స్థానిక ఎన్నికలకు బీసీవై పార్టీ సిద్ధం…

-బీసీలకు 50 శాతం సీట్లు కేటాయిస్తాం..
-బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థాయిల్లో పోటీ చేసేందుకు భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) సిద్ధమవుతోందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ తెలిపారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులు కార్యకర్తల సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాలకు 50 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
సంచార జాతులకు అండగా…
జాతీయ సంచార అర్ధ సంచార జాతుల విముక్తి దినోత్సవం సందర్భంగా 56 సంచార జాతులకు బీసీవై పార్టీ శుభాకాంక్షలు తెలిపింది. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో ఈ వర్గాలు వెనుకబడి ఉన్నాయని రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. వారి అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు.
ఓటర్ల జాబితాపై విమర్శలు…
స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటర్ల జాబితా విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. జూలై 1, 2026 నాటి ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉండగా జనవరి1 2026 నాటి జాబితాతో ఎన్నికలకు వెళ్లాలని చూడటం సరికాదన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ద్వారా సుమారు 48 లక్షల ఓట్లు తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
44 శాతం రిజర్వేషన్లు కల్పించాలి…
బీసీ రిజర్వేషన్ల విషయంలో టీడీపీ, వైసీపీలు బీసీలను వంచించాయని రామచంద్ర యాదవ్, ఆరోపించారు. గతంలో 34 శాతంగా ఉన్న రిజర్వేషన్లను వైసీపీ ప్రభుత్వం 24 శాతానికి తగ్గించిందని ప్రస్తుత ప్రభుత్వం కూడా సాంకేతిక కారణాలతో 24 శాతానికే పరిమితం చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. 1984లో ఇచ్చిన 44 శాతం రిజర్వేషన్ల హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర కులగణన చేపట్టాలని కోరారు.
అణగారిన వర్గాలకు ప్రాధాన్యం…
రాబోయే ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించడంతో పాటు ఇప్పటివరకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మిగిలిన 50 శాతం స్థానాల్లో కాపులు, ఇతర అణగారిన వర్గాలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం కుట్రలకు పాల్పడితే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని బోడె రామచంద్ర యాదవ్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *