-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఆక్వా ప్రాసెసింగ్ కేంద్రాల్లో నమూనాల సేకరణ
-జల కాలుష్య నియంత్రణపై అవగాహన కల్పించే దిశగా చర్యలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా ప్రాసెసింగ్ కేంద్రాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అక్కడి నీటి విడుదల వ్యవస్థల నుంచి నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపించారు. సేకరించిన నమూనాలను శాస్త్రీయంగా పరీక్షించి, కాలుష్య స్థాయిని అంచనా వేస్తారు. పరీక్షల ఫలితాల ఆధారంగా కాలుష్యానికి కారణమవుతున్న అంశాలను గుర్తించి, సంబంధిత యాజమాన్యాలకు నివారణ చర్యలపై సూచనలు చేయనున్నారు.
సోమవారం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, నెల్లూరు జిల్లాల పరిధిలోని ఆక్వా కేంద్రాల నుంచి నమూనాలు సేకరించారు. మంగళవారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలోని ఆక్వా కేంద్రాల్లో నమూనాలు తీసుకోనున్నారు. పీసీబీ అధికారులు ఆక్వా ప్రాసెసింగ్ కేంద్రాలలో వ్యర్ధాల నిర్వహణ విధానాలను కూడా పరిశీలించారు. నీటిలో నైట్రోజన్, ఫాస్ఫరస్, కరిగిన ఆక్సిజన్, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD), కెమికల్ ఆక్సిజన్ డిమాండ్(COD), ఘన వ్యర్థాల స్థాయిలు తదితర అంశాలను శాస్త్రీయంగా విశ్లేషించనున్నారు. ఆక్వా కాలుష్యం కారణంగా భూగర్భ జలాలతోపాటు నదులు, వాగులు, వంకలు వంటి సహజ నీటి వనరులు కలుషితమవుతున్న క్రమంలో, కాలుష్య కారకాలను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయా కేంద్రాల యాజమాన్యాలకు అవగాహన కల్పించనున్నారు. పర్యావరణ పరిరక్షణతోపాటు రాష్ట్రానికి ఆదాయ వనరుల్లో ఒకటిగా ఉన్న ఆక్వా రంగంలో స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా ఉప ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు.
Prajavartha Online Telugu News