అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి, సోమవారం తూర్పుమధ్య బంగాళాఖాతంలో వాయుగుండం గా, మంగళవారం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం గా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు.
బుధవారం ఉదయానికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలోని పశ్చిమమధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని వివరించారు.
దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు, తీరం వెంబడి 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున, వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News