-అధికారులకు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సూచనలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్, ప్రధాన సమాచార కమిషనర్ వజ్జ శ్రీనివాసరావు మరియు రాష్ట్ర సమాచార కమిషనర్ గాజుల ఆదెన్న సమక్షంలో బి. గోపాల్, కదరంపల్లి, కుందుర్పి, అనంతపురం జిల్లా వారు దాఖలు చేసిన S.A. No.1639 of 2023 మరియు అనుబంధంగా ఉన్న మొత్తం 102 ఆర్టీఐ అప్పీల్ కేసులను బ్యాచ్ కేసులుగా విచారించి తుది ఉత్తర్వులు జారీ చేసింది.
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కదరంపల్లి కి చెందిన బి. గోపాల్ అనే ఆర్టీఐ అర్జీదారుడు ఎటువంటి సామాజిక ప్రయోజనం లేకుండా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం సమాచారహక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకుని వివిధ శాఖల పీఐఓ అధికారులపై ఏపీ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ లో వేసిన 102 అప్పీళ్లను ఒకే బ్యాచ్ కేసులుగా విచారించి అన్ని అప్పీళ్లను కొట్టివేస్తూ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వజ్జ శ్రీనివాసరావు, రాష్ట్ర సమాచార కమిషనర్ గాజుల ఆదెన్న లు ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ పాస్ చేశారు. భవిష్యత్తులో బి. గోపాల్ వ్యక్తిగత ప్రయోజనాలతో వేసే సమాచార హక్కు ధరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవద్దని కూడా అధికారులకు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సూచనలు జారీ చేశారు.
వివరాల్లో కెళితే అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కదరంపల్లి కి చెందిన బి. గోపాల్ అనే ఆర్టీఐ అర్జీదారుడు సమాచార హక్కు చట్టం, 2005లోని సెక్షన్ 6(1) కింద వివిధ పౌర సమాచార అధికారులకు అనేక దరఖాస్తులు సమర్పించారు. వాటిపై మొదటి అప్పీళ్లను దాఖలు చేసి, అనంతరం రెండవ అప్పీళ్లు/ఫిర్యాదులను కమిషన్ ముందు దాఖలు చేశారు.
ఈ కేసులను 20-08-2026, 09-09-2026 మరియు 15-09-2026 తేదీలలో విచారణకు తీసుకున్నారు. విచారణ తేదీలలో అప్పీలుదారు హాజరు కాలేదు. సంబంధిత పౌర సమాచార అధికారులు మరియు మొదటి అప్పీళ్ల అధికారులు విచారణకు హాజరై తమ వాదనలు వినిపించారు.
విచారణ సందర్భంగా, అప్పీలుదారు అనేక సంఖ్యలో సమాచార హక్కు దరఖాస్తులు, మొదటి అప్పీళ్లు మరియు రెండవ అప్పీళ్లు దాఖలు చేసినట్లు అధికారులు కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. అప్పీలుదారు స్వయంగా సమర్పించిన అఫిడవిట్‌లో కూడా తాను దాఖలు చేసిన రెండవ అప్పీళ్ల సంఖ్య వేలల్లో ఉన్నట్లు పేర్కొన్న విషయాన్ని కమిషన్ గమనించింది.
15-09-2026న జరిగిన విచారణ సందర్భంగా కుందుర్పి డిప్యూటీ తహసీల్దార్, అప్పీలుదారు 2002 సంవత్సరం నుండి ప్రస్తుత సంవత్సరం వరకు దాఖలు చేసిన 300కు పైగా సమాచార హక్కు దరఖాస్తుల పూర్తి సెట్‌ను కమిషన్ ముందు సమర్పించారు. దీని ద్వారా అప్పీలుదారు అనేక సంవత్సరాలుగా పెద్ద సంఖ్యలో, పునరావృతంగా సమాచార హక్కు దరఖాస్తులు సమర్పిస్తున్న విషయం కమిషన్ గమనించింది.
అప్పీలుదారు గతంలో దాఖలు చేసిన దరఖాస్తులు మరియు అప్పీళ్లకు సమాచారం అందించారా అని కమిషన్ ప్రశ్నించగా, సంబంధిత పౌర సమాచార అధికారులు సాధారణంగా రికార్డుల ప్రకారం సమాచారం అందించినట్లు తెలిపారు. అయినప్పటికీ, గతంలో సమాధానాలు అందిన అంశాలపైనే అప్పీలుదారు మళ్లీ మళ్లీ దరఖాస్తులు దాఖలు చేసి, అనంతరం వరుసగా అప్పీళ్లను కొనసాగిస్తున్నట్లు కమిషన్ గమనించింది.
అప్పీలుదారు పొందిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ప్రజా ప్రయోజనం కోసం ఏదైనా ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలు చేశారా అని కమిషన్ ప్రశ్నించగా, అలాంటి PIL దాఖలు చేయలేదని అధికారులు తెలిపారు. అలాగే, రైతుల వ్యక్తిగత వివరాలు, ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని కోరుతూ సమాచార హక్కు దరఖాస్తులు దాఖలు చేసి, రైతుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు కూడా అధికారులు ఆరోపణలు చేసిన విషయాన్ని కమిషన్ నమోదు చేసింది.
అప్పీలుదారు దాఖలు చేసిన అనేక RTI దరఖాస్తుల్లో రోజువారీ పత్రికల్లో వచ్చిన వార్తలకు సంబంధించిన ఫిర్యాదులపై Action Taken Reports కోరినట్లు కమిషన్ గమనించింది. అనేక సందర్భాల్లో మూడవ వ్యక్తుల ఫిర్యాదులు మరియు వారి సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని కోరినట్లు కూడా పరిశీలించింది.
అప్పీలుదారు తన దరఖాస్తుల్లో తనను *“Ex-President of the RTI Committee”*గా పేర్కొన్నట్లు కమిషన్ గమనించింది. అయితే, సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరే హక్కు ప్రతి పౌరుడికి వ్యక్తిగతంగా కల్పించబడిన హక్కు. ఏదైనా సంఘం లేదా కమిటీకి అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు లేదా ఇతర హోదాలో ఉన్నానని పేర్కొనడం ద్వారా ఆ దరఖాస్తుకు చట్టపరంగా ప్రత్యేక హోదా లేదా ప్రాధాన్యత లభించదని కమిషన్ స్పష్టం చేసింది.
సమాచార హక్కు చట్టం పరిధి
కమిషన్ ప్రధానంగా పరిశీలించిన అంశం ఏమిటంటే, ఒక వ్యక్తి వందలాది సంఖ్యలో ప్రశ్నలు, ప్రశ్నావళి తరహా అంశాలతో RTI దరఖాస్తులు దాఖలు చేసి, వాటన్నింటికీ పౌర సమాచార అధికారి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉందా అని కమిషన్ పేర్కొంది . సమాచార హక్కు చట్టం ప్రజా అధికార సంస్థ వద్ద ఇప్పటికే ఉన్న లేదా దాని ఆధీనంలో ఉన్న సమాచారాన్ని పొందే హక్కును కల్పిస్తుంది. అయితే, పౌర సమాచార అధికారి కొత్త సమాచారాన్ని సృష్టించడం, వివిధ రికార్డుల నుండి సమాచారాన్ని విస్తృతంగా సేకరించి కొత్త రూపంలో తయారు చేయడం, విశ్లేషణ చేయడం, ఊహాత్మక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదా అపరిమిత ప్రశ్నావళికి సమాధానాలు ఇవ్వడం వంటి బాధ్యత ఆర్టీఐ చట్టం వహించదని కమిషన్ స్పష్టం చేసింది.
అయితే, దరఖాస్తులు పెద్ద సంఖ్యలో ఉన్నాయనే కారణంతో ఒక పౌరుడి సమాచార హక్కు చట్టబద్ధమైన హక్కు పూర్తిగా రద్దు అవుతుందని కూడా కమిషన్ పేర్కొనలేదు.
కమిషన్ వివిధ న్యాయస్థానాలు మరియు కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన పలు తీర్పులను పరిశీలించింది. Public Information Officer, Registrar (Administration) v. B. Bharathi, Shail Sahni v. Valsa Sara Mathew, ICAI v. Shaunak H. Satya, CBSE v. Aditya Bandopadhyay తదితర తీర్పుల్లో సమాచార హక్కు చట్టాన్ని ప్రజా సంస్థలపై అనవసరమైన భారంగా మార్చడం, పునరావృతమైన మరియు విస్తృతమైన సమాచార అభ్యర్థనల ద్వారా పరిపాలనా వనరులను అసమానంగా వినియోగించడం వంటి అంశాలపై న్యాయస్థానాలు చేసిన పరిశీలనలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది.
సుప్రీంకోర్టు CBSE v. Aditya Bandopadhyay కేసులో, ప్రజా అధికార సంస్థ వద్ద ఉన్న మరియు అందుబాటులో ఉన్న సమాచారాన్ని పొందే హక్కు RTI చట్టం కల్పిస్తుందని, అయితే రికార్డులో లేని సమాచారాన్ని కొత్తగా సేకరించి లేదా రూపొందించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రజా అధికార సంస్థపై లేదని స్పష్టం చేసిన విషయాన్ని కమిషన్ ప్రస్తావించింది.
అలాగే, Dr. Celsa Pinto v. Goa State Information Commission కేసులో బాంబే హైకోర్టు, ఒక చర్య ఎందుకు జరిగింది లేదా ఎందుకు జరగలేదు అనే దానికి కారణాలు లేదా సమర్థనలు కోరడం, సాధారణంగా RTI చట్టంలోని “information” పరిధిలోకి రాదని పేర్కొన్న విషయాన్ని కమిషన్ పరిగణించింది.
కమిషన్ పరిశీలనలో, అప్పీలుదారు దాఖలు చేసిన అనేక దరఖాస్తులు సమాచారాన్ని పొందడం కంటే ఫిర్యాదుల పరిష్కారం, వివరణలు, చర్యలపై ప్రశ్నలు, Action Taken Reports, ఊహాగానాలు, వ్యక్తిగత ఫిర్యాదులు మరియు మూడవ వ్యక్తులకు సంబంధించిన అంశాల చుట్టూ తిరుగుతున్నట్లు గుర్తించింది.
పునరావృత దరఖాస్తులపై కమిషన్ పరిశీలన
ఒకే లేదా దాదాపు ఒకే అంశంపై గతంలో సమాచారం అందించిన తరువాత కూడా మళ్లీ మళ్లీ RTI దరఖాస్తులు, మొదటి అప్పీళ్లు మరియు రెండవ అప్పీళ్లు దాఖలు చేయడం వల్ల ప్రజా అధికార సంస్థలతో పాటు సమాచార కమిషన్ సమయం మరియు వనరులపై అదనపు భారం పడుతుందని కమిషన్ పేర్కొంది.
RTI చట్టం పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు రూపొందించిన ప్రయోజనకరమైన చట్టం అయినప్పటికీ, దానిని అంతులేని ఉత్తరప్రత్యుత్తరాలు, పునరావృత ప్రశ్నలు, వ్యక్తిగత ప్రయాజనాల కోసం లేదా ప్రజా అధికారుల సాధారణ విధులకు ఆటంకం కలిగించే విధంగా ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించరాదని కమిషన్ పేర్కొంది.
అప్పీలుదారు వేల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, సమాచార కమిషన్ మరియు ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై కేసులను ఉద్దేశపూర్వకంగా పరిష్కరించడం లేదని చేసిన ఆరోపణలను కూడా కమిషన్ పరిశీలించింది. అయితే, కమిషన్ రికార్డుల ప్రకారం అప్పీలుదారు పెండింగ్‌లో ఉన్న అన్ని అప్పీళ్లను విచారణకు తీసుకుని పరిష్కరించిందని, పరిశీలన తేదీ నాటికి కేవలం 47 అప్పీళ్లు మాత్రమే విచారణకు పెండింగ్‌లో ఉన్నాయని నమోదు చేసింది.
ఒకవైపు ఎక్కువ సంఖ్యలో అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపిస్తూ, మరోవైపు వాటి పెండెన్సీ తగ్గించేందుకు కమిషన్ రోజుకు 30–40 కేసులను విచారణకు తీసుకోవడాన్ని ప్రశ్నించడం పరస్పర విరుద్ధమైన వైఖరని కమిషన్ పేర్కొంది.
అప్పీలుదారు కమిషన్ మరియు అధికారులపై చేసిన కుమ్మక్కు, ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం వంటి ఆరోపణలకు తగిన ఆధారాలు సమర్పించలేదని కమిషన్ పేర్కొంది. భవిష్యత్తులో కమిషన్ లేదా దాని అధికారులపై నిరాధారమైన, అవమానకరమైన లేదా తీవ్రమైన ఆరోపణలు చేయకుండా తగిన సంయమనం పాటించాలని అప్పీలుదారును కమీషన్ హెచ్చరించింది.
అప్పీలు దారు డబ్బుల డిమాండ్‌కు సంబంధించిన ఆరోపణలు
అప్పీలుదారు RTI దరఖాస్తుల ద్వారా వ్యక్తిగత వివరాలు, రైతుల భూములు మరియు ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, సంబంధిత వ్యక్తుల నుండి డబ్బులు డిమాండ్ చేసి వసూలు చేస్తున్నారనే ఆరోపణలను కూడా కమిషన్ పరిగణించింది.
కల్యాణదుర్గం రెవెన్యూ డివిజనల్ అధికారి, అప్పీలుదారుకు డబ్బులు ఇచ్చినట్లు ఆరోపణలు చేసిన వ్యక్తుల పేర్లు, వారు ఇచ్చిన మొత్తాలు, డబ్బులు తీసుకున్నట్లు పేర్కొన్న కారణాలు మరియు సంబంధిత వ్యక్తుల స్టేట్‌మెంట్లను సమర్పించినట్లు కమిషన్ గమనించింది.
ఈ ఆరోపణలు సరైన విచారణలో రుజువైతే, సమాచార హక్కు చట్టంలోని హక్కును దుర్వినియోగం చేసినట్లుగా పరిగణించవచ్చని కమిషన్ పేర్కొంది. అందువల్ల, సంబందిత పోలీసు అధికారులు ఈ ఆరోపణలపై తగిన విచారణ చేపట్టి, ఆరోపణలు రుజువైతే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చని కమిషన్ పేర్కొంది.
వైట్ రేషన్ కార్డు దుర్వినియోగంపై విచారణ
అప్పీలుదారు వద్ద భూములు, నివాస గృహం, ద్విచక్ర వాహనం ఉన్నట్లు మరియు ఆయన డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్నట్లు రికార్డుల్లోని సమాచారాన్ని కమిషన్ గమనించింది.
అలాగే, ఆయనకు జారీ చేసిన వైట్ రేషన్ కార్డు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులో ఉన్న అర్హత ప్రమాణాలు పాటించబడ్డాయా అనే అంశంపై కూడా సందేహాలు వ్యక్తమైనందున, జిల్లా కలెక్టర్ సంబంధిత అంశంపై సమగ్ర విచారణ చేపట్టి, అప్పీలుదారు నిర్దేశిత అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారా, వైట్ రేషన్ కార్డు పొందే సమయంలో ఏవైనా ముఖ్యమైన వాస్తవాలను దాచారా లేదా అర్హత లేని ప్రయోజనాన్ని పొందారా అనే అంశాలను పరిశీలించాలని కమిషన్ ఆదేశించింది.
అప్పీలుదారు తన BPL/వైట్ రేషన్ కార్డు ఆధారంగా పెద్ద మొత్తంలో సమాచారాన్ని ఉచితంగా అందించాలని కోరిన విషయాన్ని కూడా కమిషన్ పరిశీలించింది. ఈ సందర్భంగా Sardarji Bhagvanji v. State of Gujarat మరియు Mr. Tajender Singh v. Government of NCT of Delhi కేసుల్లో న్యాయస్థానాలు BPL హోదాను ఆధారంగా చేసుకుని భారీ మొత్తంలో సమాచారాన్ని ప్రజా వ్యయంతో కోరడంపై చేసిన పరిశీలనలను కమిషన్ పరిగణించింది.
వేలాది పేజీల పత్రాలను ఫోటోకాపీ చేసి అందించడం వల్ల ప్రభుత్వ యంత్రాంగం యొక్క సమయం, మానవ వనరులు మరియు ప్రజా ధనం భారీగా వినియోగించబడే అవకాశం ఉన్నందున, BPL హోదా పేరుతో అపరిమితమైన మరియు భారీ సమాచారాన్ని ఉచితంగా అందించడం సమాచార హక్కు చట్టం యొక్క ఉద్దేశం కాదని కమిషన్ పేర్కొంది.
కమిషన్ తుది పరిశీలన
సమాచార హక్కు చట్టం ప్రతి పౌరుడికి ముఖ్యమైన చట్టబద్ధమైన హక్కును కల్పించినప్పటికీ, ఆ హక్కును బాధ్యతాయుతంగా మరియు చట్టం నిర్దేశించిన పరిధిలో వినియోగించాల్సి ఉంటుందని కమిషన్ స్పష్టం చేసింది.
ప్రజా అధికార సంస్థల వద్ద ఇప్పటికే ఉన్న, గుర్తించగలిగే రికార్డులు మరియు సమాచారాన్ని పొందడం RTI చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే, ఒకే అంశంపై పదేపదే దరఖాస్తులు దాఖలు చేయడం, ఇప్పటికే ఇచ్చిన సమాధానాలపై మళ్లీ మళ్లీ అప్పీళ్లు దాఖలు చేయడం, వేల సంఖ్యలో ప్రశ్నలను సంధించడం, వివరణలు లేదా ఫిర్యాదుల పరిష్కారాన్ని RTI ద్వారా కోరడం ద్వారా ప్రజా అధికార సంస్థల సాధారణ పరిపాలనా పనితీరుకు అనవసరమైన భారం కలిగించరాదని కమిషన్ పేర్కొంది.
ఇప్పటికే సమాధానం అందిన అంశంపై, గత దరఖాస్తు లేదా సమాధానాన్ని ప్రస్తావించకుండా మళ్లీ దరఖాస్తు చేస్తే, సంబంధిత పౌర సమాచార అధికారి గతంలో ఇచ్చిన సమాధానాన్ని తెలియజేస్తూ, కారణాలతో దానిని తిరస్కరించవచ్చని కమిషన్ పేర్కొంది. ఇదే విధంగా, పునరావృత స్వభావం కలిగిన అప్పీళ్లను మొదటి అప్పీళ్ల అధికారి మరియు కమిషన్ కూడా ఇతర చట్టపరమైన కారణాలతో పాటు తగిన కారణంగా పరిగణించవచ్చని పేర్కొంది.
మొత్తంగా, బి. గోపాల్ దాఖలు చేసిన 102 బ్యాచ్ కేసులను సమగ్రంగా పరిశీలించిన కమిషన్, సమాచార హక్కు చట్టం యొక్క ఉద్దేశం పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని సాధించడం కాగా, పునరావృత, విస్తృత, ఫిర్యాదు ఆధారిత మరియు ఇప్పటికే సమాధానమిచ్చిన అంశాలపై వరుసగా దరఖాస్తులు, అప్పీళ్లు దాఖలు చేయడం ద్వారా ప్రజా వనరులను అనవసరంగా వినియోగించే విధానాన్ని చట్టం ప్రోత్సహించదని స్పష్టం చేసింది.
కమిషన్, సమాచార హక్కును ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వినియోగిస్తూ, అందుబాటులో ఉన్న రికార్డు సమాచారాన్ని చట్టం నిర్దేశించిన విధానంలో కోరాలని, అదే సమయంలో ప్రజా అధికార సంస్థలు కూడా చట్టప్రకారం అందుబాటులో ఉన్న సమాచారాన్ని పారదర్శకంగా అందించాలని కమిషన్ తన తీర్పులో స్పష్టం చేసింది.
Prajavartha Online Telugu News