ప్రతిసారి జూడాల స్టైపెండ్ 15 శాతం పెంచడం పూర్తిగా అనుచితమన్న జగన్ రెడ్డి

-తమిళనాడు, కేరళ తరహాలో 3 నుంచి 4 శాతం పెంచడం సబబు అని స్పష్టంచేసిన మాజీ సీఎం
-నవంబరు, 2022లో మెమో జారీ చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం
-సమ్మె చేస్తున్న జూడాలపట్ల మొసలికన్నీరు కారుస్తున్న జగన్ పై మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజలు వెర్రివాళ్లు.. తానేం చెప్పినా నమ్ముతారనే ధోరణి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిలో దినదినాభివృద్ధి చెందుతోందని… జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌(జూడాల‌) సమ్మెపై జగన్ రెడ్డి తాజా వ్యాఖ్యలు ఇందుకు సజీవ తార్కాణమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. జూడాల స్టైపెండ్ పెంపుపై జగన్ రెడ్డి ఆలోచనలకు అద్దంపడుతూ అప్పటి ప్రభుత్వం 2022 నవంబరులో జారీచేసిన మెమో గురించి మంత్రి గుర్తు చేశారు. అధికారికంగా రూపొందించిన వైకాపా ప్రభుత్వ మెమో స్టైపెండ్‌ పెంపు విషయంలో జూడాల డిమాండ్ అనుచితమని, 15 శాతం పెంపునకు భిన్నంగా ఏడాదికి 3 నుంచి 4 శాతం పెంచడం సబబు అని స్పష్టం చేసిందని మంత్రి మంగళవారంనాడు ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. సోమవారంనాడు జూడాల సమ్మె మరియు వైద్య సేవలకు సంబంధించిన కొన్ని ఇతర అంశాలపై సోషల్ మీడియాలో జగన్ చేసిన వ్యాఖ్యలను వాస్తవాలతో మంత్రి దుయ్యబట్టారు.

జగన్ మెమోలో ఏముంది?

జూడాల స్టైపెండ్‌ పెంపు విషయంలో జగన్ అంతరంగాన్ని అప్పటి ప్రభుత్వం 28.11.2022న జారీ చేసిన మెమోలో స్పష్టంగా ఆవిష్కరించింది.

మెమోలో ఈ కింది విధంగా అప్పటి ప్రభుత్వం పేర్కొంది. :

“21/10/2022న ప్రభుత్వం జారీచేసిన జీఓ నెంబరు 827 ద్వారా జూడాల స్టైపెండ్‌ను 1/1/2022 నుంచి 15 శాతం పెంచడం జరిగింది. 17.12.2009న జారీచేసిన జీఓ 287లో జూడాల స్టైపెండ్‌ను 15 శాతం పెంచాలని అప్పటి ప్రభుత్వం పేర్కొన్నా.. ఆ పెంపు కేవలం ఆరేళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇకముందు 15 శాతం స్టైపెండ్‌ పెంపును నిలుపుదలచేసి, వాస్తవ పరిస్థితుల ఆధారంగా స్టైపెండ్‌ పెంపును పరిశీలించాలి. 15 శాతం స్టైపెండ్‌ పెంపు అనేది అత్యుత్తమైన ప్రజారోగ్య సేవలు అందిస్తున్న తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల్లోని స్టైపెండ్‌ కంటే చాలా ఎక్కువ. ఈ రెండు రాష్ట్రాలు ఏడాదికి 3 శాతం లేదా 4 శాతం మేర మాత్రమే జూడాల స్టైపెండ్‌ పెంచాలని నిర్ణయించి, అమలు చేస్తున్నాయి. ఈ మొతాదులో పెంపు కానీ లేక భారత ప్రభుత్వం నిర్ణయించే వార్షిక డీఏ ఆధారంగా కానీ జూడాల స్టైపెండ్‌ పెంపునకు ప్రమాణంగా తీసుకోవాలి.” అని నాటి జ‌గ‌న్ ప్ర‌భుత్వం మెమోలో పేర్కొంది.

కాదనగలవా జగన్?

స్టైపెండ్‌ పెంపు విషయంలో జూడాల డిమాండ్ పూర్తిగా అనుచితమంటూ నవంబరు, 2022లో తన ప్రభుత్వమే రూపొందించిన మెమో.నెంబరు.1834189/సి1/2022ని కాదనగలవా అని మంత్రి  సత్యకుమార్ యాదవ్ మాజీ సీఎం జ‌గ‌న్‌రెడ్డికి సవాల్ విసిరారు. స్టైపెండ్ పెంపు విషయంలో తన ఆలోచనను ప్రభుత్వ మెమో ద్వారా స్పష్టంచేసిన జగన్ రెడ్డి, ఆ వాస్తవాన్ని విస్మరించి ప్రస్తుత జూడాల సమ్మె విషయమై ప్రజలను తప్పుదోవ పట్టించడానికి దిగజారారని.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఇది తగదని మంత్రి విమర్శించారు. జూడాల డిమాండ్‌ పట్ల జగన్ రెడ్డి నిజమైన సానుభూతి ఉంటే 2022లో తన దృక్పథాన్ని స్పష్టం చేస్తూ మెమో రూపొందించడంపై ఆయన జూడాలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ఈ రాజకీయ దిగజారుడుతనం రాష్ట్ర ప్రజలపట్ల జగన్ రెడ్డి ఏ మాత్రం గౌరవంలేదని వెల్లడిస్తోందని మంత్రి అన్నారు.

