-30 ఏళ్ల వెలిగొండ కల సాకారం
-కృష్ణమ్మను కరవు నేలకు తీసుకురావటం ఆయన సంకల్పానికి నిదర్శనం
-సీఎంకు సత్యకుమార్ అభినందనలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం కానుండటం ప్రకాశం, మార్కాపురం ప్రాంత ప్రజలకు చారిత్రాత్మక సందర్భమని బీజేపీ జాతీయ నాయకుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 1996లో వెలిగొండకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఇప్పుడు తొలి దశను ప్రారంభిస్తుండటం ఆయన సంకల్పబలానికి నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత పనులను వేగవంతం చేసి కీలక దశకు తీసుకొచ్చిన సీఎంకు అభినందనలు తెలిపారు. ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితుల సహకారం చిరస్మరణీయమని, 6,206 కుటుంబాలకు రూ.768 కోట్ల పరిహారం అందించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు. తమ త్యాగంతో లక్షలాది ఎకరాలకు సాగునీరు, సుమారు 25 లక్షల మందికి తాగునీరు అందనుందనే సంతృప్తితో నిర్వాసితులు ఉన్నారని తెలిపారు.
వెలిగొండ జలాల రాకతో సాగునీటి భద్రత పెరగడంతో వ్యవసాయంలో పంటల వైవిధ్యానికి అవకాశం కలుగుతుందని, ఉద్యాన పంటలు, పాడి పరిశ్రమ, విత్తనోత్పత్తి వంటి అనుబంధ రంగాలు విస్తరిస్తాయని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించే ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజీ, గిడ్డంగుల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు. నీటి వనరులతో పాటు రహదారులు, మార్కెట్లు, విద్య, వైద్య సదుపాయాలను అభివృద్ధి చేస్తే మార్కాపురం ప్రాంతం వ్యవసాయ ఆధారిత ఆర్థిక కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని తెలిపారు.
పోలవరం నుంచి రాష్ట్రవ్యాప్త ప్రగతి వరకు
పోలవరం, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వంశధార, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేయడం ద్వారా రాష్ట్రంలో నీటి భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సత్యకుమార్ అన్నారు. పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్ మౌలిక వసతుల అభివృద్ధితో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచే దిశగా సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు వాటి ద్వారా వ్యవసాయం, పరిశ్రమలు, గ్రామీణ ఉపాధికి అనుసంధానం కల్పించే విధానంతో రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది ఏర్పడుతోందని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News