-ఈ వారంలోనే రాయితీపై ఉల్లి ప్రజలకు అందజేస్తాం
-ఆశీర్వాద కా దియా కార్యక్రమంలో దీపాలు వెలిగించి ప్రధాని నరేంద్ర మోడీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖామాత్యులు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
140 కోట్ల భారతీయులకు ఆహార భద్రతను అందించిన గొప్ప దార్శనిక నేత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మాత్యులు, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. గతంలో రాయితీపై అందించే ఆహార ధాన్యాలను పూర్తిగా ఉచితంగా దేశ ప్రజలకు అందించిన ఘనత మోడీ కి దక్కుతుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని ‘ఆశీర్వాద్ క దియా’ కార్యక్రమంలో భాగంగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన రావు తో కలిసి విజయవాడలోని లక్ష్మీపతి నగర్ లో ఉన్న దినసరి కూలి నూకరాజు అనే సామాన్యుడి ఇంటి ఆవరణలో దీపాలు వెలిగించి ప్రధాని నరేంద్ర మోడీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం మీడియాతో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో మోదీ జన్మదిన కార్యక్రమాలను పురస్కరించుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రమంతటా ప్రజలు దీపాలు వెలిగించేలా, మోడీ కి ప్రజలంతా శుభాకాంక్షలు తెలియజేసేలా ఈ ఏర్పాట్లు చేశాం. మోదీ లాంటి గొప్ప నాయకుడు భారతదేశానికి అవసరం. భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకు వెళ్తున్న మోడీ లాంటి నాయకుడికి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రజలంతా ఐక్యంగా దీపాలు వెలిగించి శుభాకాంక్షలు తెలియజేయడం గొప్ప విషయం.
కేంద్ర సహకారంతో రాష్ట్రం ముందడుగు
రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పౌరసరఫరాల శాఖ సత్వర సేవలను అందిస్తోంది. ధాన్యం పండించిన రైతులకు వారి ఖాతాలో 24 గంటల్లోనే డబ్బు జమ చేస్తున్నాం. ప్రజా పంపిణీలో అందించే బియ్యంలో గతంలో 25 శాతం మేర ఉండే నూకలు ఉండేవి. దానిని రాష్ట్రవ్యాప్తంగా 10 శాతానికి తీసుకోవచ్చాం. దీనిని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడం ఆనందం గా ఉంది. ఇలాంటి మరెన్నో వినూత్నమైన, విప్లవాత్మకమైన కార్యక్రమాలను పౌరసరఫరాల శాఖ ద్వారా రాబోయే రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని కింద ప్రజల్లోకి తీసుకువెళ్తాం.
ఈ వారంలోనే రాయితీ ఉల్లి
నిత్యావసరాల ధరలు పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ఈ వారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా రాయితీ ఉల్లి అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి వెంటనే ఉల్లి తక్కువ ధరలకే ప్రజలకు అందించే ఏర్పాట్లు చేస్తాం. వీటితోపాటు త్వరలోనే పామాయిల్, కందిపప్పు కూడా రాయితీ ధరలపై ప్రజలకు అందించేలా చూస్తాం. కీలక సమయంలో తక్కువ ధరలకే ప్రజలకు నిత్యవసరాలు అందించే విషయంలో కేంద్ర సహకారం ఎనలేనిది. ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రధాని మోడీ కి రాష్ట్ర ప్రజల తరఫున మరోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాం” అన్నారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్, వీర మహిళ విభాగం రీజినల్ కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News