చిన్నారుల ఆరోగ్యానికి ప్రభుత్వ భరోసా

-4 నెలల్లో 18 ఏళ్ల లోపు వయసు కలిగిన 441 మందికి ఉచిత శస్త్ర చికిత్సలు
-రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (RBSK) ద్వారా 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి ఆగస్టు 19 వరకు 441 శస్త్రచికిత్సలు పూర్తయ్యాయి. వీటిలో అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో గుర్తించిన పిల్లలకు 289, పాఠశాలల్లో నిర్వహించిన స్క్రీనింగ్‌లో గుర్తించిన వారికి 152 శస్త్రచికిత్సలు చేశారు. వీటికి మొత్తం రూ.2,42,23,728 వ్యయం అయింది.

వీరంతా పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు. పిల్లల్లో ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స, శస్త్రచికిత్స, థెరపీ, ఫాలోఅప్‌ సేవలు అందిస్తున్న తీరుపై రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీ చక్రధర్ బాబు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్‌ యాదవ్‌కు వివరించారు.

అంగన్‌వాడీ, పాఠశాలల్లోనే ఆరోగ్య పరీక్షలు

రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రభుత్వ సహాయక (ఎయిడెడ్‌) పాఠశాలల్లో చిన్నారులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పుట్టుకతో వచ్చే లోపాలు, వ్యాధులు, పోషకాహార లోపాలు, అభివృద్ధి ఆలస్యాలు, వైకల్యాలను గుర్తించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు.

ఏఎన్ఎంలు, మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు (MLHPs) ప్రాథమిక పరీక్షలు నిర్వహించి అనుమానిత కేసులను పీహెచ్‌సీ వైద్యాధికారులకు పంపుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) వైద్యాధికారి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి అవసరమైన పిల్లలను ఉన్నత వైద్య సంస్థలు లేదా జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రానికి (DEIC) రిఫర్‌ చేస్తున్నారు.

DEICల్లో సమగ్ర పరిశీలన.. అవసరమైన చికిత్స

జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రానికి వచ్చిన ప్రతి చిన్నారినీ పీడియాట్రిషియన్‌ సమగ్రంగా పరీక్షించి ఆరోగ్య సమస్యను నిర్ధారిస్తారు. సమస్యను బట్టి మందులతో చికిత్స, శస్త్రచికిత్స లేదా థెరపీ అవసరమా అన్నది నిర్ణయిస్తారు.

జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రంలోనే అందుబాటులో ఉన్న సేవలను అందిస్తుండగా, శస్త్రచికిత్స అవసరమైన పిల్లలను సంబంధిత ఉన్నత వైద్య సంస్థలకు పంపిస్తున్నారు. ప్రభుత్వ వైద్య సంస్థల్లో అందుబాటులో లేని శస్త్రచికిత్సలను RBSK కింద టైఅప్‌ ఉన్న ఆసుపత్రులకు రిఫర్‌ చేసి, డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్యసేవ లేదా ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (PM-JAY) ద్వారా ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.

నాలుగు నెలల్లో 441 శస్త్రచికిత్సలు

2026–27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి ఆగస్టు 19 వరకు ఆర్‌బియ‌స్‌కె ద్వారా మొత్తం 441 మంది చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించారు. వీరిలో అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించిన ఆరోగ్య పరీక్షల సమయంలో 289 మంది, పాఠశాలల్లో నిర్వహించిన పరీక్షల సమయంలో 152 మంది గుర్తించారు.

రెటినోపతి ఆఫ్‌ ప్రీమెచ్యూరిటీ (ROP)కు 132 శస్త్రచికిత్సలు: తక్కువ బరువుతో లేదా ముందస్తుగా జన్మించిన శిశువుల్లో కనిపించే ‘రెటినోపతి ఆఫ్‌ ప్రీమెచ్యూరిటీ’ (ROP)కు అత్యధికంగా 132 శస్త్రచికిత్సలు జరిగాయి. ఒక్కో శస్త్రచికిత్సకు రూ.25 వేల చొప్పున మొత్తం రూ.33 లక్షలు ఖర్చయ్యాయి.

క్లెఫ్ట్‌ లిప్‌, క్లెఫ్ట్‌ పాలేట్‌కు 72 శస్త్రచికిత్సలు: పెదవి లేదా అంగిలి పుట్టుకతోనే విడిపోయి ఉండే ‘క్లెఫ్ట్‌ లిప్‌, క్లెఫ్ట్‌ పాలేట్‌’ సమస్యలకు 72 శస్త్రచికిత్సలు నిర్వహించారు.

