు సంబంధిత ఏఈఆర్‌ఓ కార్యాలయాన్ని సంప్రదించి, హియరింగ్‌కు తప్పనిసరిగా హాజరై తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని కమిషనర్ సూచించారు.
ఈ పర్యటనలో ఏఈఆర్‌ఓ, పర్యవేక్షణ ఇంజనీర్ (ప్రాజెక్ట్స్) కే. దుష్యంత్, బీఎల్‌వోలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News