Breaking News

అభివృద్ధి బాటలో అద్దంకి

-విద్యుత్ సబ్‌స్టేషన్, అగ్నిమాపక కేంద్రం
-హోం మంత్రితో క‌లిసి ప్రారంభించిన ఇంధ‌న‌శాఖ మంత్రి గొట్టిపాటి

అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంధ‌న‌శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ ప్ర‌కాశం జిల్లా అద్దంకి నియోజ‌వ‌ర్గం అభివృద్ధిలో దూసుకు పోతోంది. నియోజకవర్గ అభివృద్ధిలో గురువారం మరో కీల‌క‌ ముందడుగు పడింది. విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా అద్దంకి ఎన్ఎస్పీ కాల‌నీలో రూ.7.72 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ ఇండోర్ విద్యుత్ ఉపకేంద్రాన్ని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, హోం మంత్రి అనితలు ప్రారంభించారు. దీంతో అద్దంకితో పాటు పరిసర ప్రాంతాల్లో లో ఓల్టేజ్‌, విద్యుత్ అంతరాయాల సమస్యలు తగ్గడంతోపాటు వ్యవసాయానికి కూడా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తొలగుతాయని మంత్రి గొట్టిపాటి ఈ సంద‌ర్భంగా తెలిపారు. అదే విధంగా అద్దంకిలో రూ.2.25 కోట్లతో నిర్మించిన నూతన అగ్నిమాపక కేంద్రాన్ని, రూ.75 లక్షల విలువైన ఆధునిక అగ్నిమాపక వాహనాన్ని మంత్రులు ఇరువురూ ప్రారంభించారు. అద్దంకికి 2012లోనే అగ్నిమాపక కేంద్రం మంజూరైనప్పటికీ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అగ్నిమాప‌క కేంద్ర నిర్మాణం పూర్తయిందని మంత్రి గొట్టిపాటి స్ప‌ష్టం చేశారు. ఫైర్ డీజీ కూడా అడిగిన వెంట‌నే అగ్నిమాపక కేంద్రానికి రూ.2.25 కోట్ల నిధులు కేటాయించినట్లు ఆయ‌న‌ తెలిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.., అద్దంకి అగ్నిమాపక కేంద్రం సిబ్బంది ఇప్పటి వరకు సరైన సౌకర్యాలు లేకున్నా ప్రమాద సమయాల్లో అత్యున్నత సేవలు అందించారని మంత్రి గొట్టిపాటి కొనియాడారు. అగ్నిమాప‌క సిబ్బంది మార్కెట్ యార్డులో ఉంటూ, అగ్నిమాపక వాహనాన్ని రేకుల షెడ్‌లోనే ఉంచాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఈ సమస్యను హోం మంత్రి అనిత దృష్టికి తీసుకెళ్లిన వెంటనే కేవలం పది రోజుల్లోనే రూ.75 లక్షల విలువైన అగ్నిమాపక వాహనాన్ని కేటాయించారని చెప్పారు.

ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఎంతో క‌ష్ట‌ప‌డ్డాం…
హోం మంత్రి అనిత పనితీరును ఈ సందర్భంగా ఇంధ‌న‌శాఖ మంత్రి గొట్టిపాటి ప్రశంసించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ కోసం తామెంతో క‌ష్ట‌పడ్డామ‌ని ఆయ‌న‌ గుర్తు చేశారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు నిబద్ధతతో పనిచేసిన అనిత, ఎన్ని కేసులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా తెలుగుదేశం పార్టీ కోసం నిలబడ్డారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె సేవలను గుర్తించిన సీఎం చంద్రబాబు నాయుడు కీలకమైన హోం శాఖ బాధ్యతలు అప్పగించారన్నారు. ప్రతి రోజూ రాష్ట్రంలో అనేక ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ, వాటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ హోం మంత్రి అనిత సమర్థవంతంగా ముందుకు సాగుతున్నారని గొట్టిపాటి అభినందించారు. సమర్థవంతమైన వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగిస్తే ఎలా పని చేస్తారో అనిత పనితీరే నిదర్శనమన్నారు. అద్దంకి పర్యటనలో భాగంగా ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, హోం మంత్రి అనిత సింగరకొండలో వేంచేసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్య‌క్ర‌మంలో ప‌లువురు అధికారులు, కూట‌మి నేత‌లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *