పశువైద్యశాఖలో ఖాళీగా ఉన్న రాష్ట్ర డైరెక్టర్ పోస్ట్ తో సహా పశు వైద్యుల పోస్టులన్నింటినీ వెంటనే భర్తీ చేయాలి…

-కరువు పరిస్థితుల్లో పశువులకు మేత, నీరు, వైద్యం అందించాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర పశుసంవర్ధకశాఖ పరిధిలో ఖాళీగా ఉన్న పశువైద్యుల పోస్టులన్నింటినీ ప్రభుత్వం తక్షణమే భర్తీ చేసి గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శిలు ఎ.కాటమయ్య పి. జమలయ్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర డైరెక్టర్ పోస్టుతో సహా సుమారు 500 పశువైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆగస్టు 6వ తేదీ నుంచి పశుసంవర్ధకశాఖ రాష్ట్ర డైరెక్టర్ పోస్టు కూడా ఖాళీగా ఉందని వారు తెలిపారు. 2018 సంవత్సరం తరువాత పశువైద్యుల నియామకాలు జరగకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్య సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.చాలా మంది పశువైద్యులను డిప్యూటేషన్‌పై నాన్‌టెక్నికల్ పనులకు వినియోగిస్తుండటంతో గ్రామాల్లో పశువైద్యుల కొరత మరింత తీవ్రమైందన్నారు. సకాలంలో వైద్యం అందక పశువులు మృత్యువాత పడుతుండటంతో పాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. పశువైద్యం అందుబాటులో లేని పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొన్ని వెటర్నరీ మందుల దుకాణాల నిర్వాహకులే పశువైద్యులుగా వ్యవహరిస్తూ, అవసరం ఉన్నా లేకపోయినా వేలాది రూపాయల మందులను రైతులకు అంటగడుతున్నారని విమర్శించారు.పశువైద్య విద్యను పూర్తి చేసిన సుమారు 2,500 మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం ద్వారా ఒకవైపు పశువైద్య సేవలను మెరుగుపరచడంతో పాటు మరోవైపు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని కోరారు.
కరువు పరిస్థితుల్లో పశువులను రక్షించాలని విజ్ఞప్తి చేశారు.
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, రాష్ట్రంలో 51 శాతం లోటు వర్షపాతం నమోదైన పరిస్థితుల్లో పశువులకు మేత, నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, పశువులను పోషించే స్థోమత లేక రైతులు వాటిని కబేళాలకు విక్రయించుకునే దుస్థితి ఏర్పడిందన్నారు.
పశువైద్యశాలలకు ప్రభుత్వం మందులు సరఫరా చేసి నాలుగు నెలలు గడిచిందని, ప్రస్తుత క్వార్టర్‌కు సంబంధించిన మందులు ఇంకా సరఫరా కాలేదని తెలిపారు. సర్జికల్ ఎక్విప్‌మెంట్ సరఫరా కూడా చాలా కాలం క్రితమే నిలిచిపోయిందని, దీంతో పశువైద్యులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్ర డైరెక్టర్ పోస్టుతో సహా ఖాళీగా ఉన్న అన్ని పశువైద్యుల పోస్టులను భర్తీ చేయాలని ,కరువు మండలాల్లో పశువులకు మేత, నీరు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని, రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే ప్రత్యేక పశువైద్య శిబిరాలు నిర్వహించాలని మొబైల్ వెటర్నరీ వాహనాల ద్వారా పశువులకు, సన్నజీవాలకు గ్రామాల్లోనే వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.
పశువైద్యశాలలకు అవసరమైన మందులు, సర్జికల్ ఎక్విప్‌మెంట్‌ను వెంటనే సరఫరా చేయాలని
టీఎంఆర్ ఫీడ్, కాటిల్ ఫీడ్, సైలేజ్ గడ్డిని పూర్తిగా ఉచితంగా అందించి పాడి పశువులను, సన్నజీవాలను రక్షించాలని ఎ.కాటమయ్య, పి.జమలయ్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.పశువులను, పాడి రైతులను కాపాడేందుకు ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడి అత్యవసర చర్యలు చేపట్టాలనిఎ.కాటమయ్య, పి.జమలయ్యలు డిమాండ్ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *