విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టీడీపీ జిల్లా పార్టీ సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ ఆధ్వర్యంలో నిర్వహించగా, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ వర్ల రామయ్య, టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి బుద్ధ వెంకన్న, నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నబోయిన చిట్టిబాబు నాగవంశం కార్పొరేషన్ చైర్మన్ ఎరబోతు రమణ,చలసాని రమణ, మాజీ కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్, రమేష్ రెడ్డి జిల్లా పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ప్రతి నెల నిర్వహించే జిల్లా పార్టీ సమావేశాలు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడంలో ఎంతో కీలకమైనవని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు మరింత చేరువగా ఉండి వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు జిల్లా పార్టీ సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయని ఎంపీ చిన్ని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా పార్టీ శ్రేణులు ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో, ఐక్యంగా పనిచేయాలని ఎంపీ చిన్ని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని అన్నారు. పార్టీ విజయానికి కార్యకర్తలే ప్రధాన బలమని, వారి కృషి, అంకితభావం పార్టీకి ఎప్పటికీ వెన్నెముకగా నిలుస్తాయని పేర్కొన్నారు.
విజయవాడ జిల్లాలో పార్టీకి అద్భుతమైన నాయకత్వంతో పాటు సమర్థవంతమైన కార్యవర్గం ఉందని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం మరింత పెంచుకుని ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.
పార్టీ కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, వారి సమస్యలను పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటానని ఎంపీ చిన్ని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, పార్టీలో మంచి స్థానం కచ్చితంగా దక్కుతుందని భరోసా ఇచ్చారు.
కార్యకర్తల సంక్షేమం, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం అనే మూడు అంశాలకు ప్రాధాన్యతనిస్తూ రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో పనిచేయాలని ఎంపీ కేశినేని చిన్ని పార్టీ శ్రేణులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త సమష్టి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News