కంజెనిటల్‌ హార్ట్‌ డిసీజ్‌కు 30 శస్త్రచికిత్సలు: ‘కంజెనిటల్‌ హార్ట్‌ డిసీజ్‌’తో బాధపడుతున్న 30 మంది చిన్నారులకు శస్త్రచికిత్సలు నిర్వహించారు.

క్లబ్‌ఫుట్‌కు 35 శస్త్రచికిత్సలు: పిల్లల్లో పాదం పుట్టుకతోనే లోపంగా ఉండే ‘క్లబ్‌ఫుట్‌’ సమస్యకు 35 శస్త్రచికిత్సలు జరిగాయి.

కంజెనిటల్‌ డెఫ్‌నెస్‌కు 10, న్యూరల్‌ ట్యూబ్‌ డిఫెక్ట్స్‌కు 6, కంజెనిటల్‌ క్యాటరాక్ట్‌కు 4 శస్త్రచికిత్సలు నిర్వహించారు. మరో 152 మంది చిన్నారులకు కంటి వంకర (స్క్వింట్‌), టాన్సిలైటిస్‌, అపెండిసైటిస్‌, టంగ్‌ టై, పుట్టుకతో వృషణం దిగకపోవడం, దంత సమస్యలు, గాయాలకు సంబంధించిన శస్త్రచికిత్సలు ఉన్నాయి.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో 238 శస్త్రచికిత్సలు

మొత్తం 441 శస్త్రచికిత్సల్లో 238 శస్త్రచికిత్సలను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిర్వహించారు. ప్రభుత్వ వైద్య సంస్థల్లో అవసరమైన సేవలు అందుబాటులో లేని సందర్భాల్లో ఆర్‌బియ‌స్‌కెతో అనుసంధానమైన ఆసుపత్రుల సేవలను వినియోగించారు.

ఆర్‌బియ‌స్‌కె కింద ఒప్పందాన్ని కుదుర్చుకున్న 15 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఈ శస్త్రచికిత్సలు జరిగాయి. ఈ ఆసుపత్రుల్లో డాక్టర్‌ ఎల్వీ ప్రసాద్‌ వంటి ప్రముఖ ఆసుపత్రులు ఉన్నాయి. ప్రభుత్వ వైద్య సంస్థల్లో అందుబాటులో లేని శస్త్రచికిత్సలను అనుబంధ ఆసుపత్రుల్లో డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్యసేవ లేదా పీఎం-జేఏవై కింద ఉచితంగా నిర్వహిస్తున్నారు.

దీంతో తల్లిదండ్రులు నేరుగా ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయించి వైద్య ఖర్చులు భరించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ రిఫరల్‌ వ్యవస్థ ద్వారా సేవలు పొందుతున్నారు.

తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌.. చికిత్సపై అవగాహన

మంత్రి శ్రీ సత్యకుమార్‌ యాదవ్

చిన్నారికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించినప్పుడు కొంతమంది తల్లిదండ్రులు వెనుకంజ వేసే పరిస్థితుల్లో పీడియాట్రిషియన్‌, వైద్యాధికారి, సోషల్‌ వర్కర్‌ కౌన్సెలింగ్‌ అందిస్తున్నారు.

అనంతపురం జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రంలో క్లెఫ్ట్‌ లిప్‌, మార్కాపురం జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రంలో క్లబ్‌ఫుట్‌, అనకాపల్లి జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రంలో కంజెనిటల్‌ హార్ట్‌ డిసీజ్‌, శ్రీకాకుళం జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రంలో కోక్లియర్‌ ఇంప్లాంట్‌ కేసులకు సేవలు అందించారు.
అంగన్‌వాడీ కేంద్రం లేదా పాఠశాలలో నిర్వహించే సాధారణ ఆరోగ్య పరీక్షలోనే సమస్యను గుర్తించి, అవసరమైన వైద్య సేవలను ఉచితంగా అందించడం, శస్త్రచికిత్స అవసరమైన వారికి తగిన ఆసుపత్రికి రిఫర్‌ చేయడం, చికిత్స అనంతరం కూడా ఫాలోఅప్‌ చేస్తూ చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *