కరువు మండలాలపై తక్షణం ప్రకటన చేయాలి…

-పంటనష్టాన్ని అంచనా వేసి ఎకరాకు రూ.25వేలు నష్టపరిహారం చెల్లించాలి.
-సెప్టెంబర్ 11న రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దారు కార్యాలయాల వద్ద ధర్నాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నుంచి రైతాంగాన్ని రక్షించాలని, ఇప్పటికే జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేసి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించి, తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ఈశ్వరయ్య, కె.వి.వి.ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతులసంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ. కాటమయ్య, పి. జమలయ్య లు నేడొక ప్రకటనలో రైతాంగానికి పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో రైతులు, కౌలు రైతులు తీవ్రంగా అల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవేమీ పట్టనట్టుగా వ్యవహరించడం దారుణమని వారు మండిపడ్డారు. ఎల్‌నినో ప్రభావం, వర్షపాత లోటు కారణంగా సాగు విస్తీర్ణం తగ్గిపోగా, ఇప్పటికే సాగు చేసిన పంటలు కూడా ఎండిపోయే ప్రమాదంలో ఉన్నాయి. నైరుతి రుతుపవనాల కాలంలో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే సుమారు 13 శాతం తక్కువగా ఉండగా, ఆగస్టు 25 నాటికి రాష్ట్రంలో ఏకంగా 51శాతం వర్షపాత లోటు నమోదైందన్నారు. ఇది దేశవ్యాప్త లోటు కంటే దాదాపు నాలుగు రెట్లు అధికమని తెలిపారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లోనూ వర్షపాత లోటు పరిస్థితులు ఉన్నాయని, 25 జిల్లాల్లో లోటు, మిగిలిన మూడు జిల్లాల్లో తీవ్ర లోటు పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 688 మండలాలకుగాను 665 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుత ఖరీఫ్‌లో ఇప్పటివరకు 20.65 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయని, గత ఏడాది ఇదే కాలంలో సాగైన 25.63 లక్షల హెక్టార్లతో పోలిస్తే సుమారు 21శాతం తగ్గిందన్నారు. ముఖ్యంగా వరి సాగు విస్తీర్ణం 11.79 లక్షల హెక్టార్ల నుంచి 10.37 లక్షల హెక్టార్లకు తగ్గిందని తెలిపారు. పప్పుధాన్యాల సాగు మాత్రం 2.16 లక్షల హెక్టార్ల నుంచి 2.66 లక్షల హెక్టార్లకు పెరిగిన పంటలు ఎండిపోతున్నాయన్నారు. రాయలసీమతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు లేక పశువులకు మేత, నీరు కూడా దొరకని దుస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పశువులను పోషించుకోలేక రైతులు వాటిని అతి తక్కువ ధరలకు సంతల్లో అమ్ముకుని తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశువుల సంరక్షణకు హాస్టల్స్ ఏర్పాటు చేస్తామని, గడ్డి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,489 రైతు సేవా కేంద్రాల్లో 1,357 ఆరఎస్‌కేలు తీవ్ర వర్షాభావ ప్రభావానికి, 2,057 ఆరఎస్‌కేలు మధ్యస్థ వర్షాభావ ప్రభావానికి గురయ్యాయని, మొత్తం 3,434 ఆరఎస్‌కేలను ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించినప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టడం లేదన్నారు. ముందస్తు ఖరీఫ్ పేరుతో రైతులను మభ్యపెట్టారు. 2026 మార్చి, ఏప్రిల్ నుంచే ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక రూపొందించలేదని వారు విమర్శించారు. ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నా ముందస్తు ఆలోచనలు లేకుండా మే 15 నాటికి సాగునీరు అందిస్తామని, ఖరీఫ్ సీజన్‌ను నెలన్నర ముందుకు తీసుకొస్తామని విస్తృతంగా ప్రచారం చేసి రైతులకు ఆశలు కల్పించి పంటలు వేసేలా ప్రోత్సహించారని తెలిపారు. ప్రభుత్వ మాటలు నమ్మి పంటలు వేసుకున్న రైతులు ఇప్పుడు వర్షాలు లేక తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా రిజర్వాయర్లను ఖాళీ చేయడంవల్ల ప్రస్తుతం రైతులకు సాగునీటి కొరత ఏర్పడిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తప్పిదాలను గుర్తించి ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వర్షాభావంతో నష్టపోయిన పంటలను తక్షణమే సర్వే చేసి ప్రతి ఎకరాకు నష్టపరిహారం చెల్లించాలని, ఎండిపోతున్న పంటలను రక్షించేందుకు అవసరమైన సాగునీరు, ప్రత్యామ్నాయ నీటి వనరులు అందుబాటులోకి తేవాలని,పశువులకు ఉచితంగా గడ్డి, నీరు అందించి, పశుసంరక్షణ చర్యలు చేపట్టాలని రైతులు చెల్లిస్తున్న పంటల బీమా ప్రీమియంను నిలిపివేసి, ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని,పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఎరువుల యాప్‌లను రద్దు చేసి, గతంలో మాదిరిగానే రైతులకు, కౌలురైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచాలని ఫార్మర్ ఐడీతో సంబంధం లేకుండా క్షేత్రస్థాయిలో పంటలు సాగు చేస్తున్న కౌలు రైతులను గుర్తించి, వారి పేర్లతోనే పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకునే అవకాశం కల్పించాలని వర్షాభావ మండలాలను గుర్తించి ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టాలని,రైతులు, కౌలు రైతులకు అత్యవసరంగా ఇన్‌పుట్ సబ్సిడీ, రుణ ఉపశమనం, పంటల బీమా పరిహారం అందించాలని రైతాంగం ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కరువు తీవ్రత దృష్యా అఖిలపక్ష రైతుసంఘాలతో తక్షణం సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను పరిగణలో తీసుకొని సహాయకచర్యలు చేపట్టే చొరవ తీసుకోవాలి. సెప్టెంబర్ 11న రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలల్లో రైతులు, కౌలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని గుజ్జుల ఈశ్వరయ్య, కె.వి.వి.ప్రసాద్, ఎ.కాటమయ్య, పి.జమలయ్యలు కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *