– అత్యంత పారదర్శకంగా నోటీసులపై విచారణ
– వాస్తవ నిర్ధారణ తర్వాతే నిర్ణయం.. ఓటర్లకు భరోసా
– ఓటుహక్కు పరిరక్షణ కోసమే సర్ సమగ్ర ప్రక్రియ
– ఫారం-6 ద్వారా కొత్తగా ఓటు నమోదుకూ అవకాశం
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా జారీచేస్తున్న నోటీసులపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నోటీసు జారీ అంటే ఓటు తొలగింపు కాదని, అత్యంత పారదర్శకంగా విచారణ తర్వాతే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. అదేవిధంగా ఫారం-6 ద్వారా కొత్తగా ఓటు కూడా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
సోమవారం విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని అయ్యప్పనగర్ స్వర్ణ వార్డు కార్యాలయం వద్ద జరిగిన సర్ నోటీసుల విచారణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పరిశీలించారు. అక్కడకు వచ్చిన వారితో మాట్లాడి క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలు, ఏఈఆర్‌వోలు, ఈఆర్‌వోల ద్వారా అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నోటీసు జారీ అనేది వివరాలను పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించుకునే ప్రక్రియలో ఒక భాగం మాత్రమేనన్నారు. ఓటుహక్కు పరిరక్షణ కోసమే సర్ సమగ్ర ప్రక్రియ నిర్వహించడం జరుగుతోందని.. దోష రహిత ఓటరు జాబితా లక్ష్యంగా జరుగుతున్న ఈ ప్రక్రియలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఇప్పటివరకు 1,88,769 నోటీసుల పంపిణీ జరిగిందని.. వీటిలో 61,284 మందికి విచారణ నిర్వహించడం జరిగిందన్నారు. 64,252 మందికి విచారణ షెడ్యూలు గడువు ముగియగా విచారణ కోసం రీషెడ్యూల్ చేయడం జరుగుతోందన్నారు. ఎవరికి ఏ సందేహమున్నా క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలు సహాయసహకారాలకు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. కొత్తగా ఓటు నమోదుకు వీలుకల్పించే ఫారం-6తో పాటు ఫారం-7, ఫారం-8లు కూడా వారి వద్ద అందుబాటులో ఉంటాయన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని.. అర్హులైన ప్రతిఒక్కరూ కొత్తగా ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. కలెక్టర్ వెంట విజయవాడ ఆర్‌డీవో వెన్నెల శ్రీను తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News