Breaking News

దేశ ప్రయోజనాల కోసం మోదీకి అండగా నిలవాలి

-ఎన్డీయే ఐక్యతే దేశానికి బలం
-మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి అన్ స్టాపబుల్
-VKS… ఇదే భారత్ అభివృద్ధి మంత్రం
-అయోధ్య రామమందిర నిర్మాణ కలను మోదీ నిజం చేశారు
-దేశంలో నదుల అనుసంధానం ప్రధాని మోదీతోనే సాధ్యం
-వామపక్ష తీవ్రవాదాన్ని అంతమొందించారు… ఆపరేషన్ సింధూర్ తో భారత్ సత్తా చాటారు
-యూపీ ప్రభుత్వం అనుమతిస్తే అయోధ్యలో శ్రీవారి ఆలయ నిర్మాణం
-వారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి
-ముఖ్యమంత్రి ప్రసంగానికి రక్షణ మంత్రి ఫిదా… వెరీ వెల్ అంటూ ప్రశంసలు
-సీఎం చంద్రబాబు ప్రసంగంతో చప్పట్లతో మార్మోగిన వారణాసిలోని రుద్రాక్ష్‌ కన్వెన్షన్‌ సెంటర్‌
-శ్రీ కాశీ విశ్వనాధుని ఆలయంలో కేంద్ర మంత్రులు, యూపీ సీఎంతో కలిసి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు

వారణాసి, నేటి పత్రిక ప్రజావార్త :
‘‘రైట్‌ టైమ్‌.. రైట్‌ లీడర్‌ నరేంద్ర మోదీ. దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాదు.. దేశ ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీకి అండగా నిలవాలి. ఎన్డీఏ ఐక్యతే దేశానికి బలం’’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని, ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని వారణాసిలో నిర్వహించిన వారణాసి-వాద్నగర్‌ సేవా సంకల్ప్‌ అభియాన్‌ కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాశీ-వాద్నగర్‌ సేవా యాత్రలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ప్రగతిని, సంక్షేమం నుంచి సాంకేతికత వరకు చోటుచేసుకున్న మార్పులను ఆయన వివరించారు. అలాగే మోదీ నాయకత్వంలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతోందనే విషయాన్ని చెప్పారు. ఇక ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నటికీ మరువలేమని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”కాశీ క్షేత్రం ప్రధాని నరేంద్ర మోదీ కర్మ భూమి. కాశీ పుణ్యక్షేత్రం నుంచి నరేంద్ర మోదీ మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక్కడి ప్రజలు వారణాసికి నేతను ఎన్నుకోవడమే కాదు… దేశానికి ఓ లీడర్‌ను అందించారు. ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరుస్తున్నారు. VKS అనేది అభివృద్ధి మంత్రం… ఈ మంత్రంతో దేశం అభివృద్ధి చెందుతోంది. V అంటే వాద్నగర్, K అంటే కాశీ, S అంటే సెప్టెంబర్. ప్రజలకు సేవ చేస్తే.. దేశానికి సేవ చేయడమేనని ప్రధాని నరేంద్ర మోదీ నమ్ముతారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందుతున్నాయి. జేజేఎం, అమృత్ వంటి పథకాల ద్వారా 4 కోట్ల ఇళ్లకు తాగునీటి సౌకర్యం కల్పించారు. తాగునీటి కోసం ఎవ్వరూ ఇబ్బంది పడకూడదనేది ప్రధాని కల. ఇవి కేవలం అంకెలు మాత్రమే కాదు… ఈ అంకెలు వెనుక పేద, మధ్య తరగతి కుటుంబాల అభివృద్ధి-సంక్షేమం ఉంది. పీఎం కిసాన్ కింద 11 కోట్ల మంది రైతులు లబ్ది పొందుతున్నారు… ఇందులో ఎలాంటి మధ్యవర్తులు లేరు. నేరుగా రైతుల ఖాతాలకే నగుదును జమ చేస్తున్నారు.”అని ముఖ్యమంత్రి అన్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ తో 140 కోట్ల ప్రజలను కాపాడారు

