-పి.బి. సిద్ధార్థలో హాక్ థాన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ సాంకేతిక యుగంలో విద్యార్థులు పరిష్కార నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, పరిష్కార దిశగా యువత ఆలోచనలు సాగాలని అమిగ్డా(బ్రిటన్) సంస్థ ప్రొడక్షన్ విభాగం జనరేటివ్ ఏఐ ఆర్ అండ్ డి డెవలపర్ చక్కా గుణశేఖర వెంకట చెంచయ్య అన్నారు. విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఏఐ, డేటా సైన్స్ విభాగాలు స్మార్ట్ ఇండియా పేరుతో నిర్వహించిన హ్యాకథాన్ ను వెబినార్ హాలులో బుధవారం ఆయన ప్రారంభిస్తూ నెట్ వర్క్ ఏర్పాటు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. డేటా బేస్, యజమాని మధ్య సాంకేతిక వ్యవస్థ అభివృద్ధి చేయడం ద్వారా వాణిజ్యరంగంలో పురోగతి సాధించవచ్చు అన్నారు. కె.ఎల్. డీమ్డ్ వర్సిటీ కంప్యూటర్ సైన్స్ ఆచార్యులు డా. చేబ్రోలు సూర్యకిరణ్ మాట్లాడుతూ హ్యాకథాన్ అనేది గెలుపునకు సంబంధించింది కాదని, సమస్య పరిష్కారమే దాని లక్ష్యమని, విద్యార్థులు సమస్యలను గుర్తించాలని, సాంకేతికతతో ఏ మేరకు పరిష్కారం సాధ్యమో ఆలోచన చేయాలన్నారు. వైస్ ప్రిన్సిపాల్ డా. ఎం. మనోరంజని, డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ ఆచార్య రాజేశ్ సి. జంపాల, ఏఐ, డేటా సైన్స్ విభాగాధిపతి డా. కె.ఉదయశ్రీ ముఖ్య అతిథులు గుణశేఖర్, సూర్యకిరణ్ లను సత్కరించారు.
హ్యాక్ థాన్ మొదటి బహుమతి: మతిమరపుతో సమయానికి ఆహారం, మందులు తీసుకోలేనివాళ్లకు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల వృద్ధులకు ఇంటర్నెట్ లేకపోయినా ఇంగ్లిష్, అస్సామీ, హిందీ భాషల్లో మొబైల్ సందేశాలు పంపే మొబైల్ యాప్ స్నేహసతి రూపొందించిన సిద్ధార్థ విద్యార్థి తూములూరి మోహన్ కృష్ణ నేతృత్వంలోని బీఎస్సీ డేటా ఎనలిటిక్స్ మూడో సంవత్సరం విద్యార్థి బృందానికి మొదటి బహుమతి లభించింది.
రెండవ బహుమతి : రైళ్ల రాకపోకల్లో ఆలస్యానికి కచ్చితమైన కారణం రాబట్టేందుకు రైల్వే డ్రైవరుకు డ్యాష్ బోర్డు ఏర్పాటుచేసి దాన్ని లాగిన్ అవ్వడం ద్వారా మొబైల్ యాప్ కి సమాచారం అందే డైనమిక్ ఫోర్ కాస్టింగ్ ఈటీఏ ఆవిష్కరణకుగాను బీఎస్సీ ఏఐ తృతీయ సంవత్సరం విద్యార్థి బృందానికి నాయకత్వం వహించిన ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ విద్యార్థిని యామిని ద్వితీయ బహుమతి గెలుచుకుంది.
మూడవ బహుమతి: సైబర్ మోసాల నేపథ్యంలో మానవ గొంతు, ఏఐ వాయిస్ ల మధ్య తేడాను గుర్తించే క్లోన్డ్ వాయిస్ డిటెక్షన్ సిస్టం ఆవిష్కరించిన డి. వెంకట్ సారథ్యంలోని ఎమ్మెస్సీ డేటా సైన్స్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి బృందం తృతీయ బహుమతి సాధించింది. ఒక్కో బృందంలో ఆరుగురు విద్యార్థుల చొప్పున మొత్తం 18 బృందాలు ఈ హాక్ థాన్ లో పాల్గొనగా, విజేతలుగా నిలిచిన మూడు టీంలకు నగదు బహుమతులు అందచేశారు.
Prajavartha Online Telugu News