-ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో నిర్వహణ
-పరిశుభ్రమైన జూ పరిసరాలు – ఆరోగ్యవంతమైన వన్యప్రాణులు లక్ష్యం
-జూలలో జంతువుల దత్తతకు ముందుకు రావాలని పవన్ కళ్యాణ్ పిలుపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల, విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం జూ అధికారులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జూ ప్రాంగణాలను మరింత పరిశుభ్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దడం, జంతువులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడం, సందర్శకులకు మెరుగైన అనుభూతిని అందించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశం కావాలని ఉప ముఖ్యమంత్రి సూచనలు చేశారు.
కార్యక్రమంలో భాగంగా జంతువుల ఆవాస ప్రాంతాలు, సందర్శకుల మార్గాలు, ఉద్యానవనాలు, నీటి వనరులు, విశ్రాంతి ప్రాంతాలు, ఆహార పంపిణీ కేంద్రాలు, వ్యర్థాల సేకరణ ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టారు. జూ పరిసరాల్లో వ్యర్థాల వర్గీకరణ, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, పచ్చదనం సంరక్షణ, పారిశుధ్య ప్రమాణాల మెరుగుదలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. జంతు ప్రదర్శనశాలలు కేవలం వినోద కేంద్రాలు మాత్రమే కాకుండా, వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ అవగాహనకు కేంద్ర బిందువులుగా నిలవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. క్రమం తప్పకుండా జూల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
విశాఖ జూలో అధునాతన ఇంక్యూబేషన్ పద్ధతిలో ఇటీవల 128 కొత్త జీవాలకు జన్మనిచ్చిన నేపథ్యంలో జీవ వైవిధ్య పరిరక్షణ చర్యలకు మద్దతుగా విశాఖతోపాటు తిరుపతి జూల్లో జంతువులను దత్తత తీసుకునేందుకు కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వన్యప్రాణుల సంరక్షణను ప్రతి పౌరుడు బాధ్యతగా స్వీకరించాలని కోరారు.
Prajavartha Online Telugu News