మార్కాపురం జిల్లా, కనిగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
దశాబ్దాలుగా ప్రకాశం, నెల్లూరు, కడప, బాపట్ల జిల్లాల ప్రజలు ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారం కావడం చారిత్రాత్మక ఘట్టమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
మార్కాపురం జిల్లా కనిగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో కలిసి దేవినేని ఉమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కృష్ణమ్మ నీరు నల్లమల సాగర్‌కు చేరే అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కానుందని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాయకుడే.. దానిని పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయడం విధి సంకల్పం, చంద్రబాబు గారి దూరదృష్టికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రానున్న రోజుల్లో ఈ ప్రాంతం వ్యవసాయం, తాగునీరు, పరిశ్రమలు, ఉపాధి రంగాల్లో మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.
ఎన్టీఆర్, చంద్రబాబు గార్ల దూరదృష్టి వల్లే తెలుగు గంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి వంటి ప్రాజెక్టుల ద్వారా రాయలసీమలోని నాలుగు జిల్లాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం అయ్యాయని తెలిపారు. సోమశిల, కండలేరు జలాశయాల ద్వారా చెన్నై నగరానికి తాగునీరు అందించే ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు.
సముద్రంలో కలిసిపోయే గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించి, కృష్ణమ్మ నీటిని రాయలసీమకు అందించే మహత్తరమైన జల నిర్వహణకు చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారని దీనిని తట్టుకోలేని వైసిపి నాయకులు పంపులు పీకుతామని పట్టిసీమ దండగ అంటూ అసత్య ప్రచారాలు చేశారని దేవినేని ఉమ అన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్న మహా సంకల్పమే నేడు ఎన్నో ప్రాజెక్టుల సాకారానికి కారణమైందని తెలిపారు.
వెలిగొండ కోసం భూములు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయడంతో పాటు.. ఈ ప్రాంత రైతుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రేపు జరగనున్న వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు, రైతులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News