పారిశుద్ధ్య ప్రమాణాల్లో ఎటువంటి లోపాలు ఉండరాదు

-హోటళ్లు, రెస్టారెంట్లు, ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్లపై ప్రజారోగ్య సిబ్బంది క్షేత్రస్థాయి తనిఖీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హోటళ్లు, రెస్టారెంట్లలో పారిశుద్ధ్య ప్రమాణాల్లో ఎటువంటి లోపాలు ఉండరాదని, ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్ల ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని మాత్రమే అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు స్పష్టం చేశారు. తాగునీటి నాణ్యతపై నిరంతరం అవసరమైన పరీక్షలు నిర్వహించి, నీరు సురక్షితమైనదని నిర్ధారించుకున్న తర్వాతే ప్రజలకు సరఫరా చేయాలని ఆదేశించారు.

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ శ్రీ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు సోమవారం ఉదయం నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలోని గవర్నర్‌పేట, వన్‌టౌన్‌, బందర్‌ రోడ్‌ తదితర ప్రాంతాల్లో ప్రజారోగ్య విభాగం సిబ్బంది హోటళ్లు, రెస్టారెంట్లు, ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.

తనిఖీల్లో భాగంగా హోటళ్లు, రెస్టారెంట్లలోని వంటగది పరిశుభ్రత, కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌, ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లు, వంట సామగ్రి, ఆహార పదార్థాల నిర్వహణ, వంట అనంతరం ఉత్పత్తి అయ్యే వ్యర్థాల తొలగింపు, వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. ఆహార పదార్థాలను పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేసి, వినియోగదారులకు అందించేలా నిర్వాహకులకు సూచనలు చేశారు.

పారిశుద్ధ్య ప్రమాణాలను సక్రమంగా పాటించని సంస్థలపై నిబంధనల ప్రకారం జరిమానాలు విధించడంతో పాటు, లోపాలను వెంటనే సరిదిద్దుకోవాలని అధికారులు హెచ్చరించారు. హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రమైన వంటగదిని నిర్వహిస్తూ, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని స్పష్టం చేశారు.

ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్ల నిర్వాహకులు తాగునీటి నాణ్యతపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన నీటి పరీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు సురక్షితమైన తాగునీటిని మాత్రమే అందించాలని అధికారులు సూచించారు.

ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్లపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, పారిశుద్ధ్య ప్రమాణాల విషయంలో నిర్లక్ష్యం వహించే వారిపై ఎటువంటి మినహాయింపు లేకుండా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

ఈ తనిఖీల్లో శానిటరీ సూపర్‌వైజర్లు అహ్మద్‌, సోమరాజు, రమేష్‌, ప్రజారోగ్య విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *