-సీఎస్ఆర్ తో చేయూత అభినందనీయం
-దేశాన్ని ఆర్థిక శక్తిగా నిలిపింది ప్రధాని మోడీనే
-ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కక్ష సాధింపులు లేని నీతి, నిజాయితీ కలిగిన కూటమి పాలన సాగుతుందని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. శ్రీశైలంలో గురువారం పర్యటించిన మంత్రి గొట్టిపాటి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. బొండాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సున్నిపెంటలో సుమారు రూ.40 లక్షల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన బటర్ ఫ్లై సెంట్రల్ లైటింగ్ ను మంత్రి ప్రారంభించారు. అన్నీ ప్రభుత్వాలే చేయలేవన్న మంత్రి గొట్టిపాటి., వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు సీఎస్ఆర్ నిధులతో సమాజ సేవల భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ఉచిత రూఫ్ టాప్ సోలార్ యూనిట్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఆశీర్వాద దీపం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ., గుజరాత్ తరహాలో దేశాన్ని కూడా ప్రధాని మోడీ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ప్రధాని మోడీ సంస్కరణల ఫలితంగానే పీఎం సూర్యఘర్ ద్వారా అందరికీ సోలార్ సబ్సిడీ లభిస్తుందని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోడీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారం మరువలేనిదని ఆయన తెలిపారు. ఒక్కసారి అని అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. సంక్షేమం చేశానని చెప్పుకునే జగన్ కు., పేదల పెన్షన్ వెయ్యి రూపాయిలు పెంచడానికి ఐదేళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో సంవత్సరానికి రూ.33 వేల కోట్లకు పైగా పేదల పెన్షన్ కోసమే కూటమి ప్రభుత్వం వ్యయం చేస్తుందని గుర్తు చేశారు. డిఎస్సీ ద్వారా 16,000 ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీతో పాటు మహిళలకు ఉచిత బస్, గ్యాస్ సిలెండర్లు., వంటి పథకాలతో సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కూటమి లక్ష్యమన్నారు.
శ్రీశైలం నియోజకవర్గంలోనే 6 వేల ఉచిత పీఎం సూర్యఘర్ కనెక్షన్లు ఇచ్చామని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. త్వరలో బీసీలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.20,000 అదనపు సబ్సిడీతో రూఫ్ టాప్ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో సోలార్, విండ్, పీఎస్పీలకు మంచి అవకాశాలు ఉన్నందున ప్రభుత్వం ఆ దిశగా అనేక చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్డీఎస్ఎస్ ద్వారా వేలాది కోట్ల రూపాయిలతో విద్యుత్ మౌలిక వసతుల్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ఎల్ నినో ప్రభావంతో రోజువారీ విద్యుత్ వినియోగం 200 నుంచి 290 యూనిట్లకు చేరిందన్నారు. ఎల్ నినో పరిస్థితులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా, అసౌకర్యం కలుగకుండా ఉండటానికి అనేక చర్యలు చేపట్టామని వివరించారు. శ్రీశైలం, దోర్నాల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్న భూములకు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయమన్న స్థానిక ఎస్టీల వినతిపై మంత్రి గొట్టిపాటి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, నారాయణ రెడ్డి, అశోక్ రెడ్డితో పాటు పలువురు అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News