Breaking News

సెర్ప్ ద్వారా ఎస్‌హెచ్‌జీ మహిళలకు భరోసా

– డ్వాక్రా మహిళల ఆర్థిక పురోగతి, జీవనోపాధుల విస్తరణే లక్ష్యం
– బ్యాంకు రుణాలు, బీమా రక్షణపై మంత్రి కొండ‌ప‌ల్లి స‌మీక్ష‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల (SHG) మహిళల ఆర్థిక సాధికారత, జీవనోపాధి అవకాశాల విస్తరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. విజయవాడలోని ఎన్‌టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) కార్యాలయంలో గురువారం సెర్ప్ సీఈవో వాకాటి కరుణ, సెర్ప్ డైరెక్టర్లతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై సమగ్ర సమీక్ష‌ నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 1,02,009 ఎస్‌హెచ్‌జీ సంఘాలకు రూ.15,054 కోట్ల బ్యాంకు రుణాలు అందించినట్లు అధికారులు మంత్రికి సూచించ‌గా… నిర్దేశించుకున్న రూ.36,000 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేలా బ్యాంకర్లతో సమన్వయం పెంచాలని మంత్రి ఆదేశించారు. స్త్రీనిధి ద్వారా 4.73 లక్షల మంది మహిళలకు రూ.4,800 కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. బ్యాంకులు మంజూరు చేసే క్యాష్ క్రెడిట్ రుణాలపై ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, ఇన్‌స్పెక్షన్ ఛార్జీల మినహాయింపు నిబంధనలపై మహిళలకు అవగాహన కల్పించాలని… గ్రామీణ సభలు, సమాఖ్యల నెలవారీ సమావేశాల అజెండాలో ఈ అంశాన్ని చేర్చాలని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. ప్రతి ఎస్‌హెచ్‌జీ మహిళకు ‘ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన’ (PMJJBY), ‘ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన’ (PMSBY) పథకాల కింద బీమా రక్షణ కల్పించాల‌ని.. జిల్లా సమాఖ్యల ఇన్సూరెన్స్ కాల్ సెంటర్ల ద్వారా క్లెయిమ్‌ల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌హెచ్‌జీ మహిళలు తయారు చేసే 65 రకాల ఉత్పత్తులను విక్రయించడానికి 4 స్వయం (SWAYAM) బ్రాండ్ సిగ్నేచర్ స్టోర్ల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM) కింద రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఆధునిక లాండ్రీ, బ్యూటీ పార్లర్, హెయిర్ కటింగ్ వంటి వృత్తి నైపుణ్యాలలో మహిళలకు, చేతివృత్తిదారులకు శిక్షణ ఇస్తామ‌ని మంత్రి తెలిపారు. ఎఫ్‌పీఓల ఆధ్వర్యంలో నడిచే కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా తక్కువ అద్దెకే రైతులకు యంత్ర పరికరాలు అందుబాటులో ఉంచి, సాగు ఖర్చులు తగ్గించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంత మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది, వారి కుటుంబాలకు స్థిరమైన ఆదాయం అందించేలా సెర్ప్ అధికారులు నిరంతరం శ్రమించాలని మంత్రి కొండ‌ప‌ల్లి పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *