కడప బేసిన్‌లో లక్షల కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాలు

-CSIR-NGRIతో ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక ఒప్పందం
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలు మార్చేలా కూటమి సన్నాహాలు
-క్రిటికల్ మినరల్స్ వెలికితీత ఒప్పందం చారిత్రాత్మకమన్న మంత్రి కొల్లు రవీంద్ర

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లోని కడప ప్రాంతం దేశ ఇంధన, పారిశ్రామిక రంగాల భవిష్యత్తును మార్చే ప్రధాన ఖనిజ కేంద్రంగా అవతరించబోతోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్ CSIR-నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిటికల్ మినరల్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంటరాక్షన్ సమావేశంలో పాల్గొన్నారు. ఆర్ అండ్ డి కేంద్రంలోని Seismology, HR-MC-ICPMS, Geothermal ల్యాబ్స్ పరిశీలించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కడప వెంపల్లె పరిధిలో ముఖ్యంగా తుమ్మలపల్లె ప్రాంతంలో అత్యంత విలువైన వ్యూహాత్మక ఖనిజాలైన లిథియం, గాలియం నిక్షేపాలు భారీగా ఉన్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నిక్షేపాల అధునాతన అన్వేషణ కోసం ఆంధ్రప్రదేశ్ గనులు, భూగర్భ వనరుల శాఖ.. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ ‘CSIR-నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’ (CSIR-NGRI)తో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు రూ. 13 లక్షల కోట్లకు పైగా విలువైన నిక్షేపాలు కడప బేసిన్ వెంపల్లె ఫార్మేషన్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి భూగర్భంలో 1000 పిపిఎం వరకు లిథియం, 250 పిపిఎం వరకు గాలియం ఉన్నట్లు గుర్తించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం.. సుమారు రూ.2 లక్షల కోట్ల విలువైన లోహాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

ఈ నిక్షేపాలను పూర్తిగా వెలికితీసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది. 2027లో ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టు 2032 నాటికి పూర్తి కానుంది. ఈ ఐదేళ్ల అన్వేషణ కార్యక్రమానికి అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్’ (NMET)భరిస్తుంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌పై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడదు. కడప బేసిన్ పరిధిలో ఖనిజాలు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయో గుర్తించడానికి, లోతైన భూగర్భ పరిశోధనల కోసం అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించనున్నారు. వైమానిక భూభౌతిక సర్వేలు, శాటిలైట్ రిమోట్ సెన్సింగ్, ఖనిజ లక్ష్యీకరణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ త్రీడీ సబ్ సర్ఫేస్ మోడలింగ్ చేపట్టనున్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వాహనాలు, సెమీకండక్టర్లు, అధునాతన ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ మరియు రక్షణ రంగాలకు లిథియం, గాలియం వంటి క్రిటికల్ మినరల్స్ అత్యంత కీలకం. ప్రస్తుతం భారతదేశం వీటి కోసం ఇతర దేశాల దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్’ లో భాగంగా ఈ ప్రాజెక్టు దేశానికి వ్యూహాత్మక ఆస్తిగా మారబోతోంది. కేవలం ఖనిజాల తవ్వకమే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న విస్తారమైన తీరప్రాంతం, ఓడరేవులు మరియు అనుకూల పారిశ్రామిక విధానాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలోనే ఖనిజ ప్రాసెసింగ్, రిఫైనింగ్, మరియు బ్యాటరీల తయారీ వంటి దిగువశ్రేణి పరిశ్రమలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సమిస్తాం. తద్వారా స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో CSIR డైరెక్టర్ డా.ప్రకాశ్ కుమార్ గారు, CSIR శాస్త్రవేత్త డా.బి.శ్రీనివాస్ గారు, ఇతర మైన్స్ అండ్ జియాలజీ శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *