-మార్కాపురం జిల్లా అంతటా వెలి‘కొండంత’ సంబరం
-నల్లమల సాగర్‌కు నీటి విడుదలను వీక్షించేందుకు పోటెత్తిన ప్రజానీకం
-మగవారితో పోటీగా మహిళలు సైతం పెద్ద ఎత్తున రాక
-కార్యక్రమం ముగిసినా కాల్వకట్ట పైనే రైతులు, మహిళలు
-కృష్ణా నీళ్లను నెత్తిన చల్లుకుని, బాటిళ్లతో పట్టుకెళ్లిన జనం
యర్రగొండపాలెం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది… దశాబ్దాలుగా కలగా మిగిలిన కృష్ణా జలాలు నల్లమల సాగర్‌ను తాకిన క్షణం చరిత్రలో నిలిచిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ఫీడర్ కెనాల్ గేట్లు ఎత్తి నీటిని నల్లమల సాగర్‌కు విడుదల చేసిన ఆ తరుణం అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది. ఒకవైపు పరవళ్లు తొక్కుతూ పరుగులు తీసిన కృష్ణమ్మ.. మరోవైపు ఆ దృశ్యాన్ని చూసి భావోద్వేగానికి గురైన రైతాంగం. వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ అపూర్వ దృశ్యం ఆవిష్కృతమైంది.
హద్దుల్లేని ఆనందం… అవధుల్లేని భావోద్వేగం
గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయగానే అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నీటి ప్రవాహాన్ని చూసేందుకు తరలి వచ్చిన రైతులు, ప్రజలు కృష్ణమ్మను చూస్తూ ఆనందంతో ఈలలు వేశారు. కేరింతలు కొడుతూ తమ సంతోషాన్ని వ్యక్త పరిచారు. కొందరు తమ సెల్‌ఫోన్లలో ఆ అపురూప దృశ్యాలను చిత్రీకరించగా.. మరికొందరు నీటి ప్రవాహాన్ని కళ్లప్పగించి చూస్తూ భావోద్వేగానికి గురయ్యారు. వెలిగొండ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన తమకు ఇది సాధారణ నీటి విడుదల కాదని… తమ జీవితాల్లో ఒక మలుపు అని పేర్కొన్నారు. కరువు కష్టాలను చూసిన కళ్లే ఇప్పుడు కృష్ణా జలాల పరవళ్లను చూశాయి. తమ ప్రాంతానికి నీరు వస్తుందా? అనే ఎన్నో ఏళ్ల సందేహానికి తెరపడటంతో రైతుల కళ్లలో ఆనందబాష్పాలు కనిపించాయి. అంతేకాదు కృష్ణా నీళ్లను నెత్తిన చల్లుకుని, పుణ్య జలాలుగా భావించిన ఆ ప్రాంత ప్రజలు వాటిని బాలిళ్లలో నింపుకుని వెళ్లారు.
ఏళ్లుగా ఎదురు చూపు… కళ్ల ముందే ప్రవాహమై!
వెలిగొండ ప్రాజెక్టు కోసం సాగిన ఎదురుచూపులు, ఆశలు అన్నీ ఇన్నీ కావు. కాల్వగుండా నీరు విడుదల కాగానే ఈ రోజు కోసం… ఇన్నాళ్లు ఎదురు చూశాం అనే భావన ప్రతి ఒక్కరిలోనూ అక్కడ కనిపించింది. కృష్ణా జలాలు నల్లమల సాగర్‌లోకి పరుగులు తీస్తుండగా ఆ పరిసరాలు జన సందోహంతో కళకళలాడాయి. ఈలలు, కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య జల ప్రవాహాన్ని ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. రైతాంగానికి కొత్త ఆశలు చిగురించేలా కనిపించిన ఈ దృశ్యం… మార్కపురం జిల్లా ప్రజల మదిలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది. సాధారణంగా ఒక సభ ముగియగానే వచ్చిన జనం ఇంటి బాట పడతారు. కానీ వెలిగొండ సభకు వచ్చిన జనం మాత్రం అక్కడి నుంచి అయిష్టతగా వెనక్కి తిరిగారు. నీళ్లను చూస్తూ కొందరు మురిసిపోతూ ఉండిపోయారు.
Prajavartha Online Telugu News