కాంట్రాక్ట్‌ ఉద్యోగుల డిమాండ్లపై చర్చలు

-ఆర్థికేతర సమస్యల పరిష్కారoపై ఉన్నత స్థాయిలో చర్చించి నిర్ణయం
-జేఏసీ ప్రతినిధులకు తెలియజేసిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు, వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ గోపాలకృష్ణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ పరిధిలోని కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) ప్రతినిధులతో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు సోమవారం ప్రాథమిక స్థాయి చర్చలు నిర్వహించారు. తమ అపరిష్కృత డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న ఉద్యోగులతో తాడేపల్లిలోని డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ చక్రధర్‌ బాబు, వైద్యారోగ్య శాఖ జాయింట్‌ సెక్రటరీ రోణంకి గోపాలకృష్ణ, ప్రజారోగ్య శాఖ సంచాలకులు పద్మావతి, వైద్య విద్య శాఖ అదనపు సంచాలకురాలు డాక్టర్‌ రాధికా రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. జేఏసీ తరఫున కోటేశ్వరరావు, అజయ్‌కుమార్‌ సహా పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్‌ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో మూడు గంటలకు పైగా జేఏసీ ప్రతినిధులతో చర్చించి, వారి సమస్యలను అధికారులు విపులంగా తెలుసుకున్నారు.

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని జేఏసీ ప్రతినిధులు కోరారు. క్రమబద్ధీకరణ అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని అధికారులు వారికి వివరించినట్లు తెలిసింది. రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు 100 శాతం గ్రాస్‌ వేతనం చెల్లించాలని, విధి నిర్వహణలో మరణించిన కాంట్రాక్ట్‌ ఉద్యోగుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని జేఏసీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
తమకు ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) వర్తింపజేయాలని, రిక్వెస్ట్‌, పరస్పర (మ్యూచువల్‌) బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు. రాత్రి వేళల్లో విధులు నిర్వహించే స్టాఫ్‌ నర్సులకు తగిన భద్రత కల్పించడంతో పాటు, విధి నిర్వహణలో వారి గౌరవానికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్థికేతర అంశాలపై సానుకూల స్పందన

జేఏసీ ప్రతినిధుల విజ్ఞప్తులపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ చక్రధర్‌ బాబు, వైద్యారోగ్య శాఖ జాయింట్‌ సెక్రటరీ రోణంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఆర్థికేతర అంశాల పరిష్కారానికి శాఖాపరంగా అవసరమైన చర్యలను త్వరగా తీసుకుంటామని తెలిపారు.
రిక్వెస్ట్‌, మ్యూచువల్‌ బదిలీల అంశంపై అంతర్గత కమిటీతో చర్చించి ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు త్వరగా పంపేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాత్రి విధుల్లో స్టాఫ్‌ నర్సుల భద్రతతో పాటు, సిబ్బంది సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణంలో విధులు నిర్వహించేలా తగిన చర్యలు తీసుకుంటామని, ఎన్టీఆర్ వైద్య సేవ కింద జరిగే శాస్త్ర చికిత్సల్లో భాగస్వాములయే ఒప్పంద సిబ్బందికి పారితోషికాన్ని చెల్లించే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఆపరేషన్ థియేటర్లో విధులు నిర్వహించే వారికి ఉండాల్సిన వెసులుబాట్లపై కూడా దృష్టి పెడతామని చెప్పారు. ఉద్యోగాల క్రమబద్దీకరణ, తదితర ఆర్థికపరమైన డిమాండ్లపై ప్రభుత్వపరoగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు జేఏసీ ప్రతినిధులకు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *