-రాష్ట్రస్థాయి పాఠశాల భద్రత పర్యవేక్షణ కమిటీ సమావేశం
-స్కూల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా ఎ., ఐఏఎస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో విద్యార్థులకు సురక్షితమైన, స్నేహపూర్వకమైన విద్యా వాతావరణాన్ని కల్పించడంతో పాటు పాఠశాల భద్రత, భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక అడుగు వేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పాఠశాల భద్రత పర్యవేక్షణ కమిటీ (స్టేట్ లెవల్ టాస్క్ ఫోర్స్) సమావేశాన్ని సోమవారం విజయవాడలోని విద్యాభవన్‌లో నిర్వహించారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీమతి తమీమ్ అన్సారియా ఎ., ఐఏఎస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూనిసెఫ్ నిపుణులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొని భద్రతా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసే అంశంపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా శ్రీమతి తమీమ్ అన్సారియా ఎ., ఐఏఎస్ ‘స్కూల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పాఠశాలల్లో భద్రత, సన్నద్ధత, అవగాహనను పెంపొందించడంతో పాటు విద్యార్థుల భద్రత పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధికారులు, పాఠశాల యాజమాన్యాలు, ఇతర భాగస్వామ్య వర్గాల్లో బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ పుస్తకాన్ని రూపొందించారు.
వివిధ శాఖలతో సమష్టి భాగస్వామ్యం
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA), మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు శాఖ(APSDRF), పోలీసు విభాగం, ఈగిల్ టీమ్, ఆర్టీసీ, గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖతో పాటు ఇతర భాగస్వామ్య శాఖలు, సంస్థల అధికారులు పాల్గొన్నారు.
శాఖల మధ్య సమన్వయం ఉండాలి
వివిధ శాఖలు పిల్లల భద్రత, సంక్షేమానికి సంబంధించిన విభిన్న అంశాలపై పనిచేస్తున్నాయని శ్రీమతి తమీమ్ తెలిపారు. మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, సంక్షేమం, విపత్తు నిర్వహణ, రక్షణ వంటి అంశాలపై ఆయా శాఖలు తమ బాధ్యతలను నిర్వహిస్తున్నప్పటికీ, ఒక విద్యార్థి భద్రత విషయంలో అన్ని శాఖలు విడివిడిగా కాకుండా సమన్వయంతో, సమష్టిగా పనిచేయాని కోరారు.
డైనమిక్ వర్కింగ్ మోడల్
పాఠశాల భద్రతను బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయి పరిస్థితులకు, మారుతున్న అవసరాలకు అనుగుణంగా సరళమైన, ఆచరణాత్మకమైన, డైనమిక్ వర్కింగ్ మోడల్ రూపొందించాని శ్రీమతి తమీమ్ అన్నారు. ఈ వర్కింగ్ మోడల్ ఉపాధ్యాయులు, పాఠశాలలపై అనవసరమైన అదనపు భారం పడకుండా, క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయగలిగేలా రూపొందించబడుతుందని తెలిపారు. పాఠశాల భద్రత ఒకసారి అమలు చేసి ముగించే కార్యక్రమం కాదని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. చేపట్టిన కార్యక్రమాల పురోగతిని క్రమం తప్పకుండా, అవసరమైతే నెలవారీగా సమీక్షించి, క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా అవసరమైన మార్పులు చేసుకుంటూ ముందుకు సాగాలని శ్రీమతి తమీమ్ సూచించారు.
పాఠశాల భద్రతపై నిరంతర అప్రమత్తత, సమన్వయం అవసరం: బి. శ్రీనివాసరావు ఐఏఎస్
పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు సంబంధించిన క్షేత్రస్థాయి సమస్యలను సమగ్రంగా గుర్తించి, పరిష్కరిస్తున్నామని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు ఐఏఎస్ అన్నారు. పాఠశాల భద్రతపై నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన ఆన్లైన్లో మాట్లాడారు. నిర్మాణంలో ఉన్న భవనాలు, పాత ప్రహరీలు, పాఠశాల పరిసరాల్లోని మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత కీలకమన్నారు. పాఠశాల భద్రత అంటే మౌలిక సదుపాయాలకు మాత్రమే పరిమితం కాదని, రక్షణ, వేధింపులు, దుర్వినియోగం, అనుచిత ప్రవర్తన, సైబర్ భద్రత, మాదక ద్రవ్యాల పదార్థాల ప్రభావం, విద్యార్థుల రవాణా, వసతి గృహాల భద్రత వంటి అంశాలను కూడా సమగ్రంగా పరిష్కరించాల్సి ఉందన్నారు. సోషల్ ఆడిట్లు, క్షేత్రస్థాయి పరిశీలనల్లో వెలుగులోకి వస్తున్న సమస్యలను పరిగణించి, విద్యార్థులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులు డిజిటల్ పరికరాల ద్వారా అనుచిత కంటెంట్‌కు గురికాకుండా సైబర్ భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు, పొగాకు, మాదక పదార్థాల వంటి హానికరమైన పదార్థాల ప్రభావం నుంచి విద్యార్థులను రక్షించేందుకు పాఠశాలలు, తల్లిదండ్రులు, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. విద్యార్థుల రవాణాలో ఆటోలు, ప్రైవేట్ వాహనాలు భద్రతా ప్రమాణాలను పాటించేలా సంబంధిత శాఖలతో సమన్వయం అవసరమన్నారు. పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థుల భద్రతకు ప్రత్యేక విధానాలను అమలు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో ప్లానింగ్ అడిషనల్ డైరెక్టర్ శ్రీ డి. మధుసూదన రావు, SCERT డైరెక్టర్ శ్రీ ఎం.వీ. కృష్ణారెడ్డి, యునిసెఫ్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ శేషగిరి మధుసూదన్, సుదర్శన్, నోడల్ ఆఫీసర్ వాసిరెడ్డి విజయ దుర్గ, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News