కూటమి ప్ర‌భుత్వం సానుకూల వైఖ‌రి

ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించే జూడాలపట్ల కూటమి ప్రభుత్వానికి సానుకూల వైఖరి ఉందని.. వారికి పక్క రాష్ట్రాలతో పోల్చి గౌరవ ప్రదమైన స్టైపెండును చెల్లించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టంచేశారు. ఆ మేరకు ఇంటర్నులు, పీజీలు, ఇతర జూడాలకు రాష్ట్రంలో చెల్లిస్తోన్న స్టైపెండును పక్క రాష్ట్రాలతో పోల్చి తగుమేరకు స్టైపెండును పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. దరిమిలా.. ఇంటర్నుల స్టైపెండులో 10% పెంపు, ఇతరుల స్టైపెండును 3% పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ–వాస్తవాలు

కూటమి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్దితో అమలు చేస్తోన్న డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం నిర్వీర్యమైపోతోందని నిరంతరం అబద్ధాలు వల్లెవేస్తోన్న జగన్ రెడ్డిని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా ఆక్షేపిస్తూ వాస్తవాలు వెల్లడించారు. జగన్ ఐదేళ్లపాలనలో సగటున ఏడాదికి 8,20,577 మాత్రమే లబ్ధిపొందగా.. కూటమి ప్రభుత్వ హయాంలో ఇది 74% పెరిగి వార్షిక లబ్ధిదారుల సంఖ్య 14,27,488 కి పెరిగిందని మంత్రి వెల్లడించారు. జగన్ హయాంలో నగదు రహిత ఉచిత వైద్య సేవల కోసం సగటున సంవత్సరానికి రూ.2,316 కోట్లు నమోదుకాగా.. కూటమి ప్రభుత్వ పాలనలో 64% పెరిగి, రూ.3,804 కోట్లకు చేరిందని ఆయన తెలిపారు వాస్తవ చెల్లింపుల విషయంలో జగన్ ప్రభుత్వం సగటున సంవత్సరానికి రూ.1,987 కోట్లు నిధులు మాత్రమే విడుదల చేయగా ఇది కూటమి ప్రభుత్వ పాలనలో 60% పెరిగి, రూ.3,168 కోట్లకు పెరిగిందని మంత్రి వివరించారు. ఈ వాస్తవాలకు భిన్నంగా.. జగన్ నిత్య అసత్యాలు ప్రజల విచక్షణ పట్ల ఆయనకు ఏ మాత్రం గౌరవంలేదని వెల్లడిస్తున్నాయని మంత్రి శ్రీ సత్యకుమార్ యాద‌వ్‌ వ్యాఖ్యానించారు.

ఇతర అంశాలు-వాస్తవాలు

నాడు-నేడు పథకం కింద వైద్య రంగం రూపురేఖలు మార్చివేశానని జగన్రెడ్డి నిత్యం అసత్యాలు పలుకుతున్నారని మంత్రి దుయ్యబట్టారు. 17 నూతన వైద్య కళాశాలల నిర్మాణాలకు రూ8,480 కోట్ల ఖర్చును మంజూరు చేయగా అందులో జగన్ కేవలం 17% మాత్రమే ఖర్చుచేశారని… అదేవిధంగా అప్పటికే సేవలు అందిస్తున్న 11 పాత వైద్య కళాశాలల అభివృద్ధి కోసం రూ.3,370 కోట్ల ఖర్చును ఆమోదించి, కేంద్ర ప్రభుత్వం పీజీ సీట్ల పథకాన్ని ప్రారంభించేంత వరకు జగన్ ఒక రూపాయి కూడా ఖర్చుచేయలేదని, కేంద్ర ప్రభుత్వం పథకం కింద ఈ మొత్తంలో రాష్ట్ర వాటాగా జగన్ ప్రభుత్వం కేవలం రూ.73 కోట్లు మాత్రమే విడుదల చేసిందని మంత్రి వెల్లడించారు.

వైద్య రంగాన్ని గాడిన పెడుతున్నాం

ఐదేళ్ల జగన్ పాలనలో రాజకీయ జోక్యం, అరాచకాలు, అక్రమాలు, క్రమశిక్షణ మరియు బాధ్యతారాహిత్యంతో అస్తవ్యస్తమైన ప్రజారోగ్య వ్యవస్థను కూటమి ప్రభుత్వం గాడిన పెడుతోందని.. ఈ దిశగా సాగుతోన్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటనలో తెలిపారు. జూడాల విషయంలో కూటమి ప్రభుత్వం అహంకారంతో వ్యవహరిస్తోందని జగన్ చేసిన వ్యాఖ్యను మంత్రి ఖండించారు. జూడాల స్టైపెండు డిమాండ్ ను అనుచితంగా ప్రభుత్వ మెమోలో పేర్కొన్న మాజీ సీఎం జగన్ రెడ్డి చెంపలేసుకుని, ప్రజలకు, జూడాలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి  స‌త్య‌కుమార్ యాద‌వ్ డిమాండ్ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *