-PM e-Bus Sewa కింద 750 ఈ-బస్సులు.. మరో 300 ఈ-బస్సుల కోసం ప్రభుత్వ ప్రతిపాదన
-అక్టోబర్ నాటికి తొలి విడత 350 ఈ-బస్సులు – చార్జింగ్ స్టేషన్లు, విద్యుత్ సబ్‌స్టేషన్ల పనులు వేగవంతం
అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు సౌకర్యవంతమైన, పర్యావరణహితమైన ప్రజా రవాణా సేవలను అందించడమే లక్ష్యంగా APSRTCలో విద్యుత్ బస్సులను పెద్దఎత్తున ప్రవేశపెడుతున్నామని APSRTC చైర్మన్ కొనకళ్ల నారాయణరావు తెలిపారు.
ఆదివారం అనంతపురం గ్యారేజీని సందర్శించి, డిపోలోని వివిధ విభాగాలను తనిఖీ చేశారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ బస్సుల ఛార్జింగ్ స్టేషన్లను పరిశీలించారు. చివరగా, సిబ్బందిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
ప్రజా రవాణాను ఆధునీకరించి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో కూడిన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రతి డీజిల్ బస్సు స్థానంలో క్రమంగా విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడవచ్చని తెలిపారు.
750 ఈ-బస్సులు.. మరో 300 బస్సుల కోసం ప్రతిపాదన
PM e-Bus Sewa పథకం కింద రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులు రానున్నాయని చైర్మన్ తెలిపారు. వీటికి అదనంగా మరో 300 విద్యుత్ బస్సులను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి ని కోరినట్లు చెప్పారు.
ప్రస్తుతం మంజూరైన 750 ఈ-బస్సుల్లో తొలి విడతగా 350 బస్సులు అక్టోబర్ నాటికి అందుబాటులోకి రానున్నాయని, మిగిలిన బస్సులు కూడా ఈ సంవత్సరం చివరి నాటికి దశలవారీగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ఈ-బస్సుల కోసం మౌలిక సదుపాయాల ఏర్పాటు
విద్యుత్ బస్సుల నిర్వహణకు అవసరమైన ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్లు, చార్జింగ్ స్టేషన్ల నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. ఆయా పనుల పురోగతిని జిల్లా అధికారులతో కలిసి సమీక్షించినట్లు చెప్పారు.
అక్టోబర్ నాటికి అవసరమైన మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేసి, కొత్తగా వచ్చే విద్యుత్ బస్సుల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
స్త్రీ శక్తి పథకంతో మహిళలకు స్వేచ్ఛాయుత ప్రయాణం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఎంతో ప్రయోజనం కలుగుతోందని నారాయణరావు తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకం కోసం ప్రభుత్వం ₹3,000 కోట్లకు పైగా ఆర్థిక భారం భరిస్తున్నప్పటికీ, మహిళల సౌకర్యం, సాధికారతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.
స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు ఉద్యోగాలు, వైద్య సేవలు, కుటుంబ అవసరాలు, తీర్థయాత్రలు తదితర అవసరాల కోసం APSRTC బస్సులను విస్తృతంగా వినియోగించుకుంటున్నారని, ఈ పథకానికి మహిళల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు.
దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
అదేవిధంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా వారికి కూడా ప్రజా రవాణా మరింత అందుబాటులోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. దివ్యాంగులు ఈ సౌకర్యాన్ని పెద్ద సంఖ్యలో వినియోగించుకుంటున్నారని తెలిపారు.
ప్రయాణికులు, ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం
భవిష్యత్తులో అవసరానికి అనుగుణంగా మరిన్ని విద్యుత్ బస్సులను తీసుకురావడంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చైర్మన్ తెలిపారు. విద్యుత్ వాహనాల వినియోగం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రధాన సమస్యగా ఉన్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ప్రభుత్వం ఆర్థిక భారాన్ని సైతం పరిగణనలోకి తీసుకోకుండా ప్రయాణికుల సౌకర్యం, ఉద్యోగుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఉద్యోగ సంఘాలతో కూడా చర్చలు జరిపి, వారి సమస్యలు మరియు ప్రయోజనాలపై పరస్పర అవగాహనతో ముందుకు సాగుతున్నామని APSRTC చైర్మన్ కొనకళ్ల నారాయణరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో K S బ్రహ్మానంద రెడ్డి, E.D.(A). రవి వర్మ, E.D.(E) కడప జోన్(ED) కృష్ణ కిషోర్, ప్రజా రవాణా అధికారి శ్రీలక్ష్మి, డిప్యూటీ ప్రశాంతి, సివిల్ విభాగం అధికారులు, అనంతపురం డిపో మేనేజర్ శ్రీకాంత్, విజిలెన్స్ & సెక్యూరిటీ అధికారులు, అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News