Breaking News

ధరలకు కళ్లెంతోనే ద్రవ్యోల్బణం కట్టడి

-మార్కెట్ ఇంటర్వెన్షన్‌తో ధరల నియంత్రణ
-హైరిస్క్ ఉద్యాన పంటల రక్షణకు రూ.190 కోట్లు
-వ్యవసాయం, అనుబంధ శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ముందస్తు అంచనాలతో పంటల సాగు, ఉత్పత్తి, మార్కెట్ నిర్వహణపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, అనుబంధ శాఖలపై ముఖ్యమంత్రి బుధవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ద్రవ్యోల్బణం పెరగడానికి గల కారణాలను అంచనా వేయాలని సీఎం సూచించారు. ఉత్పత్తి డిమాండ్ కు తగ్గట్టు ఉందా, సరఫరా పరిస్థితులను.. అనే అంశాలను విశ్లేషించుకుని దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ధరల నియంత్రణకు మార్కెట్ ఇంటర్వెన్షన్

ఎలాంటి చోట్ల, ఏయే పంటలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ అవసరమో గుర్తించాలని, ధరలు పెరగకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు వివిధ పంటలకు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలను రాష్ట్రంలో అమలు చేయడంతో పాటు, రైతులను ఆయా పంటలు సాగు చేసేలా ప్రొత్సహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ధరలను నియంత్రణ చేసేలా చూడాలన్నారు. అవసరమైతే రైతుల నుంచి బై బ్యాక్ ఒప్పందాలు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్, రైతు బజార్లు, రేషన్ డిపోల వంటి వ్యవస్థలను పూర్తి స్థాయిలో వినియోగించు కోవాలన్నారు. కనీస మద్దతు ధర ప్రకటిస్తే ఉత్పత్తులు ప్రభుత్వం చెంతకే చేరతాయని, తద్వారా ధరల నియంత్రణకు అవకాశం ఉంటుందన్నారు. “ప్రిడిక్షన్ చేశాక.. ప్రొడక్షన్‌కు వెళ్లాలి…ఆ మేరకు మార్కెట్ కూడా అంచనా వేసుకోవాలి.” అని సీఎం స్పష్టం చేశారు.

రైతు బజార్లు, రేషన్ డిపోల ద్వారా సరఫరా

రైతు బజార్లు, రేషన్ డిపోల ద్వారా దాదాపు 60 రకాల నిత్యావసర సరుకులు సరఫరా చేసేలా చూడాలని సీఎం సూచించారు. ఉల్లి, కంది పప్పు వంటి వాటిని త్వరలో రైతు బజార్లు, రేషన్ డిపోల ద్వారా అందించాలన్నారు. పామాయిల్ ను కూడా రేషన్ డిపోల ద్వారా సరఫరా చేయాలన్నారు. ఉల్లి, మిర్చి వంటి పంటలను ఎప్పుడూ పండించే ప్రాంతాల్లో కాకుండా.. ఇతర ప్రాంతాల్లో కూడా పండించే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల వారీగా ఏయే పంటలు పండిస్తున్నారో తెలుసుకోవాలని, ఉల్లి ఎంత అవసరం, ప్రస్తుతం ఎంత అందుబాటులో ఉందో అంచనా వేసుకోవాలని అన్నారు. ధరలు ఏ విధంగా పెరుగుతాయో ముందుగానే అంచనా వేసి, ప్రస్తుత మార్కెట్‌ను నియంత్రణ చేసుకుంటూ అవసరమైన పంటలు వేసేలా చూడాలని సూచించారు. రాయితీ విత్తనాలు, అవసరమైన యంత్ర పరికరాలు ఇచ్చి ఆ పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాల ని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా పశుగ్రాసం లేక పాల ఉత్పత్తి తగ్గిందనే మాట రాకూడదన్నారు. పశువుల దాణాకు ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు.

అంచనాల ఆధారంగా పంటల సాగు

రాష్ట్రంలో పంటల సాగు చేయని 8.61 లక్షల హెక్టార్లలో వర్షాధార పంటలు వేసేలా చూడాలని సీఎం ఆదేశించారు. చిరు ధాన్యాలు, రాగి, కొర్రలు, జొన్న, బాజ్రా వంటి పంటలను సాగు చేయించాలని, మొక్కజొన్న వేసేలా చూడాలని సూచించారు. ఉలవల సాగుపై కూడా దృష్టి పెట్టాలని అన్నారు. నేచురల్ ఫార్మింగ్‌ను ప్రోత్సహించాలన్నారు. ఏయే ప్రాంతాల్లో ఏయే పంటలు వేయవచ్చో గుర్తించి, ఆ మేరకు రైతులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో 3.61 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు హైరిస్క్‌లో ఉన్నాయని అధికారులు పేర్కొనగా, హైరిస్క్‌లో ఉన్న ఉద్యాన పంటలను రక్షించేందుకు లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ కోసం రూ.190 కోట్ల కేటాయిస్తున్నట్టు సీఎం తెలిపారు. ఈ నిధులను హైరిస్క్‌లో ఉన్న ఉద్యాన పంటలను రక్షించేందుకు అవసరమైన చర్యలకు వినియోగించాలని సూచించారు. ఇందులో భాగంగా వాటర్ ట్యాంకర్లను పంపించడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేం దుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రతి నెలా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుకు ISSCA గ్లోబల్ అవార్డు-2026 (ICRISAT Center of Excellence for South-South Cooperation in Agriculture) రావడంపై అధికారులను సీఎం అభినందించారు. ఈ సమీక్షలో మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *