Breaking News

ఎల్‌ నినో ప్రభావంతో పెరిగిన విద్యుత్ డిమాండ్‌

-290 మిలియ‌న్ యూనిట్ల‌కు చేరిన వినియోగం
-ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు లేకుండా ప్ర‌త్యేక చ‌ర్య‌లు
-ఇంధ‌న‌శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని ఇంధ‌న‌శాఖ‌ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ అంత‌రాయాలు, ఇత‌ర‌ స‌మ‌స్య‌లు లేకుండా ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు లేకుండా అన్ని చ‌ర్య‌లూ చేప‌డుతున్నామ‌ని ఆయ‌న‌ పేర్కొన్నారు. దీనికి సంబంధించి గురువారం మంత్రి గొట్టిపాటి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. గతేడాది ఇదే సీజన్‌లో 200 మిలియన్ యూనిట్లుగా ఉన్న రోజువారీ విద్యుత్ వినియోగం ప్రస్తుతం 290 మిలియన్ యూనిట్లకు చేరింద‌ని వెల్ల‌డించారు. రాబోయే రోజుల్లో ఇది 300 మిలియ‌న్ యూనిట్ల‌కు చేరే అవ‌కాశం ఉంద‌ని అంచనా వేస్తున్న‌ట్లు తెలిపారు. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జ‌న‌రేషన్ కంపెనీల‌ను బ‌లోపేతం చేస్తూనే.., విద్యుత్ ఉత్పత్తిని పెంచుతున్నామని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. డిమాండ్‌, సరఫరా మధ్య కొంత గ్యాప్ ఉన్నప్పటికీ గృహ, వ్యవసాయ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పారిశ్రామిక అవ‌స‌రాల‌కు సంబంధించి కొంత ప‌వ‌ర్ రిలీఫ్ తీసుకునే అవ‌కాశం ఉంద‌న్నారు. అదే విధంగా వ్య‌వ‌సాయానికి కూడా ప‌గ‌టిపూటే 9 గంట‌లు విద్యుత్ అందిస్తామ‌ని పేర్కొన్నారు.

ఆర్డీఎస్ఎస్ ద్వారా రూ.10 వేల కోట్ల‌తో విద్యుత్ మౌలిక వ‌స‌తుల‌ను బ‌లోపేతం చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. అన్ని విద్యుత్ స‌మ‌స్య‌ల‌ను త్వ‌ర‌లోనే అధిగ‌మిస్తామ‌ని ఆశాభ‌వం వ్య‌క్తం చేశారు. వర్షాభావంతో హైడల్ విద్యుత్ అందుబాటులో లేద‌ని తెలిపారు. వాతావరణ పరిస్థితుల కారణంగా విండ్ పవర్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రస్తుతం థర్మల్ విద్యుత్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నామని మంత్రి వెల్ల‌డించారు. పగటిపూట సోలార్ విద్యుత్‌ను గరిష్ఠంగా వినియోగించుకుంటూ, సాయంత్రం 7 నుంచి రాత్రి 11 గంటల పీక్ అవర్స్‌లో డిమాండ్‌ను అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. దీనికి సంబంధించి బ్యాట‌రీ స్టోరేజ్ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌త్యేక దృష్టి కేంద్రీక‌రించామ‌ని పేర్కొన్నారు. పీఎం సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కం ద్వారా సొంత విద్యుత్ త‌యారు చేసుకునే వెసులుబాటు ఉండ‌టంతో సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కాన్ని మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తున్నామ‌ని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి, ప్రసార వ్యవస్థలను బలోపేతం చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. 15 రోజుల అవసరాలకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంచుతున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యుత్ వినియోగం మ‌రింత పెరిగే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి స్ప‌ష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *