-రామాయపట్నం పోర్టు వద్ద రూ.1.45 కోట్లతో ప్రాజెక్టు
-త్వరితగతిన ప్రాజెక్టు పనులు ప్రారంభించాలన్న సీఎం
-ముఖ్యమంత్రి చంద్రబాబుతో బీపీసీఎల్ ఎండీ సంజయ్ ఖన్నా భేటీ
-రిఫైనరీ సమీపంలో 1,500 ఎకరాల్లో పెట్రోకెమికల్స్ పార్క్ ఏర్పాటుకు సీఎం సూచన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రామాయపట్నం పోర్టు సమీపంలో భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ చేపట్టనున్న గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ ప్రాజెక్టు పనులు త్వరితగతిన ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రిఫైనరీ సమీపంలో పెట్రో కెమికల్ పార్కును కూడా ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు. భారత్ పెట్రోలియం కార్పోరేషన్ సీఎండీ సంజయ్ ఖన్నా ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. ప్రకాశం- నెల్లూరు జిల్లాల మధ్య ఏర్పాటు కానున్న బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.1.45 లక్షల కోట్లకు చేరిందని ఆయన ముఖ్యమంత్రికి తెలిపారు. ఏడాదికి 9 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతి సెప్టెంబరు చివరి నాటికి వచ్చే అవకాశం ఉందని బీపీసీఎల్ సీఎండీ సీఎంకు తెలిపారు. ఇంజినీరింగ్ ఇండియా లిమిటెడ్ చేపట్టిన అధ్యయన నివేదిక వచ్చిన వెంటనే ఈ ఏడాది అక్టోబరు నెలలోనే తుది పెట్టుబడి వ్యయం ఖరారు అవుతుందని వివరించారు. ఆ తదుపరి రిఫైనరీ నిర్మాణ పనుల్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
పెట్రో కెమికల్ పార్కు ఏర్పాటుపై సూచన
ప్రాజెక్టులో భాగంగా రిఫైనరీ నుంచి యూరో-6 ప్రమాణాలతో కూడిన ఇంధనం ఉత్పత్తి అవుతుందని బీపీసీఎల్ సీఎండీ ముఖ్యమంత్రికి వివరించారు. మోటార్ స్పిరిట్ , హైస్పీడ్ డీజిల్ , ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కలిపి సుమారు 5.4 మిలియన్ టన్నులు ఉత్పత్తి కానున్నట్టు తెలియచేశారు. ఇతర పెట్రోకెమికల్స్ ఉత్పత్తులు సుమారుగా 3.2 మిలియన్ టన్నులు ఉంటుందన్నారు. ఉప ఉత్పత్తులుగా హెచ్‌డీపీఈ, ఎల్‌డీపీఈ, ఎల్‌ఎల్‌డీపీఈ, పాలీప్రొపైలీన్, పాలీ వినైల్ క్లోరైడ్ వంటి బై ప్రోడక్ట్స్ కూడా వస్తాయని వివరించారు. బీపీసీఎల్ రిఫైనరీ నిర్మాణం కోసం అవసరమైన 6 వేల ఎకరాల భూమిలో 75 శాతాన్ని ఇప్పటికే అప్పగించామని ముఖ్యమంత్రి తెలిపారు. మిగిలిన భూమిని అక్టోబరు రెండో వారంలోగా అప్పగిస్తామన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్రియలను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు బీపీసీఎల్ ప్రతినిధులను కోరారు. రిఫైనరీ సమీపంలో సుమారు 1,500 ఎకరాల్లో డౌన్‌స్ట్రీమ్ పెట్రోకెమికల్స్ పార్క్ ఏర్పాటుకు బీపీసీఎల్, ఏపీఐఐసీ కలిసి ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులు
భారత్‌లో పట్టణీకరణ, తయారీ రంగం విస్తరణతో పెట్రోకెమికల్స్ కు డిమాండ్ వేగంగా మారుతోందని సీఎం వివరించారు. దేశ పెట్రోకెమికల్ ఇంటెన్సిటీ ఇండెక్స్ ప్రస్తుతం 5 శాతం నుంచి వచ్చే దశాబ్దంలో 15–20 శాతానికి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రిఫైనరీని నిర్మించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. ముడి చమురును కేవలం ఇంధనంగా వినియోగించకుండా ఇథిలీన్, ప్రొపైలీన్ వంటి రసాయన ముడి పదార్థాల ఉత్పత్తిని పెంచే విధంగా ఆధునిక రిఫైనరీల రూపకల్పన జరగాలని సీఎం సూచించారు. ప్రాథమిక పాలిమర్లకే పరిమితం కాకుండా అధునాతన మెటీరియల్ విభాగాల్లో పెరుగుతున్న డిమాండ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. దేశంలో కెమికల్, పెట్రోకెమికల్ రంగం 2040 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని, ఆ అవసరాలను తీర్చే దిశగా బీపీసీఎల్ పనిచేస్తుందని సీఎండీ సంజయ్ ఖన్నా తెలిపారు. సమావేశంలో బీపీసీఎల్ డైరెక్టర్ ఫైనాన్స్ వీఆర్‌కే గుప్తా, ఏపీ రిఫైనరీ ఈడీ రాజీవ్, జీఎం రిటైల్ టి.చతుర్వేది, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News