“ప్రపంచంలోని వివిధ దేశాలు సంక్షోభంలో కూరుకుపోతున్న సందర్భంలో నరేంద్ర మోదీ దేశానికి మంచి నాయకత్వం అందించారు. 140 కోట్ల మంది భారతీయులను కాపాడారు… వారికి ఇబ్బందులు కలగకుండా చేశారు. 200 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేసేలా ప్రొత్సహించిన ప్రధాని నరేంద్ర మోదీ కరోనా బారి నుంచి ప్రజలను కాపాడారు. 101 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్లను ఉచితంగా సరఫరా చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. విశ్వ మానవాళి సంక్షేమం కోసం డబ్బులు గురించి ఎలాంటి ఆలోచన చేయకుండా కోవిడ్ వ్యాక్సిన్లను నరేంద్ర మోదీ ఉచితంగా వివిధ దేశాలకు అందించారు. ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ గ్లోబల్ ఇలాంటి విధానాలతో మేకిన్ ఇండియా కాన్సెప్ట్ బలోపేతం అయ్యేలా చేశారు. గతంలో డిఫెన్స్ పరికరాలను దిగుమతి చేసుకునేవాళ్లం.. కానీ ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి చేరాం. టెక్నాలజీని పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్న ఏకైక ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే. స్పేస్, డ్రోన్, క్వాంటం, సెమీ కండెక్టర్ టెక్నాలజీస్ వంటి వాటితో పాటు… రోబోటిక్స్ వంటి వాటిని ప్రధాని మోదీ అర్థం చేసుకోగలరు.. వాటి వల్ల యువతకు లబ్ది చేకూర్చగలరు. గతంలో యువత ఉద్యోగాల మీద ఆధారపడేవాళ్లు. కానీ ప్రధాని దూరదృష్టితో 2.20 లక్షల స్టార్టప్ ల ద్వారా యువతే ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకున్నారు. ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి యువత చేరారంటే దానికి ప్రధాని నరేంద్ర మోదీనే కారణం. అద్భుతమైన స్టార్టప్ ఎకో సిస్టం కలిగిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. మహిళా సంక్షేమం, సాధికారత కోసం ప్రధాని చేస్తున్న కృషి అపూర్వం.. భేటీ బచావో-భేటీ పడావో, లక్పతీ దీదీ వంటి పథకాలే దీనికి నిదర్శనం. ఉజ్వల పథకం క్లీన్ ఫ్యూయల్ అందిస్తుంది.. ముద్ర పథకం పెట్టుబడి సమకూరుస్తుంది.. స్వయం సహయక సంఘాలు నమ్మకాన్ని పెంచుతున్నాయి. నారీ శక్తి అధినియం ద్వారా చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లు ఇవ్వబోతున్నారు.. ఇది గేమ్ ఛేంజర్ కాబోతోంది.”అని సీఎం చంద్రబాబు చెప్పారు.

తిరుగులేని శక్తిగా భారత్

“ప్రపంచం ముందు భారత్ ను తిరుగులేని శక్తిగా నిలబెడడానికి కారణం ప్రధాని మోదీ. ఇటీవలే బ్రిక్స్ సదస్సును కూడా సమర్థవంతంగా నిర్వహించారు. వివిధ దేశాల అధినేతలు మన ప్రధాని నాయకత్వంపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఎవరైనా దేశంపై దాడి చేయాలంటే భయపడేలా చేశారు… ఆపరేషన్ సింధూర్ ద్వారా ధీటైన జవాబుతో భారత్ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ను నిర్వహించిన రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్‌ను అభినందిస్తున్నాను. నేను కూడా వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొన్నాను.. నన్ను నక్సలైట్లు టార్గెట్ చేశారు… వారికి నేనూ బాధితుణ్ణే. కానీ ఇప్పుడు దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని రూపుమాపారు… దటీజ్ నరేంద్ర మోదీ. దేశం మొత్తానికి ఒకే పవర్ గ్రిడ్ ఏర్పాటు చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదే. దేశంలో కనెక్టివిటీ పెంచారు. భిన్న సంస్కృతులు, భిన్న భాషలు దేశంలో ఉన్నాయి.. కానీ దేశాభివృద్ధి, ఆత్మనిర్భరత అనేదే మన లక్ష్యం. సుస్థిరత వల్లే ఇది సాధ్యమవుతుంది. సుస్థిరత వల్ల నమ్మకం పెరుగుతుంది.. నమ్మకం వల్ల పెట్టుబడులు వస్తాయి.. పెట్టుబడులు వల్ల ఉద్యోగాలు సమకూరుతాయి.. అభివృద్ధి జరుగుతుంది. ఉద్యోగాల వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. వందే భారత్ రైళ్లను ప్రారంభించారు.. బుల్లెట్ ట్రైన్లు రాబోతున్నాయి. నదుల అనుసంధానం మాత్రమే ఇంకా పెండింగులో ఉంది… ఈ నదుల అనుసంధానం ప్రధాని నరేంద్ర మోదీ ద్వారానే సాధ్యమవుతుంది. బ్రహ్మపుత్ర, గంగ, మహానది, కావేరి, గోదావరి నదులను అనుసంసంధానం చేస్తే భారత్ అన్ స్టాపబుల్. 25 ఏళ్ల పాటు కంటిన్యూగా పాలనలో ఉండడం మామూలు విషయం కాదు. దేశంలో.. ప్రపంచంలో కూడా ఈ విధంగా రాజ్యాంగ పదవిలో ఉండడం సాధ్యం కాదు. ప్రధాని నరేంద్ర మోదీ సమాజాన్ని చదివారు… చాలా నేర్చుకున్నారు… దానికి అనుగుణంగా పాలన చేపట్టారు. 2003లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా నరేంద్ర మోదీ వైబ్రంట్ గుజరాత్ అనే కార్యక్రమం నిర్వహించారు.. ఇప్పుడది గ్లోబల్ బ్రాండ్ గా మారింది. నరేంద్ర మోదీ సారధ్యంలో అభివృద్ధి పట్టణాలకే కాదు… గ్రామీణ ప్రాంతాలకు చేరింది. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్.. సబ్ కా ప్రయాస్ ఇదే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం.”అని ముఖ్యమంత్రి అన్నారు.

త్రేతాయుగం…. కలియుగం…

“కోట్లాది భక్తులు మహా కుంభమేళాకు వారణాసి వచ్చారు. మహా కుంభమేళాను యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ అద్భుతంగా నిర్వహించారు. సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని పూర్తి చేశారు. కలగా ఉండే రామ మందిర నిర్మాణాన్ని నరేంద్ర మోదీ నిజం చేశారు. త్రేతాయుగ దైవమైన శ్రీరాముని జన్మస్థలం అయోధ్యలో కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని భావిస్తున్నాం. వెంకన్న ఆలయ నిర్మాణానికి 10 ఎకరాలు కేటాయించాలి.”అని సీఎం చంద్రబాబు యూపీ ముఖ్యమంత్రిని కోరారు.

సభికులను ఇన్‌వాల్వ్‌ చేస్తూ సాగిన చంద్రబాబు ప్రసంగం

సీఎం చంద్రబాబు హిందీలో తన ప్రసంగాన్ని ప్రారంభించడంతో సభికుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రసంగం మొత్తం సభికులను ఇన్‌వాల్వ్‌ చేస్తూ సాగడంతో పలుమార్లు పెద్ద ఎత్తున చప్పట్లు, హర్షధ్వానాలు వినిపించాయి. రామజన్మభూమి నుంచి ఆపరేషన్‌ సింధూర్‌ వరకు వివిధ అంశాలను ప్రస్తావిస్తూ, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ప్రగతితో పాటు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అందిస్తున్న సహకారాన్ని కూడా ఆయన వివరించారు. ఆజ్ మే కాశీకే పవిత్ర ధర్తీ పర్ ఖడా హూ… యే మేరేలియే గర్వ్ కా క్షణ్ హై అంటూ సీఎం చంద్రబాబు హిందీలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇక ప్రసంగం మధ్య మధ్యన దేశ్ బదల్ రహా హై, దేశ్ ఆగే బఢ్ రహా హై, నయా భారత్ హై…. ఆత్మ నిర్భర్ భారత్ హై అంటూ వ్యాఖ్యానించారు. చివరిలో ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్, వికసిత్ భారత్… యహీ హమారా సంకల్ప్ హై అంటూ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. ముఖ్యమంత్రి ప్రసంగానికి సభికుల నుంచి అతిథుల నుంచి ప్రశంసలు లభించాయి. తన ప్రసంగం ప్రారంభానికి ముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చంద్రబాబును ప్రత్యేకంగా అభినందించారు. చంద్రబాబు చాలా అద్భుతంగా మాట్లాడారు… వెరీ వెల్‌.. వెరీ వెల్‌ అంటూ ప్రశంసించారు. చంద్రబాబు ప్రసంగానికి చప్పట్లతో అభినందనలు తెలపాలని సభికులను కోరారు. దీంతో రుద్రాక్ష్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ హర్షధ్వానాలతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేంద్రమంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తన కుటుంబానికున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన తండ్రి, దివంగత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌కు చంద్రబాబు అత్యంత సన్నిహితుడని, తన తండ్రి కష్టసుఖాల్లో ఆయనకు అండగా నిలిచారని గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

ప్రత్యేక పూజలు…

వారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కాశీ విశ్వనాథుడిని కేంద్ర మంత్రులు రాజ్ నాధ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవిత్ర జలాలతో కాశీ విశ్వేశ్వరుణ్ణి అభిషేకించారు. కాశీ విశ్వనాధుని ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి తీర్ధ ప్రసాదాలు అందించారు. అలాగే వారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ యాత్ర చేపడుతున్న వారికి కేంద్ర మంత్రులు, యూపీ సీఎంతో కలిసి ప్రసాదాన్ని పంచి పెట్టారు. సభ అనంతరం సేవా సంకల్ప్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *