కొండలు.. కోనల్లో ఉండే గిరిజనులకు డ్రోన్ల ద్వారా వైద్య సేవలు

-4 డ్రోన్లు.. 1,800కుపైగా ట్రిప్పులు
-71 వేల కిలోమీటర్లకుపైగా ప్రయాణం
-నమూనాల సేకరణ, మందులు వ్యాక్సిన్ల సరఫరా ద్వారా 24,500 మందికిపైగా రోగులకు సేవలు..
-సమయం, దూరం, ఖర్చుల ఆదా
-గిరిజనులకు సత్వర వైద్యం
-రాష్ట్రంలో తొలిసారి ప్రవేశపెట్టిన డ్రోన్‌ ఆధారిత వైద్య రవాణా వ్యవస్థతో సత్ఫలితాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రవేశపెట్టిన డ్రోన్‌ ఆధారిత వైద్య రవాణా వ్యవస్థ సత్ఫలితాలు అందిస్తోంది. కొండలు, దట్టమైన అటవీ ప్రాంతాలు, రహదారి సౌకర్యాల కొరత కారణంగా వైద్య పరీక్షలు, మందుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన గిరిజనుల ఇబ్బందులను ఈ విధానం తగ్గిస్తోంది. జనవరి 2026లో ప్రారంభమైన ఈ సేవల్లో నాలుగు డ్రోన్ల ద్వారా ఇప్పటివరకు 1,800కుపైగా ట్రిప్పులు పూర్తయ్యాయి. డ్రోన్లు 71 వేల కిలోమీటర్లకుపైగా ప్రయాణించాయి. 2,200కుపైగా వైద్య పరీక్షల నమూనాలను తరలించగా, వాటిలో 596 సికిల్‌సెల్‌ నమూనాలు ఉన్నాయి. 9,000కుపైగా పరీక్షలకు అవకాశం కల్పించడంతోపాటు 24,500 మందికిపైగా రోగులకు సేవలు అందించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ తెలిపారు.

8 ఆసుపత్రులతో అనుసంధానం

పాడేరు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (జీజీహెచ్‌)తో పాటు లొథుగెడ్డ, తాజంగి, సుంకరమెట్ట, భీమవరం, అనంతగిరి పీహెచ్‌సీలు, ముంచింగిపుట్టు సీహెచ్‌సీ, చింతపల్లి, అరకు ఏరియా ఆసుపత్రులను డ్రోన్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానించారు.
ఆగస్టు 29న గన్నెల పీహెచ్‌సీ నుంచి ఆర్‌కే నగర్‌ గ్రామానికి వైద్య పరీక్షల నివేదికలు, వ్యాక్సిన్లు, మందులను డ్రోన్‌ ద్వారా తరలించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా అధికారులతో జరిగిన రివ్యూ సందర్భంగా ఆదివారం మంత్రి శ్రీ సత్యకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ఈ సేవలను విస్తృతం చేయబోతున్నట్లు చెప్పారు.

వ్యాక్సిన్లు, మందులు కూడా తరలింపు

వైద్య పరీక్షల నమూనాలతో పాటు అత్యవసర మందులు, వ్యాక్సిన్లు, ఇతర వైద్య సామగ్రిని అవసరమైన ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా వేగంగా తరలిస్తున్నారు. దీంతో రోగులు పరీక్షల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతోంది. ప్రయాణ సమయం, ఖర్చులు, పనిదినాల నష్టాన్ని కూడా ఈ విధానం గణనీయంగా తగ్గిస్తోందని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీ చక్రధర్ బాబు తెలిపారు

సికిల్‌సెల్‌ స్క్రీనింగ్‌కు ఊతం

వైద్య పరీక్షల నమూనాలు త్వరగా ప్రయోగశాలలకు చేరడంతో ఫలితాలు కూడా సకాలంలో అందుతున్నాయి. దీంతో చికిత్సలో జాప్యాన్ని నివారించే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా సికిల్‌సెల్‌ వ్యాధి స్క్రీనింగ్‌తోపాటు వ్యాధి నిఘా, ప్రజారోగ్య కార్యక్రమాలకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతోందని కమిషనర్ తెలిపారు. అదేవిధంగా పీహెచ్‌సీలకు అవసరమైన మందులు, వైద్య సామగ్రిని సకాలంలో చేరవేయడం ద్వారా ప్రభుత్వ వైద్య మౌలిక వసతులను మరింత సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతోంది.

గిరిజన యువతకు శిక్షణ

మంత్రి సత్యకుమార్‌

డ్రోన్‌ కార్యకలాపాలు, సహాయక సేవల్లో స్థానికుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఇప్పటివరకు 25 మందికిపైగా స్థానిక, గిరిజన యువతకు శిక్షణ ఇప్పించాం.
మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాo. వైద్య పరీక్షల నమూనాలు, మందులు, అవసరమైన సామగ్రిని వేగంగా తరలించడం ద్వారా రోగులకు సకాలంలో పరీక్షలు, చికిత్స అందించేందుకు వీలవుతోందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *